రామ మందిర నిర్మాణం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం - శ్రీ భయ్యాజీ జోషి


ముంబై కేశవ సృష్టిలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలల్లో చర్చించిన వివిధ జాతీయ అంశాలను గురించి సర్‌ కార్యవాహ్‌ శ్రీ సురేశ్‌ జోషి పత్రికలవారికి వివరించారు.

రామమందిరం కోట్లాదిమంది హిందువుల మనోభావాలు, విశ్వాసాలతో ముడిపడిన విషయ మని భయ్యాజీ అన్నారు. దీనిపై కోర్టు వేగంగా విచారణ పూర్తిచేయాలని అన్నారు. గత 30 ఏళ్లుగా రామమందిర నిర్మాణం కోసం హిందూ సమాజం ఉద్యమాన్ని సాగిస్తోందని ఆయన గుర్తుచేశారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరగాలని, అందుకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని హిందువులంతా కోరుకుంటున్నా రని ఆయన అన్నారు. సర్వోన్నత న్యాయస్థానికి చెందిన ముగ్గురు సభ్యుల బెంచ్‌ ఈ కేసు విచారణ జరిపింది. అయితే విచారణను బెంచ్‌ దీర్ఘకాలానికి వాయిదా వేసింది. విచారణ ఎప్పుడు చేపడతారని అడిగినప్పుడు మా ప్రాధామ్యాలు మాకు ఉంటా యంటూ బెంచ్‌ సమాధానమిచ్చింది. కేసు ఎప్పుడు విచారించాలన్నది న్యాయస్థానపు నిర్ణయంపైన ఆధారపడి ఉన్నప్పటికి కోర్ట్‌ ఇచ్చిన సమాధానం మాత్రం అవమానకరంగా ఉందని హిందూ సమాజం భావించింది.కోర్ట్‌లను సమాజం గౌరవించాలి. అలాగే కోర్ట్‌లు కూడా సామాన్య ప్రజానీకపు భావాలను, విశ్వాసాలను గౌరవించాలి.

రామ మందిర విషయమై ఆర్డినెన్స్‌ తీసుకువచ్చే అంశం ప్రభుత్వానికి సంబంధించినదని, దానిపై ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వమే చూసుకుంటుందని భయ్యాజీ అన్నారు. అయోధ్య రామజన్మభూమిలో ఒకప్పుడు మందిరం ఉన్నదని ఆధారాలు లభిస్తే అప్పుడు ఆ స్థలంలోనే మందిర నిర్మాణం జరగడానికి ప్రభుత్వం అంగీకరిస్తుం దంటూ నరసింహారావు ప్రభుత్వం కోర్ట్‌ కు ప్రమాణ పత్రాన్ని గతంలో దాఖలు చేసింది. అక్కడ ఒకప్పుడు మందిరం ఉండేదనడానికి తగిన ఆధారాలను పురాతత్వ శాఖ కోర్ట్‌ కు సమర్పించింది కాబట్టి అక్కడ మందిర నిర్మాణానికి ఎవరికి అభ్యంత రాలు ఉండనవసరంలేదని ఆయన అన్నారు.

కార్యకారిణి మండలి సమావేశాల గురించి చెపుతూ వీటిలో సంఘ కార్యాన్ని గురించి సమీక్ష జరిగిందని భయ్యాజీ వివరించారు. గత 6 ఏళ్లలో సంఘ కార్యం రెట్టింపు వేగంతో వృద్ధి చెందిందని అన్నారు. దేశం మొత్తంలో 35 వేల 5 వందల గ్రామాల్లో శాఖలు నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొత్తగా 1400 ప్రదేశాలకు చేరుకున్నా మని అన్నారు. మొత్తం 55825 శాఖలు నడుస్తున్నా యని చెప్పారు. ఒక సంవత్సరంలో 22వందల శాఖలు పెరిగాయని వెల్లడించారు.

సాప్తాహిక్‌ మిలాన్‌లు 17 వేల గ్రామాల్లో నియమితంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. నెలకొకసారి జరిగే సంఘమండలి కార్యక్రమాలు 9వేల గ్రామాల్లో జరుగుతున్నాయి. 61 వేల స్థానాల్లో సంఘ ప్రత్యక్షంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది స్వయంసేవకుల సంఖ్యలో లక్షకు పైగా పెరుగుదల ఉంది. 

దేశవ్యాప్తంగా సంఘం 1.70 లక్షల సేవ ప్రకల్పాలు నిర్వహిస్తోంది. ఈ సేవా ప్రకల్పాలు గ్రామీణ, గిరిజన, నగర ప్రాంతాల్లో నడుస్తున్నాయి. 25 పెద్ద ఆసుపత్రులు, 12 బ్లడ్‌ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఒక ఉపాద్యాయుడు ఉండే ఏకల్‌ విద్యాలయాలు 50 వేల కంటే ఎక్కువ గ్రామాల్లో నడుస్తున్నాయి. అనేక గ్రామాల్లో ప్రాధమిక చికిత్సాలయాలు ఉన్నాయి. అలాగే 10 వేల ఆరోగ్య కార్యకర్తలు సాధారణ వ్యాధులకు గ్రామాల్లోనే చికిత్స అందజేస్తున్నారు. 20 వేల మహిళల స్వయం సహాయ బృందాలు నడుస్తున్నాయి.  గత సంవత్సరం దేశ వ్యాప్తంగా 30వేల మంది స్వయంసేవకులు 2 వేల స్థానాల్లో 13 లక్షల మొక్కలు నాటారు. రాబోయే రోజుల్లో ఈ కార్యాన్ని మరింత విస్తరించడం జరుగుతుంది.