కేరళలో 75వేల మందిని రక్షించిన సేవాభారతి


కేరళలో 100 ఏళ్లలో కనీవినీ ఎరుగని వరదల నుంచి 75 వేల 6వందల మందిని సేవభారతి కాపాడింది. ప్రపంచంలో ఇలా ఒక స్వచ్ఛంద సంస్థ ఇంతమందిని కాపాడగలగడం ఇదే ప్రధమం. వరద ముంచెత్తిన ప్రారంభ దినాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నప్పుడు సేవభారతి కార్యకర్తలు ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడారు. ఈ ప్రయత్నంలో 2 కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.


వరద తీవ్రత అధికంగా ఉన్నన్ని రోజులు 14వేల మంది స్వయంసేవకులు 350 పడవలు, 75 అంబులెన్స్‌లు, 600 వాహనాలతో నిరంతరం సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. 298 సహాయ శిబిరాలు తెరిచారు. అందులో 650 మంది ఆరోగ్య కార్యకర్తలు బాధితులకు వైద్యసేవలు అందించారు. అంటు వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

వరద పూర్తిగా తగ్గిన తరువాత స్వయం సేవకులకు ఎదురైన మరో కఠిన పరీక్ష నివాస ప్రదేశాల్లో పేరుకుపోయిన బురదను తొలగించడం. ఇళ్ళు, పాఠశాలలు, ఆసుపత్రులు, బావులు, ఇతర భవనాలను శుభ్రంచేసే కార్యక్రమం కూడా స్వయంసేవకులు చేపట్టారు. 27వేల 6వందల ఇళ్ళు, 210 ప్రార్ధనామందిరాలు, 400 ఆసుపత్రులు, అనేక పాఠశాలలు, వేల బావులు, ఇతర భవనాలు ఇప్పటికే శుభ్రం చేశారు. ఇందులో 1లక్ష 20వేల మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.

సెప్టెంబర్‌ 1 నుంచి కేరళ రాష్ట్రం మొత్తంలో బురదను శుభ్రం చేయడానికి రెండు లక్షల మంది కార్యకర్తలు రంగంలోకి దిగారు. మారుమూల ప్రాంతాలను కూడా వాళ్ళు శుభ్రం చేయడానికి కషి చేస్తున్నారు.

వరద బాధితులకు అందించడానికి సేవభారతి 2155 టన్నుల ఆహార ధాన్యాలను, బట్టలు, గిన్నెలు సమీకరించింది. వివిధ జిల్లాల్లో 300 పైగా సామగ్రి వితరణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా 1లక్ష 5వేల కుటుంబాలకు సహాయ సామగ్రి అందిస్తారు.


రెండవ దశ సహాయ కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరాలు, సలహా కేంద్రాలు వివిధ జిల్లాల్లో ప్రారంభించారు. మూడవ దశలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి, పునరావాస ప్రక్రియను చేపడతారు.

వరద కారణంగా ఇబ్బందిపడుతున్న ప్రజలకు సాయం అందించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కేరళ ప్రాంత ప్రచారక్‌ పీఈబీ మీనన్‌ ఒక ప్రకటనలో కోరారు.

సాయం అందించేవారు దేశీయ సేవా భారతి కేరళ, ధనలక్ష్మీ బ్యాంక్‌, బ్రాంచి ఎస్‌ఎల్‌పురం. ఖాతా నెంబర్‌ 002700100040740, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌, DLXB0000027కు పంపించా లని కోరారు.