ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్‌లో భారత్‌కు సభ్యత్వం


అత్యధిక ఓట్లు సంపాదించడం ద్వారా భారత్‌ అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ యుఎన్‌ హెచ్‌ఆర్‌సిలో సభ్యత్వాన్ని పొందింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి సభ్యులను ఎంపిక కోసం జరిగిన ఎన్నికలో భారత్‌ కు అత్యధికంగా 188 ఓట్లు లభించాయి. మానవహక్కుల కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన 18 దేశాల్లో భారత్‌ కూడా స్థానం సంపాదించింది. 
సభ్యత్వాన్ని పొందడానికి కనీసం 97 ఓట్లు సాధించవలసి ఉంటే 188 ఓట్లతో తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఇంత ఆధిక్యత సాధించడం అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న పరపతిని తెలియజేస్తోంది. 2019 జనవరి 1 నుండి మూడేళ్ళపాటు ఈ సభ్యత్వం ఉంటుంది. మొత్తం ఐదు ప్రాంతీయ విభాగాల్లో మొత్తం 18 దేశాలు సభ్యత్వం పొందాయి. 2006 మార్చ్‌లో ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ ద్వారా ప్రారంభమయిన మానవహక్కుల కౌన్సిల్‌లో 47 ఎన్నికైన సభ్య దేశాలు ఉంటాయి. ఇవి ప్రపంచమంతటా మానవ హక్కుల అమలును పర్యవేక్షిస్తాయి. ఈ కౌన్సిల్‌కు హై కమిషనర్‌గా ఉన్నప్పుడే జోర్డాన్‌కు చెందిన జైద్‌ రాడ్‌ అల్‌ హుస్సైన్‌ మొట్టమొదటి సారిగా కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగు తోందంటూ నివేదిక విడుదల చేశాడు. ఇందులో భారత్‌ సైన్యం కాశ్మీర్‌ ప్రజలపై అకృత్యాలకు పాల్పడు తోందని ఆరోపించాడు. ఈ నివేదికను భారత్‌ పూర్తిగా తిరస్కరించింది. ఇలాంటి పరిస్థితిలో అత్యధిక మెజారిటీతో భారత్‌ మానవ హక్కుల కౌన్సిల్‌కు ఎన్నిక కావడం చాలా ముఖ్యమైన పరిణామమని నిపుణులు భావిస్తున్నారు.