దీప్తులు చిందించే దీపావళిచీకటి అజ్ఞానానికి సంకేతం...వెలుగు జ్ఞానానికి చిహ్నం. దీపం చిన్నదైనా చుట్టుపక్కల అంతా వెలుగును నింపుతుంది. అలాగే మనలో ఉన్న జ్ఞానం కూడా వెలుగులు విరజిమ్ముతూ తనతో పాటూ నలుగురిని ప్రకాశవంతులు చేయాలనేదే దీపావళి. అజ్ఞానందకారాన్ని పారద్రోలి జ్ఞాన కాంతులు విరజిమ్మే పండుగ ఇది. దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంది. అమావాస్య నాటి చీకటి రాత్రిని పిండారబోసినట్లు అనిపించే వెన్నెల వెలుతురులా దీపాలకాంతితో నిండి పోతుంది. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి ఇది.

చీకటిని తోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. సాధారణంగా ఈపండుగను ఐదురోజుల పాటు జరుపుకుంటారు. ధనత్రయోదశి, నరకచతుర్థశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయగా జరుపుకుంటారు. కొందరు మొదటి మూడురోజులు చేసుకుంటే మరికొందరేమో కేవలం చతుర్థశి, అమావాస్య రోజులే చేసుకుంటారు. సత్యభామదేవి  నరకాసురడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో దీపావళిని జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే  లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.

యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా అన్నట్లు ప్రపంచమంతా ఆ శక్తిస్వరూపిణే కొలువై ఉంది అని భారతీయులు విశ్వసిస్తారు. ఆడది అంటే అబల మాత్రమే కాదు సబల అని నిరూపించ నక్కర్లేదు. దానికి మన చరిత్రలోని ఉదాహరణలు కోకొల్లలు. ధైర్యం , సాహసం ఉంటే చాలు ఎంతటి రాక్షసులనైనా ఎదురించవచ్చు అని చెప్పుకోవడానికి ఉదాహరణ సత్యభామాదేవి. దీపావళికి సంబంధించిన. కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు. దాంతో శ్రీమహావిష్ణువు భూదేవి అంశ అయిన సత్యాదేవితో కలిసి నరకాసురుడిని సంహరిస్తాడు.

ఈకథ వల్ల మనం తెలుసు కోవాల్సిందేమిటి అంటే ధైర్యమూ, సాహసమూ ఉంటే విజయం వరించి తీరుతుంది అని మాత్రమే కాదు, మగువ ఎంత ఓపికతో ఉంటుందో తనవారికి ఏమైనా అయితే అంతే సాహసము కూడా చేస్తుంది అనడానికి సత్య ఒక ఉదాహరణ. అదేవిధంగా సమాజంలో చీడపురుగులు ఎక్కువయినప్పుడు అది తన ఇంటి నుంచే ఉన్నప్పుడు తన స్వలాభం కోసం కాకుండా సమాజశ్రేయస్సు కోసం పోరాడలని అప్పుడే భవ్యసమాజాన్ని నిర్మించగలమని సత్యభామా దేవి ద్వారా మనం తెలుసుకోవచ్చు.

- లతాకమలం