దీపావళి


 

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌|

దీపేన సాద్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే ||

జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనో వికాసానికి, ఆనందానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకొంటారు. దీపావళి పర్వదినం శరదృ తువులో వస్తుంది. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం ఇది.

నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మా కృత్యాలను ఆరికట్టడానికి శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా తరళివెళ్తాడు. భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ నరకాసురుడిని వధిస్తుంది. ఆరోజున నరకచతుర్ధశిగా ఇతిహాసంలో ప్రసిద్ధి చెందింది. నరకాసురుడి పీడ విరగడ అయ్యిందన్న సంతోషంతో మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకొంటారు. ఈ సంబరాలు జరుపుకొనే రోజు అమావాస్య కావటంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి, బాణసంచా కాల్చుకొన్నారు. కాలక్రమేణా అది 'దీపావళి' పర్వదినంగా స్థిరపడింది.

శ్రీరాముడు లంకలోని రావణుని సంహరించిన అనంతరం సతీసమేతంగాఅయోధ్యకు తిరిగి వచ్చినపుడు ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకొన్నారని రామాయణం తెలియజేస్తోంది.

చీకటిని పాద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకొంటారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. జాతి, కుల, మత, వర్గ విభేధాలను విస్మరించి సమైక్యంగా జరుపుకొనే పండుగ దివ్యదీప్తుల దీపావళి.

జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల దీపావళి.