రాఫెల్‌పై రాద్ధాంతం ఎందుకు?


దేశ రక్షణ విషయాలపై కూడా కొందరు రచ్చ చేస్తున్నారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై దేశప్రజల మనస్సుల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని 'బిజెపి బోఫోర్స్‌'గా చిత్రీకరించేందుకు తాపత్రయ పడుతున్నారు. ఫ్రాన్సు దేశంతో కుదిరిన రాఫెల్‌ ఒప్పందం అనేక సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. దసాల్ట్‌ పేరుగల ఫ్రెంచి విమాన నిర్మాణ తయారీ సంస్థ నుంచి 36 యుద్ధ విమానాలను కొంటున్నట్లు 3 ఏళ్ళ క్రితం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనచేశారు. 


రష్యా, అమెరికా, యూరపులను కాదని ఈ ఒప్పందం ఫ్రాన్సుతో ఖరారు చేశారు. భారత రక్షణ రంగం బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఈ విమానాలు రెండు ఇంజన్‌లు కలిగి ఉంటాయి. 2007లో 126 విమానాలను కొనుగోలు చేయాలని తీసుకున్న తన నిర్ణయాన్ని యుపిఎ ప్రభుత్వం పదేళ్ళు వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి ఏ నిర్ణయం తీసుకోలేక పోయింది. ఆ తరువాత యూపిఎ-2 హయంలో అనేక అవినీతి కుంభకోణాలు కూడా వెలుగు చూశాయి. కనుక ఇది సాధ్యంకాలేదు. దీనివల్ల భారత వైమానికసైన్య సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి, 2016లో ఈ ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం ప్రకారం తయారీ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానం భారతరక్షణ పరిశోధన సంస్థ డిఆర్‌డిఒతో పంచుకుంటాయి. ఇలా ప్రభుత్వం 'మేక్‌ ఇన్‌ ఇడియా'కు కొత్త భాష్యం ఇచ్చింది. ఇతరుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవడం కూడా ఇందులో భాగం.

రాఫెల్‌ ట్విన్‌ ఇంజన్‌ విమానం బహుళ ప్రయోజనాలు కలది. పదేళ్ళ క్రితం ధరలకు కొంత ద్రవ్యోల్బణం, డాలరు విలువ అన్ని తోడవుతాయి. అయినప్పటికీ ఈ ఒప్పందంలో అనేక విషయాలకు సంబంధించిన కొనుగోలు వివరాలు చూస్తే ఒప్పందం చౌకగానే జరిగిందని అర్థం అవుతుంది. ఈ ఒప్పందంపై తుది నిర్ణయానికి రావడానికి ముందు 14నెలలపాటు ధర, ఇతర అంశాల గురించి ధరల ప్రైస్‌ నెగోషియేషన్‌ కమిటీ, కాంట్రాక్టు నెగోషియేషన్‌ కమిటి చర్చలు జరిపాయి. ఇవి లేకుండా ఏ ప్రభుత్వమూ పని చేయదు. ఆ తరువాత భద్రతపై క్యాబినెట్‌ కమిటి ఈ అంశాలను పరిశీలించి ఆమోదం తెలిపింది. ఆ తరువాతనే ఒప్పందం ఖరారు చేశారు. ఇవేవీ లేకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకుందని కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదు.  పైగా ఈ ఒప్పందంలో గోప్యత (ూవషతీవషవ) క్లాజు లేదని, కాబట్టి వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ యుపిఎ హయాంలో ప్రారంభ మైన ఈ ఒప్పందంలో ఆనాటి రక్షణ మంత్రి ఆంటోని గోప్యత క్లాజుపై సంతకాలు కూడా చేశారన్న విషయం ఈ విమర్శకులు దాచి పెడుతున్నారు. ఈ తరహ క్లాజు వుందని ఫ్రాన్స్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది కూడా.

ఫ్రాన్సులోని దసాల్ట్‌ సంస్థ అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ను భాగస్వామిగా చేసుకోవడం పట్ల కూడా కాంగ్రెస్‌ రాద్ధాంతం చేస్తోంది. నిజానికి రిలయన్స్‌ ది ఫిన్స్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ ఏరోస్పేస్‌, దసాల్ట్‌ ఏవియేషన్‌తో కలిసి దసాల్ట్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌గా జాయిట్‌ వెన్చర్‌గా ఏర్పడ్డాయి. ఇవి రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీలేదు.

కొందరు ఆరోపించినట్లు ఇందులో కుంభకోణం ఆనవాళ్ళు మచ్చుకైనా కానరావు. దీనిని 'బిజెపి బోఫోర్స్‌'గా చిత్రీకరించాలని వారు చేస్తున్న ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే బోఫోర్సు కుంభకోణంలో ఖత్రోచి లాంటి మధ్యవర్తులు బయటపడ్డారు. వాళ్ల బ్యాంకు ఖాతాలు బయటపడ్డాయి. బ్యాంకు ఖాతాల్లోకి చేరిన మొత్తాలు తెలిసొచ్చాయి. ఇవన్నీ సాక్షాత్తు స్వీడన్‌ ప్రభుత్వపు విచారణలోనే బయటపడ్డాయి. కానీ రాఫెల్‌ ఒప్పందం ఫ్రాన్స్‌, భారత ప్రభుత్వాల మధ్య జరిగింది. ఇందులో మధ్యవర్తులెవరూ లేరు.

- హనుమత్‌ ప్రసాద్‌