క్రైస్తవ వసతిగృహంలో మతమార్పిళ్లు..


25 మంది చిన్నారులను రక్షించిన అధికారులు

హర్యానా అంబాలాలోని కళారహేలి ప్రాంతంలో ఒక క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న 'మెర్సీ హోం' అనే బాలల వసతి గృహం నుండి 25 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వీరిని తీసుకువచ్చిన వసతి గృహ నిర్వాహకులు చిన్నారులను మతమార్పి డికి గురిచేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.జువైనల్‌ జస్టిస్‌ చట్టానికి విరుద్ధంగా ఈ 'మెర్సీ హోం' నిర్వహిస్తున్నట్టు జిల్లా బాల సంరక్షణ శాఖ అధికారిని బల్జీత్‌ కౌర్‌ వివరించారు. 'మెర్సీ హోం'లో 3 నుండి 17 ఏళ్ల వయసుగల చిన్నారులు ఉన్నట్టు గుర్తించామని, బాలబాలిక లందరినీ ఒకే గదిలో ఉంచుతున్న విషయాన్నీ ఆమె గుర్తించినట్టు తెలిపారు. బాలబాలికలలో ప్రతి ఒక్కరి పేరునా చివరలో ఆశ్రమ నిర్వాహకుడు ఫిలిప్‌ మసిహ్‌  చివరి పేరు 'మసిహ్‌' చేర్చి, వారిని మనసులను ప్రలోభపెట్టి మతం మారుస్తున్న విషయం జిల్లా పోలీసు, బాలల సంరక్షణ శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొందరు పిల్లలకు తల్లిదండ్రులు ఉన్న విషయాన్నీ పోలీసులు కనుగొన్నారు.

కాపాడబడిన చిన్నారులను వైద్య పరీక్షల నిమిత్తం అంబాలా కంటోన్మెంట్‌ ప్రాంతంలో గల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పంచకుల మరియు యమునానగర్‌ ప్రాంతాల్లో గల ప్రభుత్వ వసతి గృహాలకు తరలించారు.

గతంలో 2014 సంవత్సరంలో కూడా ఈ 'మెర్సీ హోం' మీద జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ దాడులు నిర్వహించింది. ఆ సందర్భంగా 15 మంది చిన్నారులు పట్టే గదిలో 50 మందిని ఉంచుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా తమ 'మెర్సీ హోం' వసతిగృహం మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని, తాము క్రైస్తవులం అయినందునే తమపై ఆరోపణలు చేస్తున్నట్టు నిర్వహకులు ఫిలిప్‌ మసిహ్‌, ఆయన భార్య నరేందర్‌ కౌర్‌ ఫిలిప్‌ వ్యాఖ్యా నించారు.

క్రైస్తవ మిషనరీ వసతి గృహం బాలికల అదృశ్యం.. సిబ్బంది పాత్రపై దర్యాప్తు

ఒక క్రైస్తవ ఎన్జీవో ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల వసతిగృహం నుండి నలుగురు మైనర్‌ బాలికలు తప్పించుకున్న ఘటన పాట్నాలో చోటు చేసుకుంది. పాట్నాలోని పాటలీపుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆశా కిరణ్‌ బాలికల వసతి గృహం నుండి నలుగురు బాలికలు శనివారం అర్ధరాత్రి తప్పించుకుని వెళ్లిపోయారు. వారిలో ముగ్గురి వయసు 16 ఏళ్ళు కాగా మరొక బాలిక వయసు 12 సంవత్సరాలు. వసతి గృహం భవంతి నుండి చీరల సహాయంతో కిందకి చేరుకున్న బాలికలు సెక్యూరిటీ కంట పడకుండా తప్పించుకోవడం గమనార్హం.

ది టెలిగ్రాఫ్‌ కధనం ప్రకారం ఆశాకిరణ్‌ బాలికల వసతి గృహాన్ని మాషల్‌ అనే క్రైస్తవ ఎన్జీవో నిర్వహిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం డిసెంబర్‌ 2000వ సంవత్సరంలో సొసైటీగా రిజిస్టర్‌ అయిన మాషల్‌ సంస్థ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ కింద లైసెన్స్‌ పొందిన ఇది నిజానికి పాట్నాలోని 'సిస్టర్స్‌ ఆఫ్‌ నోట్రే డేమ్‌' అనబడే క్రైస్తవ మిషనరీ సంస్థకు అనుబంధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆశాకిరణ్‌ బాలికల వసతి గృహాన్ని మే 2018లో తొమ్మిది మంది బాలికలతో ఆర్చిబిషోప్‌ రెవ్‌ విలియం డిసౌజా ప్రారంభించి నట్టు 'సిస్టర్స్‌ ఆఫ్‌ నోట్రే డేమ్‌' అధికారిక వెబ్సైటు ద్వారా తెలుస్తోంది.

ఘటనలో తప్పించుకున్న బాలికల్లో ముగ్గురు బీహార్‌ రాష్ట్రానికే చెందినవారు కాగా మరొకరు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన బాలిక. ఈ నలుగురిని గత నెలలోనే ఇక్కడికి తీసుకువచ్చినట్టు సమాచారం. ఘటనలో ఆశాకిరణ్‌ సిబ్బంది పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్టు పాటలీపుత్ర పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ తివారి తెలిపారు.

గత మార్చిలో ముజఫర్‌-పూర్లోని మరొక స్వచ్ఛంద సంస్థ నడిపే బాలికల వసతిగృహంలో 30 మంది బాలికలపై లైంగిక వేధిపుల ఘటన జరిగింది.