గాంధీ, లోహియా, దీన్‌ దయాళ్‌జీల ప్రతిరూపం స్వయంసేవక్‌ 'అటల్‌'


అటల్‌ బిహారీ వాజ్‌పాయి బాల్యం నుంచి అంతిమ క్షణం వరకు నిష్ఠవంతుడైన స్వయంసేవక్‌ గానే వ్యవహరించారు. దేశం, సమాజం కోసం నిస్వార్ధంగా పనిచేసే ఈ స్వయంసేవక్‌ తత్వం ఆయనలో నిత్యం ప్రకటితమయ్యేది.

విద్యార్ధి దశలోనే అటల్‌ బిహారీ 'క్విట్‌ ఇండియా' ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సత్యాగ్రహాలలో విద్యార్ధులకు నాయకత్వం వహించడం వల్ల ఆగ్రా జైలులో నెలరోజుల పాటు శిక్ష అనుభవించవలసి వచ్చింది. చదువు, స్వతంత్ర ఉద్యమం ఉన్నప్పటికి ఆయన నిత్య శాఖా కార్యక్రమాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు.

1952లో భారతీయ జనసంఘ్‌ ప్రారంభమైన ప్పుడు ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. పాంచజన్య, రాష్ట్రధర్మ అనే రెండు పత్రికలను ప్రారంభించారు. అనేక దేశభక్తియుతమైన కవితలు, పాటల ద్వారా జాతీయభావాన్ని పెంపొందించారు. 'ఎప్పుడూ అప్రమత్తతతో వ్యవహరించడం కూడా అటల్‌ బిహారీలో కనిపించే ఒక స్వయంసేవక్‌ లక్షణం. 1973లో అప్పటి ప్రధాని ఇందిర సంఘపై నిషేధం విధించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన అటల్‌ బిహారీ సమాచారాన్ని వెంటనే సంఘ కార్యకర్తలకు చేరవేశారు. నిషేధాన్ని ఎదుర్కునేందుకు సిద్ధమేనంటూ సర్‌ సంఘచాలక్‌ ప్రకటన కూడా చేయడంతో తన నిర్ణయాన్ని ఇందిర మార్చుకోవలసి వచ్చింది. ఆ తరువాత రెండేళ్లకు అధికారం కాపాడుకునేందుకు ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించారు. ప్రజాపోరాటం తరువాత అది తొలగించి ఎన్నికలు ప్రకటించారు. అప్పుడే విపక్షాలన్నిటితో కలిసి జనతా పార్టీ ఏర్పడింది. అందులోకి ప్రవేశించడం పట్ల జనసంఘ్‌ కార్యకర్తలు అభ్యంతరం చెప్పినప్పుడు అటల్‌ 'జనసంఘ్‌కు 25 ఏళ్ళు నిండాయి. బ్రహ్మచర్య ఆశ్రమం దాటి గహస్తాశ్రమంలో ప్రవేశించాలి. ఇది కూడా దేశ హితం కోసమే' అంటూ నచ్చచెప్పారు. కానీ జనతాపార్టీలో కొందరు ద్విసభ్యత్వ వివాదం లేవదీసినప్పుడు 'సంఘ మా మాత సంస్థ.పెళ్లి అయినంతమాత్రాన తల్లి, కొడుకుల బంధం తెగిపోదు.రాజకీయ పార్టీల్లో ఉన్న స్వయంసేవకులు ఆ పార్టీ నియమనిబంధనలను పాటిస్తారు. అంతమాత్రాన తమ మౌలిక సిద్ధాంతాన్ని, విలువలను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు' అని స్పష్టం చేశారు.

గాంధీజీ 'గ్రామస్వరాజ్యం', లోహియా 'సామాజికచింతన', దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ 'ఏకాత్మ మానవ వాదం' కలిసి ఆయనలో కనిపిస్తాయి.       

 - నరేంద్ర సెహగల్‌