పవిత్ర గంగా ప్రక్షాళన ఉద్యమంలో కీలక ముందడుగు


పవిత్ర గంగా నది ప్రక్షాళన ఉద్యమంలో భాగంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన 'నమామి గంగా' ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. ప్రతిరోజూ దాదాపు కోట్లాది లీటర్ల వ్యర్ధాలను గంగానదిలో ప్రవేశ పెడుతున్న సిసామావు కాలువ నీటిని సమీపంలోని జాజ్మావు నీటి శుద్ధి కేంద్రానికి మళ్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సిసామావు ఆసియాలోనే పెద్ద కలుషిత నీటి కాలువ. దాదాపు గత 128 సంవత్సరాలుగా ఈ కాలువ ద్వారా 14 కోట్ల లీటర్ల కలుషిత నీరు, వ్యర్ధాలు గంగా నదిలోని భైరవ్‌ ఘాట్లో కలుస్తు న్నాయి. వీటిలో ఇప్పటిదాకా 8 కోట్ల లీటర్ల కలుషిత నీటిని ప్రభుత్వం విజయవంతంగా దారి మళ్లించి నప్పటికీ మిగిలిన 6 కోట్ల లీటర్ల కలుషిత నీటిని దారి మళ్లించడం సాధ్యపడలేదు. ఐతే ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 'నిగమ్‌' మరియు 'నమామి గంగా' ప్రాజెక్టు ఇంజనీర్ల కృషి ఫలితంగా ఇది ఇప్పటికి సాధ్యపడింది.

లైవ్‌ హిందూస్తాన్‌ సమాచారం ప్రకారం ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు యంత్రాల సహాయంతో ఈ కాలువ యొక్క ప్రవాహాన్ని అరికట్టడానికి తమ శక్తి మేరకు ప్రయత్నించారు. ఐతే ఈ కాలువ యొక్క పైప్‌ లైను బ్రిటిష్‌ కాలం నాటిది అయినందున తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు విజయవంతంగా ఈ కలుషిత నీటిని 9.5 కిలోమీటర్ల దూరంలోని జాజ్మావు నీటిశుద్ధి కేంద్రానికి మళ్లించగలిగారు.

2014లో భారత ప్రభుత్వం 20 వేల కోట్ల ఖర్చుతో పవిత్ర గంగానది ప్రక్షాళన కోసం 'నమామి గంగా' ప్రాజెక్టుని ప్రారంభించింది. గంగా నదిలో కలుస్తున్న కలుషితాలను కట్టడి చేయడం, నదీ జలాల పరిరక్షణ మరియు గంగానదికి పునర్వైభవం తీసుకురావడం ఈ ప్రాజెక్ట్‌ ముఖ్యోద్దేశాలు.