అందరి కోసం, అందరితో కలిసి పనిచేస్తుంది ఆర్‌ఎస్‌ఎస్‌ - డా. మోహన్‌ భాగవత్‌సెప్టెంబర్‌ 17,18,19 ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌  శ్రీ మోహన్‌ భాగవత్‌ సమాజంలో సంఘాన్ని గురించి ఉన్న అనేక సందేహాలకు సమాధానం ఇచ్చారు.  'భవిష్యత్‌ భారతం : సంఘ దృష్టి కోణం' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.


ఆధిపత్యం చెలాయించదు

 ''సంఘ్‌ ఆధిపత్యం చెలాయించాలని అనుకోదు. సమాజాన్ని పటిష్టపరచడం ద్వారా దేశ ప్రగతిని సాధించడమే సంఘ లక్ష్యం. సామూహిక భావన సంఘ సిద్ధాంతానికి మూలం. స్వయం సేవకులు అనేక మంచి పనులు చేస్తుంటారు. కానీ మేము వారి పేర్లను ఎక్కడ ప్రకటించము. ప్రతి పౌరుడు దేశం కోసం నిస్వార్ధంగా పనిచేయాలి. ఎందుకంటే అది అతని కర్తవ్యం.'' అని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌ అన్నారు. మూడురోజుల ఉపన్యాస కార్యక్రమంలో మొదటి రోజున ఆయన మాట్లాడారు. సంఘ కార్యం ఎంత ప్రత్యేకమైనదంటే దానిని ఏ ఇతర సంస్థ పనితోనూ పోల్చి చూడలేమని డా. మోహన్‌ భగవత్‌ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు.

''సంఘ్‌ని అర్ధం చేసుకోవాలంటే ఆ సంస్థను స్థాపించిన డా. కేశవ బలీరామ్‌ హెడ్గేవార్‌ నూ అర్ధం చేసుకోవాలి'' అని చెప్పిన డా. మోహన్‌ భాగవత్‌ సంఘ స్థాపకుల జీవితం, ఆయన ఆలోచనలను వివరించారు. డా. హెడ్గేవార్‌ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనడం, చివరికి పటిష్టమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రజలను సమాయత్తం చేయాలని, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలనే నిర్ణయానికి రావడం మొదలైన సంఘటనలను వివరించారు.

సమాజ సంఘటన కోసం...

సంప్రదాయ విలువల గొప్పదనాన్ని తెలుసుకునే విధంగా సమాజాన్ని జాగతం చేయాల్సిన అవసరం గురించి రవీంద్రనాథ్‌ ఠాగోర్‌, కమ్యూనిస్ట్‌ మేధావి ఏంఎన్‌రాయ్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మొదలైనవారు చెప్పిన విషయాలను డా. భాగవత్‌ తన ఉపన్యాసంలో గుర్తుచేశారు. పటిష్టవంతమైన జాతిగా రూపొందడానికి వివిధ సిద్ధాంతాలకు, పంథాలకు చెందినవారంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని డా. హెడ్గేవార్‌ గుర్తించారని ఆయన అన్నారు. ''సమాజంలో పరివర్తన తేవడానికి ప్రజలను సమాయత్తం చేయాలని ఆయన భావించారు. ఈ లక్ష్యంతోనే ఆయన 1925 విజయదశమి రోజున సంఘాన్ని స్థాపించారు'' అని డా. భాగవత్‌ అన్నారు.

 ''సంఘ్‌ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసమే పని చేస్తుందని, మరే పని చేయదని డా. హెడ్గేవార్‌ అన్నారు. మన దేశంలో భాష, మత, ఆహార, వేషం మొదలైన అన్నిటిలో ఎంతో భిన్నత్వం కనిపిస్తుంది. మరి ఇలాంటి భిన్నత్వం మధ్య ఏకత్వాన్ని సాధించడం ఎలా? ఈ హిందూస్థాన్‌లో అందరినీ కలిపి ఉంచేదే సంప్రదాయ విలవలతో కూడిన వ్యవస్థ. అదే హిందుత్వం. భారతదేశ సమైక్యతకు మూలమైన ఈ వ్యవస్థను హిందుత్వం అనే మాట తప్ప మరొకటి సరిగా వర్ణించలేదు'' అని డా. భాగవత్‌ అన్నారు.

రాజకీయాలు - సంఘం

సంఘ ద్వారా సంస్కారాలను, జాతియ భావనను అలవరచుకున్న స్వయంసేవకులు వివిధ సంస్థలను ప్రారంభించారు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇలా వివిధ సంస్థల్లో పనిచేసే స్వయంసేవకుల ఆలోచన, పనిచేసే విధానం సహజంగా ఒకటే ఉంటుంది. వీరి మధ్య సమ న్వయం, సహకారం కూడా ఉంటుంది. అంత మాత్రాన సంఘమే ఈ సంస్తలన్నింటిని నడుపు తోందని భావించరాదని డా. మోహన్‌ భాగవత్‌ తన రెండవ రోజు ప్రసంగంలో అన్నారు.

''రాజకీయ రంగంతో సంఘానికి సంబంధం ఏమిటని తరచూ ప్రశ్నిస్తుంటారు. నిజానికి సంఘ స్థాపకులు డా.హెడ్గెవార్‌ కాలం నుండి సంఘానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అయితే దేశానికి, దేశాప్రయోజనాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడటంలో, పరిష్కారాలను సూచించడంలో వెనకడుగు వేయం. సంఘ ద్వారా సంస్కారాలను పొందిన స్వయంసేవకులు తమకు తోచిన రాజకీయ పక్షంలో పనిచేసే స్వేచ్చ, అధికారం వారికి ఉంటాయి. అందుకు తగినట్లుగానే వాళ్ళు పనిచేస్తారు. ఈ విషయంలో సంఘ వారికి ఎలాంటి ఆదేశాలు, సూచనలు, సలహాలు ఇవ్వదు. కాబట్టి ఒక పార్టీని, లేదా ఆ పార్టికి చెందిన ప్రభుత్వాన్ని సంఘ ప్రభావితం చేస్తుందని, నాగపూర్‌ నుండే ప్రభుత్వం నడుస్తుందనే అభిప్రాయాలు, ఆలోచనలు నిరాధారమైనవి. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడానికి సంఘం ఎలాంటి ప్రయత్నం చేయదు. రాజ్యాంగబద్ధమైన పాలనా కేంద్రం (power Centre) ఒక్కటే ఉండాలన్నది సంఘ విశ్వాసం. రాజ్యాంగేతర పాలనా కేంద్రం మరొకటి ఉండ కూడదు.'' అని రాజకీయ రంగంతో సంఘ సంబంధం గురించి వివరించారు.

మహిళలు - సంఘం

''మహిళల గురించి కూడా సంఘ ఆలోచన సనాతన ధర్మం ఆధారంగా ఏర్పడినదే. సమాజంలో స్త్రీ, పురుషులు అన్ని విషయాల్లోనూ సమాన భాగస్వాములు. ఆ విధంగానే మహిళలకు సమాన స్థానం కలిగించాలి. ఉద్దరణ పేరుతొ మహిళలకు మేలు చేస్తున్నామనే భావనను సంఘం అంగీకరించదు. మహిళలకు సహజంగా చెందవలసిన స్థానాన్ని, గౌరవాన్ని వారికి ఇవ్వాలి. నిజానికి అనేక విషయాల్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువ సమర్ధతను కలిగిఉన్నారు. సమాజ కార్యంలో ఇద్దరిది సమాన భాగస్వామ్యం అనేదే సంఘ ఆలోచన'' అంటూ మహిళభ్యుదయం పట్ల సంఘ ఆలోచనను స్పష్టం చేశారు.

హిందూత్వం అంటే ఏమిటి?

హిందూ ధర్మం అంటే ఏమిటి, సంఘం 'హిందూ' అనే పదాన్ని ఉపయోగించడానికి గల కారణాలను వివరిస్తూ- ''సర్వ సమ్మతమైన, సార్వజనినమైన విలువలతో కుడుకున్నదే హిందూ ధర్మం. దీని ఆధారంగానే సంఘ పనిచేస్తుంది. పరమ సత్యాన్ని వివిధ పద్దతులలో ప్రకటించినా అది మారదు అనే మౌలిక విలువను ఆధారం చేసుకునే సంఘం పనిచేస్తుంది. వివిధత్వాన్ని గౌరవిస్తుంది, అంగీకరిస్తుంది. ఈ ధర్మాన్ని కొందరు సనాతన ధర్మం అని, కొందరు భారతీయ సంస్కృతీ అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఏ పదాన్ని ఉపయోగించిన సర్వమానవాళి కళ్యాణాన్నికోరుకున్న ధర్మాన్ని గురించే అందరం మాట్లాడుతున్నామని గుర్తుంచుకోవాలి. ధర్మం అంటే 'రిలీజియన్‌' కాదు. ధర్మం ఒక జీవన విధానం. ఈ జీవన విధానం ప్రకారం మనం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించాం. ఈ విలువలే మన రాజ్యాంగానికి ఆధారం. కాబట్టి భాష, ప్రాంతం, ఆచార వ్యవహా రాలు మొదలైనవి విభేదానికి, విద్వేషానికి కారణం కావు, కాకూడదు. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రా తృత్వం అనే భావనలు ఫ్రెంచ్‌ విప్లవం నుండి స్వికరించలేదని, అవి తథాగతుడు (బుద్దుడు) బోధిం చిన విలువలని ఒక సందర్భంలో డా.అంబేద్కర్‌ స్పష్టం చేసారు. ఈ విలువల ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగం బందుభావనను పెంపొందించడానికే ప్రాదాన్యతనిచ్చింది. అది పీఠికలో స్పష్టం చేసారు. సనాతన విలువల ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగాన్ని సంఘం గౌరవిస్తుంది, దానికి అనుగుణంగానే నడుస్తుంది.'' అని డా. భాగవత్‌ అన్నారు.

''అందరిని కలుపుకుని పోయే, శోషణ లేని, సద్భావనా పూర్వకమైన సమాజాన్ని నిర్మించాలని సంఘ ఆశిస్తోంది. మన పూర్వులు కూడా ఇదే కోరుకున్నారు. వారి నుండే ఈ భావాన్ని, విలువలను సంఘం స్వీకరించింది, అనుసరిస్తోంది. రవీంద్రనాథ్‌ టాగోర్‌, స్వతంత్ర వీర సావర్కర్‌, గాంధీజీ వంటి వారు ఇలాంటి సమాజాన్నే కోరు కున్నారు. కనుక సంఘం ఎవరిని వ్యతిరేకించదు. అందరితో కలిసి పనిచేస్తుంది.'' అంటూ సంఘ లక్ష్యాన్ని, అనుసరిస్తున్న విధానాన్ని తన ప్రసంగంలో డా. మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు.