రోహింగ్యాలను తిప్పిపంపిన భారత ప్రభుత్వం


అస్సోంలో అక్రమ నివాసం ఏర్పరచుకున్న 15మంది రోహింగ్యాలను భారత ప్రభుత్వం వారి స్వస్థలమైన మయన్మార్‌ కు తిప్పిపంపింది. రోహింగ్యాల విషయమై దేశంలో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమ చొరబాటుదారులు అసోంలోని సిల్చార్‌లో 2012 నుండి నివసిస్తున్నట్లు పోలీసు దర్యాఫ్తులో తేలింది. వీరికి మయన్మార్‌ పౌరసత్వం ఉన్నట్లు కూడా బయటపడింది. వీరు రఖినే ప్రాంతానికి చెందినవారు.

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్‌ కింద పేరు నమోదై, భారత్‌ లో ఆశ్రయం పొందుతున్న శరణార్ధుల్లో 14వేలమంది రోహింగ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సహాయ కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థల లెక్క ప్రకారం వీరి సంఖ్య 40వేలకు పైమాటే.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా కాశ్మీర్‌, హైదరబాద్‌లలో వీరి ఉనికి ఎక్కువగా కనిపిస్తోందనే వార్తలు సర్వత్ర ఆందోళన కలిగించాయి.