ప్రభుత్వ అరాచకాలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలుశబరిమలలోని అయ్యప్ప భక్తులపై కేరళ కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జిల్లా కేంద్రాలలో అయ్యప్ప భక్తులు శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద వందలాది మంది అయ్యప్ప మాలధారణలో ఉన్న దీక్షాపరులు  ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌ ప్రాంతం మొత్తం అయ్యప్ప భజనలతో మార్మోగి పోయింది. కేరళ దుష్ట ప్రభుత్వానికి గుణపాఠం నేర్పి, ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ కి సద్భుద్ది ప్రసాదించమంటూ భజనల ద్వారా అయ్యప్పను ప్రార్ధించారు.

శబరిమల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో గురుస్వామి రమణ మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులపై అత్యంత నిరంకుశ వైఖరితో వ్యవహ రిస్తోందని అన్నారు. బీజేపీ తప్ప ఏ ఇతర పార్టీలు కూడా భక్తులకు మద్దతు ప్రకటించకపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు.

కార్యక్రమంలో కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. కేరళ పోలీసుల తీరును ఖండించారు. పోలీసులు పాదరక్షలతో పవిత్ర స్థలంలో ప్రవేశించి, అమానుషంగా అయ్యప్ప భక్తుల ఉరుముళ్ళని తొలగించి, వాటిలో రాళ్లు, బాంబులు ఉంటాయేమో అని అనుమానాలు వ్యక్తం చేసి అవమానిస్తున్నారని అన్నారు.  ఇతర మతస్థుల ప్రార్ధనా మందిరాల వద్దకు పాద రక్షలతో వెళ్లే దమ్ము పోలీసులకు ఉందా అని పరిపూర్ణానంద అని అడిగారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యవహారశైలిని కూడా స్వామి ప్రశ్నించారు. ఒకవైపు రివ్యూ పిటిషన్‌ స్వీకరించలేం అని చెప్తున్న సుప్రీం కోర్టు మరోవైపు 22వ తేదీన ఓపెన్‌ కోర్టులో విచారణ జరుపుతామని అనడం ఏమిటని అన్నారు.