ప్రజాపోరాటం




క్రీ.శ-1528 బాబర్‌ ప్రధాన సేనాధిపతి అయిన మీర్‌ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమం అయింది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీ రాముని జన్మస్థలంలో మందిరం కోసం హిందువులు 500ఏళ్లుగా సాగిస్తున్న పోరాటపు సంక్షిప్త వివరాలు చూద్దాం

-    బాబర్‌ కాలంలో (క్రీ.శ1528-1530) 4 యుద్ధాలు జరిగాయి.

-    హుమాయున్‌ కాలంలో(క్రీ.శ 1530-1556) 10 యుద్ధాలు జరిగాయి.

-    అక్బర్‌ కాలంలో (క్రీ.శ 1556-1606) 20 యుద్ధాలు జరిగాయి.

-    ఔరంగజేబు కాలం లో (క్రీ.శ 1658-1707) 30 యుద్ధాలు జరిగాయి.

-    నవాబ్‌ షాదిత్‌ ఆలీ కాలంలో (క్రీ.శ 1770- 1814) 5 యుద్ధాలు జరిగాయి.

-    నసీరుద్దీన్‌ హైదర్‌ కాలంలో (క్రీ.శ 1814-1836) 3 యుద్ధాలు జరిగాయి.

-    వాజీద్‌ ఆలీషా కాలంలో (క్రీ.శ 1847-1857) 2 యుద్ధాలు జరిగాయి.

-    బ్రిటిష్‌ వారి హయాంలో (క్రీ.శ 1912-1934) 2 యుద్ధాలు జరిగాయి.

ఇలా 1934వరకూ హిందూ సమాజం మొత్తం 76 యుద్ధాలు చేసింది.

1528లో బాబర్‌ ప్రధాన సేనాని మీర్‌ బాకీ రామ మందిరం నాశనం చేసిన నాటి నుండి, ఈ వివాదం ఒక ఉద్యమంలా సాగుతోంది. 1528 నాటి నుండి అన్ని తరాల వారు రామ జన్మభూమి కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రతి తరంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

1934 సంవత్సరం..

అయోధ్యలో కొందరు ముస్లిములు ఒక గోవును హత్య చేయడంతో, హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆవును చంపిన కసాయి వాళ్ళని తుదముట్టించారు. ఆ తరువాత హిందువులు బాబ్రీ కట్టడంపై దాడి చేయడంతో దానికున్న మూడు గుమ్మటాలు దెబ్బతిన్నాయి. హిందువులు కట్టడాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, బ్రిటిషు వాళ్ళు హిందువులనుంచి బాబ్రీ కట్టడాన్ని స్వాధీనం చేసుకుని, దెబ్బతిన్న గుమ్మటాలను బాగుపరచమని హిందువులమీద జరిమానా విధించారు. 1934 సంవత్సరం నుంచి ఏ ముస్లిం బాబ్రీ కట్టడంలోకి ప్రవేశించ లేదు.

అయోధ్యలో ప్రస్తుతం ఉన్న ఆలయం స్థానంలో భవ్యమైన దేవాలయం నిర్మించాల్సిన అవసరం ఏమిటి?

రామ జన్మభూమి ఉద్యమం కేవలం ఇటుకలు, సున్నానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది దేశం, సంస్కృతులకు తిరిగి గౌరవం సాధించడం. ప్రజలు తమ గొప్ప గతాన్ని గుర్తుచేసే దేవాలయాలు నుండి ప్రేరణ పొందుతారు. కాబట్టి ఈ ప్రదేశంలో సరైన, పూర్తి స్థాయి ఆలయం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.

ఒకప్పుడు కొందరు జరిపిన దౌర్జన్యానికి, వినాశనానికి ఈనాటి ముస్లిములు దోషులవుతారా?

కారు. కానీ బాబ్రీ కట్టడంపై ఈనాటి ముస్లిముల దృష్టి ఏమిటి అనేది అసలు విషయం. వారు దాన్ని తమ పవిత్ర స్థలంగా భావిస్తుంటే అప్పుడు వారు బాబర్‌, ఇంకా ఇతరుల క్రూరమైన దాడులను తమ సొంతం చేసుకుంటున్నవారవుతారు. సమర్ధిస్తున్న వారవుతారు. ఈ దౌర్జన్యం, వినాశనంతో ఈనాటి ముస్లిములు తమను తాము దూరం చేసుకోవడం సరియైన పద్ధతి. హిట్లర్‌ నేరాలకు, ఘోరాలకు ఈనాటి జర్మన్లు క్షమాపణ కోరుకుంటారు. ఆ విధంగా వారు నాజీ ఇజాన్ని ఎంతమాత్రం సమర్థించరని అర్థమవుతుంది.

హిందువులు కేవలం మూడు పవిత్ర స్థానాలను (అయోధ్య, మథుర, కాశీ) మాత్రమే, అదీ న్యాయ స్థానాల ద్వారా లేక సంప్రదింపుల ద్వారా, శాంతి యుతంగా తిరిగి ఇవ్వమని కోరారు. ఇవేకాక అనేక వేలాది దేవాలయాలు దోపిడీకి, విధ్వంసానికి గురయ్యాయి. వాటిపై మసీదులు కట్టారు. అయినా వాటినన్నిటినీ తిరిగి ఇవ్వాలని హిందువులు కోరట్లేదు.