విఘటన శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి - డా. మోహన్‌ భాగవత్‌
ప.పూ. సర్‌ సంఘచలక్‌ విజయదశమి ఉపన్యాసపు సంక్షిప్త రూపం

దేశ భద్రత

ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, సుసంపన్నం కావాలంటే అందుకు తగిన అవకాశం, పరిస్థితులు ఉండాలి. అవి ఏర్పడటానికి సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత అత్యవసరం. రక్షణ పరమైన మన సమస్యలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారంలో ఆ దేశాల సహాయ సహకారాలు పొందే విధంగా అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో మనం చాలావరకు ఫలితాన్ని సాధించగలిగాం. 

ఒకపక్క పొరుగు దేశాలతో స్నేహపూర్వక, శాంతి యుత సంబంధాలు కొనసాగించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూనే, దేశ భద్రత కోసం అవసరమైనప్పుడు శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించడంలో, సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో సైన్యం, ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెనుకాడలేదు. సైనిక బలగాల మనోధైర్యాన్ని మరింత పెంచేందుకు వారికి అవసరమైన ఆయుధాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందించారు. ప్రపంచంలో కూడా భారత్‌ ప్రతిష్ట బాగా పెరగడానికి గల అనేక కారణాలలో ఇది కూడా ఒకటి.

వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా మన సముద్ర సరిహద్దులను పరిరక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. భారత్‌ చుట్టుపక్కల వందలాది దీవులు ఉన్నాయి. అండమాన్‌ నికోబార్‌తో సహా ఈ దీవులన్నీ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. మన భద్రత దృష్ట్యా ఇక్కడ స్థావరాలను మరింత బలోపేతం చేయడం అత్యవసరం.

అంతర్గత భద్రత

సరిహద్దు భద్రతతోపాటు దేశంలో అంతర్గత భద్రత కూడా చాలా ముఖ్యం. దేశం లోపల, వెలుపల నుంచి సహాయం పొందుతూ దేశపు రాజ్యాంగం, సార్వ భౌమత్వం, చట్టాలను సవాలు చేసే, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే శక్తుల పట్ల కేంద్రం, అలాగే రాష్ట్రప్రభుత్వాలు కఠినంగా వ్యవహ రించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పారామిలటరీ బలగాలు ఈ విషయంలో చురుకుగానే వ్యవహ రిస్తున్నాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఇలాగే ఈ చర్యలను చేపడుతూ ఉండాలి. అయితే ఇలాంటి హింసాత్మక, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవారు మన సమాజంలో ఉన్నవారే. వీరు ఇలాంటి పనులకు పాల్పడటానికి కారణం కనీస సదుపాయాల లేమి, నిరుద్యోగం, శోషణ, వివక్ష మొదలైనవి. సమాజం తమను నిర్లక్ష్యం చేస్తోందనే భావం కూడా వారిని ఇలాంటి కార్యకలాపాలకు ప్రేరేపిస్తుంది. కనుక ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం వారిలోని ఈ భావాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి.ఆందోళన కలిగించే ధోరణులు

బలహీన వర్గాల ఉద్దరణకై సహానుభూతితో కూడిన స్పందన, పారదర్శకత, గౌరవం వంటివి చూపడంలో ప్రభుత్వాలు, మొత్తం సమాజం శ్రద్ద వహించాలి. ఇవి లేకపోతే అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురైన ఈ వర్గాలలో సమాజం పట్ల తిరుగుబాటు ధోరణి, ద్వేషం, తాము సమాజంలో భాగం కాదనే భావం తలెత్తుతాయి. దీనిని ఆసరాగా చేసుకునే స్వార్ధ ప్రయోజనాలకోసం పనిచేసేవారు దేశ వ్యతిరేక, నేర కార్యకలాపాలకు వారిని వాడుకుంటారు. గత 4 ఏళ్లుగా వివిధ అంశాల పేరు చెప్పి సాగుతున్న ఆందోళనలు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఈ ఆందోళన వెనుక స్వార్ధ అధికార రాజకీయాలు ఉన్నాయి. రాజ్యాంగం, సామాజిక సమరసత, చట్టం పట్ల ఏమాత్రం గౌరవం లేనివారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆడుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఈ వేర్పాటువాదం, హింస, విద్వేషం ఎంతవరకు వెళ్ళాయంటే దేశ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టి తమ పబ్బంగడుపుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

అయితే ఇలాంటి వేర్పాటువాద ధోరణులను పూర్తిగా నియంత్రించాలంటే సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వారు ఒకే మనస్సుతో, ఆలోచనతో వ్యవహరించగలగాలి. మతం, కులం, ఉపకులం, భాష, ప్రాంతాలు మొదలైన వాటిలో కనిపించే భిన్నత్వం నిజానికి ఏకత్వానికి ప్రకటీకరణ అని గ్రహించాలి.

కుటుంబంలో సంస్కారాల అవసరం

న్యాయవ్యవస్థ, పాలనా యంత్రాంగం, సంస్థలు మొదలైనవాటి గురించి ఏకాభిప్రాయం, సమాజంలో ఏకత్వభావం ఉన్నప్పుడే స్థిరత్వం, అభివృద్ధి, భద్రత సాధ్యపడతాయి. ఈ గుణాలను చిన్నప్పటి నుంచి ఇంట్లో, పాఠశాలలో, వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా కలిగించే ప్రయత్నం చేయాలి. స్వీయ నియంత్రణ, సానుభూతి, అభిమానం, కుటుంబ, సామాజిక బాధ్యత మొదలైన గుణాలను నవతరంలో కలిగించే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నామన్నది చూసుకోవాలి. మారుతున్న కాలంలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచమంతటా భావిస్తున్నారు.


ఎన్నికలు

ఈ దేశాన్ని ఎవరు నడిపిస్తారు? ప్రస్తుతపు విధానాలు సరిగా ఉన్నాయా? లేదా? మొదలైన విషయాలు అయిదేళ్ళకి ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం ప్రజల పవిత్రమైన బాధ్యత. ఇలాంటి ఎన్నికలు రాబోతున్నాయి. ఓటు హక్కు ద్వారా, భారత ప్రజానీకం జాతీయ స్థితిగతులు ఎలా ఉండాలో నిర్ణయిస్తారు. అయితే ఓటింగ్‌ రోజున మనం తీసుకునే నిర్ణయపు ప్రభావం, ఫలితం, అది మంచైనా, చెడైనా, చాలా సంవత్సరాలు, కొన్నిసార్లు జీవితాంతం అనుభవించాల్సివస్తుంది. ఆ రోజున తప్పితే మరెప్పుడు మనం దేశం గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. తీసుకున్న నిర్ణయం వల్ల విచారించవలసిన పరిస్థితి రాకూడదంటే వోటర్లు సంకుచితమైన కుల, భాషా, ప్రాంత భావాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని వోటు వేయాలి. అభ్యర్ధులు, పార్టీల విధానాలు, దేశ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడటంలో సామర్ధ్యం, గత చరిత్ర మొదలైనవి దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.

ప్రజాస్వామ్య రాజకీయాల ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఎవరూ పూర్తిగా సరైనవారు, పూర్తిగా అయోగ్యులని తేల్చి చెప్పలేము. అలాంటి పరిస్థితిలో అసలు ఓటు వేయకపోవడం లేదా ఎవరూ నచ్చలేదని చెప్పడం (NOTA) వల్ల లాభం అయోగ్యుడికే కలుగుతుంది. కనుక ప్రచార హోరులో కొట్టుకుపోకుండా తప్పనిసరిగా ఓటు వేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరం. 100 శాతం ఓటింగ్‌ జరగాలి. భారత ఎన్నికల సంఘం కూడా ఇదే అభ్యర్ధన చేస్తోంది. 100 శాతం ఓటింగ్‌ సాదించే దిశగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ స్వయంసేవకులు పౌరులుగా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా చేస్తారు.

భారతమాతను విశ్వగురు పీఠంపై ప్రతిష్టించేందుకు, భారత ప్రగతి రధాన్ని ముందుకు తీసుకుపోయెందుకు సంఘ స్వయంసేవకులకు సహాయసహకారాలు అందించి, ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములు కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.