మతమార్పిడికి దారితీసే ప్రత్యేక కోడ్‌ఈ దేశాన్ని ప్రాంత, భాష, కుల, వర్గాల పేరున విభజించి, విచ్ఛిన్నం చేసి తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించిన శక్తులు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ అవి వేరువేరు రూపాల్లో, పద్దతుల్లో తమ విఘటన, వినాశకారి ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నాయి. వీటినే 'విచ్ఛిన్న శక్తులు' (బ్రేకింగ్‌ ఇండియా ఫోర్సెస్‌) అనవచ్చును. ప్రజలను, ముఖ్యంగా గిరిజనులను, వారి మూల సంస్కృతి, సభ్యతల నుంచి వేరుచేసి వారి ద్వారా తమ విఘటన, వినాశకారి విధానాన్ని అమలు చేయడానికి బ్రిటిష్‌ వారి కాలం నుంచి ఈ శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

అందుకు వారు అనుసరించే ఒక ముఖ్యమైన పద్దతి జనాభా విభజన. జనాభా లెక్కల సేకరణ పేరుతో దేశ ప్రజానీకంలో తామంతా భారతీయులం, హిందువులమనే భావాన్ని తుడిచి వేసే ప్రయత్నం జరిగింది. తాము వేరువేరు జాతులు, కులాలు, ఉపకులాలు, ప్రాంతాలకు చెందినవారమనే ఆలోచన వారికి కలిగించేందుకు బ్రిటిష్‌ వారు జనాభా లెక్కల సేకరణలో గిరిజనులు హిందువులు కాదనే వ్యాఖ్యానించారు. కులపరమైన విభజనను పెద్దది చేసి ఆ విభజనకు వెనుక ఉన్న సమైక్య భావాన్ని, ఏకాత్మ భావాన్ని దెబ్బతీశారు. దానితో ఇక్కడి ప్రజానీకం ముందు తాము భారతీయులమని, ఆ తరువాతే కుల గుర్తింపు అనే విషయాన్ని మరచిపోయారు. అది చివరికి కులాల కుమ్ములాటకు దారితీసింది. ఇప్పుడు కూడా అదే పద్దతిలో ప్రజలను మతపరంగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా హిందువులలో కొందరికి తాము హిందువులం కాదని, తమకు మతం లేదని నమ్మించి ఆ తరువాత వారిని మతం మారుస్తారు. తమకు ప్రత్యేక మత కోడ్‌ కావాలని, తమను అలా గుర్తించాలని కోరేవిధంగా కొందరిని రెచ్చగొడుతున్నారు. ఇలా వారిని మతం మార్చాలను కుంటున్నారు.

జాతీయస్థాయిలో మతానికి సంబంధించి ప్రచురించిన సమాచారం 8 వర్గాలుగా వర్గీకరించ బడుతుంది. వీటిని మతం కోడ్‌ అంటారు. అవి హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్‌, బౌద్ధ, జైన, ఓఆర్‌పి, మరియు ఆర్‌ఎన్‌ఎస్‌ అనగా తమ మతాన్ని ధ్రువీకరించని వారు. 1881 నుంచి 1941 జన గణన వివరాల ద్వారా తెలిసేది ఏమిటంటే 90 నుంచి 95 శాతం మంది గిరిజనులు తమను హిందువులుగా పేర్కొన్నారు. ఎస్టీలోని నాలుగు శాతం మంది ఈశాన్య ప్రాంతానికి చెందిన వారు తాము సెంగ్ఖాసి, రంగ్ఫ్ర, డొన్యిపోలో/సయి డొన్యిపోలో, బాతో మొదలైన మతాలకు చెందిన వారుగా పేర్కొన్నారు.

కొంతమంది ఎస్టీలు తాము బౌద్ధులమని పేర్కొన్నారు. కేవలం 1 నుంచి 2 శాతం మాత్రమే ఎస్టీలు క్రైస్తవ మతంలోకి చేరారు. షెడ్యూల్డ్‌ జాతి అనే వర్గీకరణ మొట్టమొదట 1950లో కొత్త రాజ్యాంగ సవరణలో ప్రస్తావించబడింది. కాని బ్రిటీష్‌ ప్రభుత్వం అంతకు ముందే వారిని ప్రకృతిని ఆరాధించే వారు, తెగలు, నేరతెగలు మొదలగు విధాలుగా విభజించి, వారిని సమాజం నుంచి వేరు చేయాలని ప్రయత్నించి కొంతవరకు సఫలీకృతమైంది కూడా. 2011 జనాభా గణన ప్రకారం సుమారు 10.5 కోట్లలో 80 శాతం ఎస్‌.టి.లు తమను హిందువు లుగా నమోదు చేసుకున్నారు. 10 శాతం మంది క్రైస్తవులు గాను, 7.3 శాతం మంది ఓఆర్‌పిలు గాను 1.5 శాతం మంది ముస్లింలు గాను, 0.75 శాతం మంది బౌద్ధులు గాను నమోదు చేసుకోగా 0.17 శాతం మంది మతమునకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు.

ఎవరైనా తమని హిందువులుగా పేర్కొనబడి ఉంటే, ఆ వ్యక్తి ఎస్టీగా ఉండడానికి అర్హుడు కాదని, అతను పొందే రిజర్వేషన్‌ ప్రయోజనాలని కోల్పోతాడని ప్రచారం చేయబడింది. సనాతన హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య తగ్గించేందుకు, కుట్ర పద్ధతిలో జాతి మత మార్పిడులలో పాలు పంచుకున్న మూకలు కొన్ని ఈ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఓఆర్పిల సంఖ్య పెంచడానికి ఎస్టీలను వేరు చేసే ప్రయత్నం చేయడం వల్ల వారు బలహీనమైతే భవిష్యత్తులో మతమార్పిడి సులభతరమవుతుంది. ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ఏజెన్సీలో గత 50 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాయి.

అఖిల భారతీయ వనవాసి కళ్యాణాశ్రమ్‌ ఈ కుట్ర గురించి గిరిజనులను హెచ్చరించింది.ఈ డిమాండు పట్ల ఆయా తెగల వారికే ఆసక్తి లేదని కూడా తెలిపారు. కాబట్టి ప్రత్యేక మత కోడ్‌ తమకు నష్టమే చేస్తుందని గిరిజనులు గ్రహించాలి.