ఐకమత్యమే బలం


అవగాహన, సంస్కరణ, పురోగతి కోసం షికాగోలో ప్రపంచ హిందూ సదస్సు
 
'ఓ హిందూ! మేలుకో!' అన్న స్వామి వివేకానందుని పిలుపునకు మేల్కొని వచ్చిన హిందూ జనవాహినితో నిండినట్టే కనిపించింది షికాగో నగరం. ఈ సెప్టెంబర్‌ 7,8,9 తేదీలలో అక్కడే రెండవ విశ్వహిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. మళ్లీ ఒక్కసారి ప్రపంచదేశాలు ఆ నగరం వైపు చూశాయి. 125 ఏళ్ల క్రితం ఈ నగరం నుంచే వివేకానందుడు చేసిన గర్జనతో ప్రపంచం అటు దృష్టి సారించింది.
మళ్లీ ఇప్పుడు. వివేకా నందుని మహోన్నత వాణికి 125 ఏళ్లు నిండిన ఆ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అదే నగరంలో విశ్వహిందూ సమ్మేళనం నిర్వ హించడం గర్వకారణం. లాంబార్డ్‌ యార్క్‌ టౌన్‌ సెంటర్‌ ఈ సమ్మేళనానికి వేదికయింది. అరవై దేశాల నుంచి 2,500 ప్రతినిధులు హాజరయ్యారు. ఆర్థిక, విద్య, రాజకీయ, యువజన, మహిళ, మీడియా వంటి ఏడు అంశాలను చర్చించారు. నిపుణులుగా, కళాకారులగా, విద్యావేత్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా విఖ్యాతులైన 220 మంది హిందూ ప్రముఖులు ఆయా వేదికల మీద ప్రసంగించారు. అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో పాటు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ వంటివారు ప్రసంగిం చారు. వక్తలంతా ముక్తకంఠంతో ఒకటే నినాదం ఇచ్చారు -'హిందువులు ఐక్యం కావాలి'. 2014లో మొదటి విశ్వహిందూ సమ్మేళనం ఢిల్లీలో జరిగింది. 53 దేశాల నుంచి 1800 మంది హాజరయ్యారు. ఇది రెండో సమ్మేళనం. 2022లో మూడో సమ్మేళనం మరింత ఉత్సాహంతో బ్యాంకాక్‌లో జరుపుకోవాలని నిర్ణయించుకుంటూ షికాగో సమ్మేళనానికి వీడ్కోలు చెప్పారు. రెండో సమ్మేళనం ఆరంభంలో అతిథులందరికీ రెండు లడ్డూలు ఉన్న ఒక ప్యాకెట్‌ అందించారు. అందులో ఒకటి మెత్తని లడ్డు. రెండోది గట్టి లడ్డూ. మెత్తగా ఉన్న లడ్డూ ప్రస్తుత హిందూ సమాజానికి ప్రతీక అని, గట్టి లడ్డూ భవిష్యత్తులో పటిష్టం కావలసి ఉన్న హిందూ సమాజానికి ప్రతీక అని విశ్లేషించారు.

కృణ్వంతో విశ్వ మార్యం.. ప్రపంచాన్ని శ్రేష్ఠ భారతీయ ఆలోచనలతో ప్రభావితం చేయడం.. వసుధైక కుటుంబకం.. ప్రపంచమంతా ఒకే కుటుంబం.. ఈ రెండు సమున్నత లక్ష్యాల సాకార రూపమైన వేదాంత విజయ దుందుభి స్వామీ వివేకానందుడి బృహత్‌ చిత్రపటం సాక్షిగా అరవై దేశాల నుంచి వచ్చిన రెండున్నర వేలమంది హిందూ ప్రతినిధుల జయజయధ్వానాల నడుమ అమెరికాలోని షికాగో ఉన్న వెస్టిన్‌ లాంబార్డ్‌ యార్క్‌టౌన్‌ సెంటర్‌లో చరిత్రాత్మక ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ సదస్సు జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందు వులు వర్తమానం విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, భవిష్యత్తు భవ్య స్వప్నాలను ఎలా చేరుకోవాలన్న విషయంలో వేల గొంతుకలతో ఒకే స్వరంతో చర్చించి, నవ శకానికి నాంది పలికింది. విదేశ గడ్డ మీద సహస్రాబ్దాల భారతీయ చైతన్యా మృతాన్ని ప్రపంచానికి అందించి 'వయం అమృతస్య పుత్ర' (మనమంతా అమృత పుత్రులం) అనిపించింది. 'అవగాహన', 'సంస్కరణ', 'పురోగతి' అనే మూడు ముఖ్య లక్ష్యాలతో ఈ ప్రపంచ హిందూ సదస్సు ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రపంచమంతా హిందూ ధర్మ వైభవాన్ని వ్యాపింపచేస్తున్న ప్రముఖులను సన్మా నించారు. విశ్వమంతటా అద్భుతమైన మందిరాల నిర్మాణం ద్వారా హైందవ వైభవ వ్యాప్తికై కృషి చేస్తున్న స్వామినారాయణ సంస్థ, గీతా తత్వాన్ని ప్రపంచ మంతటా ప్రచారం చేస్తున్న చిన్మయ మిషన్‌కు, హిందూ తత్వశాస్త్ర గ్రంథాలను ప్రచారం చేస్తున్న గీతా ప్రెస్‌, గోరఖ్‌ పూర్‌కు, కృష్ణ భావా మృతాన్ని పంచుతున్న ఇస్కాన్‌కు పురస్కారాలను అందచేశారు. సభ ప్రారంభంలో భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ, నొబెల్‌ సాహిత్య బహుమతి గ్రహీత వీఎస్‌ నయీపాల్‌ల స్మృతికి శ్రద్ధాంజలి ఘటించారు.