స్వాతంత్య్రం వచ్చింది.. సాధించిందేమిటి?


వేల సంవత్సరాల విదేశీ దాడులను మన దేశం ఎదుర్కొన్నది. చివరిగా బ్రిటీషువారు 325 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. విభజించు, పాలించు నీతిని అనుసరించారు. 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో దేశ ప్రజలందరూ మత భేదాలు, వర్గ విభేదాలు మరచి భారతీయులుగా ఉద్యమించారు. ఇది బ్రిటీషువారికి రుచించలేదు. సన్యాసుల విప్లవం జరిగింది. బంకించంద్రచటర్జీ 'వందేమాతరం' అనే మంత్రాన్నిచ్చారు. విప్లవ కారులు బ్రిటీషుపాలకుల నెదిరించి, తెగించి ఉరికంబాల నెక్కారు. 


కాంగ్రెస్‌ పార్టీని 1885లో బ్రిటీషువాడు హ్యూమ్‌ స్వాతంత్రోద్యమ తీవ్రతను తగ్గించేందుకు ఓ సాధనంగా ప్రారంభింపజేశారు. తిలక్‌వంటి వారు స్వాతంత్య్రం నా జన్మహక్కు అన్నారు. సంపూర్ణ స్వాతంత్య్రం కోరుకున్నారు. 1905లో బ్రిటీషు వాళ్ళు బెంగాల్‌ను విభజించారు. వందేమాతరం ఉద్యమం దేశమంతా ఉధృతమైంది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న తూర్పు బెంగాల్‌ను మిగిలిన అధిక సంఖ్యాకులు కల్గిన పశ్చిమ భారత్‌ నుంచి వేరు చేసేందుకు లార్టకర్జన్‌ చేసిన కుట్ర ఇది. ఈ కుట్ర భగ్నమైంది. వందేమాతరం ఉద్యమంతో 1911లో బెంగాల్‌ విభజన రద్దయింది.

1911 జాతీయస్ఫూర్తి దేశమంతా విల్లి విరిసింది. తరువాతి కాలంలో కాంగ్రెస్‌ పార్టీ వేసిన తప్పటడుగుల వల్ల, ముస్లిం సంతుష్టీకరణ విధానం వల్ల, ముస్లిం లీగ్‌ బలపడింది. దేశ విభజనకు బీజంపడింది. 1942 ఆగస్టు 8న ముంబైలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల్లో మహాత్మాగాంధీ క్విట్‌ ఇండియా (దేశాన్ని వదలి వెళ్ళండి) నినాద మిచ్చారు. అది మొదలు బ్రిటీషు రాజరికానికి భారత్‌ వదలి వెళ్ళే పరిస్థితులు నిర్మాణ మయ్యయి. కాని ముస్లిం లీగ్‌ కోరికమేరకు ద్విజాతి సిద్ధాంతం బలపడసాగింది. బ్రిటీషువారు ఇదే అదునుగా దేశాన్ని మతప్రాతిపదికన విభజించి వెళ్ళిపోదా మనుకున్నారు. అదే జరిగింది. ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాలన్నీ జిన్నా నాయకత్వంలో పాకిస్తాన్‌గా ఏర్పడ్డాయి. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. 71 సంవత్సరాలు గడిచినా పాకిస్థాన్‌ వైఖరిలో మార్పు రాలేదు. దేశంలో పాకిస్థాన్‌ను సమర్థించే వ్యక్తులు, శక్తులు తగ్గలేదు. కారణం క్విట్‌ఇండియా అని నినదించే నాయకత్వం స్థానంలో 'నిట్‌' ఇండియా (దేశాన్ని కలిపివుంచే) నాయకత్వం వర్ధిల్లలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా విభజన రాజకీయాలు మానని నేతలవల్ల నేటికీ సంఘర్షణవైఖరి కొనసాగు తున్నది. నిజానికి స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంతా దేశానికి స్వాతంత్య్రం కావాలని ఉద్యమిస్తుంటే, అసలు స్వాతంత్య్రం ఎందుకు పోయిందని కాంగ్రెస్‌ ఉద్యమంలో పనిచేసిన డా|| కేశవరావు బలిరాం హెడ్గెవార్‌ ఆలోచించారు. రాజీలేని దేశభక్తితో నాయకులు పనిచేయాలని ఆయన కోరుకునేవారు. రెండుసార్లు ఆయన జైలు జీవితం అనుభవించారు. ఆయన సహచరుడు, ఆయనలాగానే ఆలోచించే శ్రీ సుబ్బారావు హర్థికర్‌ 1924లో కాంగ్రెస్‌ సేవాదళ్‌ను ప్రారంభించారు. 1925 డా||హెడ్గేవార్‌ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ను ప్రారంభించారు. భారతమాత బిడ్డలం అన్న భావన ప్రతి పౌరుడిలోను కలిగించాలన్న లక్ష్యంతోనే సంఘం గత 93 ఏళ్ళుగా పనిచేస్తోంది. దేశ కార్యం ఎవరో కొందరు నాయకులు చేసేది కాదు, ప్రతి పౌరుడు దేశసేవ చేయాలన్న ఉద్దేశ్యంతో సంఘం ప్రారంభ మయింది. దేశ ప్రజలను కలిపి ఉంచేందుకు, మనపూర్వులు మనకందించిన సంస్కారాలనేకం ఉన్నాయి. శ్రావణ పూర్ణిమనాడు వచ్చే రక్షాబంధన్‌ పండుగను దేశమంతా జరుపు కొంటారు. అనేక భావాలు, ఆచార వ్యవహారాలున్నా మనందరిదీ ఒకే భారతీయ సంస్కృతి అని తెలియ జెప్పడమే రక్షాబంధన్‌ సందేశం. 

- హనుమత్‌ ప్రసాద్‌