ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్‌.. పేరు మార్చిన యూపీ ప్రభుత్వం


అలహాబాద్‌ నగరపు పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తున్నట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 2019 కుంభమేళాకు ముందు అలహాబాద్‌ పేరు మార్చాలని యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం మొదటినుంచి అనుకుంటోంది.  గవర్నర్‌ కూడా పేరు మార్పకు సంబంధించి ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం ఆ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో అలహాబాద్‌  ఇక మీదట ప్రయాగ్‌ రాజ్‌గానే గుర్తింపు పొందుతుంది.

పేరు మార్పు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రయాగ్‌ రాజ్‌ చరిత్రను వివరించారు. గతంలో అలహాబాద్‌ పేరు ప్రయాగ్‌గా ఉండేదన్నారు. 16వ శతాబ్ధంలో మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ గంగా, యమున నదుల సంగం వద్ద కోటను నిర్మించు కున్నాడు. ఆ రాజకోటతో పాటు పక్కనే ఉన్న ప్రాంతాలకు ఇలహాబాద్‌గా పేరు పెట్టాడు. అక్బర్‌ తర్వాత ఆయన కుమారుడైన షాజహాన్‌ ఇలాహాబాద్‌ పేరును అలహా బాద్‌గా మార్చాడు.అలా గతంలో ప్రయాగ్‌గా ఉన్న పేరు మారిపోయింది. పేరు మారిన.. కుంభమేళ జరుగుతున్న ప్రాంతంతో పాటు.. నదుల సంగమం జరుగుతున్న ప్రాంతాల్ని మాత్రం ఇప్పటికే ప్రయాగ్‌గానే పిలుస్తున్నారు.

బ్రహ్మ మొదట యజ్ఞం చేసిన ప్రాంతమే ప్రయాగ్‌. రెండు నదుల సంగమం జరిగిన చోటే ప్రయాగ్‌. అలాంటిది అలహాబాద్‌లో మూడు నదులైన గంగ, యమున, సరస్వతి నదులు కలుస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతం నదుల సంగమానికి కంచుకోటలా మారింది. దీంతో అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌ రాజ్‌గా మార్చామని యోగీ ఆదిత్యనాధ్‌ తెలిపారు.