రామమందిర నిర్మాణం కోసం చట్టం చేయవలసిందే - డా. మోహన్‌ భాగవత్‌


కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ భాగవత్‌ అన్నారు. అయోధ్య విషయమై విచారణ చేపట్టి ఒక నిర్ణయాన్ని త్వరితంగా తీసుకునేందుకు కోర్ట్‌ నిరాకరించడం, తమ ప్రాధామ్యాలు వేరని చెప్పడంతో చట్టం అనివార్యమవుతుందని ఆయన అన్నారు. కనుక చట్టం చేసే విధంగా ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 


రామమందిర నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకు లను తొలగించడానికి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వహిందూ పరిషత్‌ ఆద్వర్యంలో సెప్టెంబర్‌, 25న ధర్మ సభలు జరిగాయి. విదర్భలో జరిగిన హూంకార్‌ సభలో ఆయన మాట్లాడారు.

1992 సంవత్సరంలో కూడా అప్పటి  ప్రభుత్వం, కోర్ట్‌ల వైఖరితో విసుగుచెందిన హిందు వులు వివాదాస్పద కట్టడాన్ని కూల్చేశారని ఆయన గుర్తుచేశారు. 2003లో వివాదాస్పద కట్టడం క్రింద పురాతన హిందూ మందిరం ఉందని భారతీయ పురాతత్వ శాఖ తేల్చిందని, అక్కడ మందిరం ఉండేదని తేలితే స్థలాన్ని స్వాధీనం చేసుకుని హిందువులకు అప్పగిస్తా మని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత ఆ మాట మరచి పోయిందని డా.మోహన్‌ భాగవత్‌ అన్నారు. 2010లో రామ నజన్మభూమిలో మందిరం ఉండేదని స్పష్టం చేసిన అలహాబాద్‌ హైకోర్ట్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ పిటిషన్‌ను కొట్టివేసినా ఆ స్థలాన్ని ముగ్గురికి కేటాయిస్తూ నిర్ణయాన్ని ప్రకటించిందని అన్నారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ పై విచారణ చేపట్టడానికి ఏడేళ్లు తీసుకున్న సుప్రీం కోర్ట్‌ చివరికి  ఏ నిర్ణయం ప్రకటించకుండానే విచారణ వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఆ చట్టం కోసం ప్రజా ఉద్యమం అవసరమని ఆయన అన్నారు. 1980 నుండి రామ మందిర ఉద్యమాన్ని నిర్వహించిన వారే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని చేపడతారని ఆయన స్పష్టం చేశారు.

విదర్భతో పాటు అయోధ్య, నాగపూర్‌, మంగళూర్‌, హుబ్లీ, గౌహతి మొదలైన ప్రదేశాల్లో కూడా ధర్మ సభలు జరిగాయి. ఇందులో పాల్గొన్న సాధుసంతులు రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో కోర్టు తగిన నిర్ణయం తీసుకోవడంలేదుకనుక ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.