హిమాచల్‌లో సేవభారతి సేవలుహిమాచల్‌ ప్రదేశ్‌ కొన్ని ప్రాంతాల్లో సంవత్స రంలో 9 నెలలు విపరీతమైన మంచు కురుస్తుంది. ఆ సమయంలో ఆ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. కరెంట్‌ ఉండదు. ఆహార పదార్ధాలు దొరకవు. సాధారణ జనజీవనం కూడా స్తంభించిపోతుంది. మామూలు రోజుల్లో కూడా సదుపాయాలు అంతంతమాత్రమే.  ఇక సుదూర కొండల్లో విసిరేసినట్లుగా అక్కడ ఒకటి, ఇక్కడొకటిగా ఉండే గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అలాంటి సుదూర గ్రామాలే పంగి, వయారా.

2012లో హిమాచల్‌ సేవభారతి ఇక్కడ వివేకానంద హాస్టల్‌ ప్రారంభించే వరకు ఈ గ్రామాల్లో పిల్లలకు సరైన విద్యావకాశాలు లేవు. ఇప్పుడు ఈ గ్రామాలకు చెందిన పిల్లలు చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు కూడా వెళుతున్నారు. ఈ గ్రామాల్లోని అనాధ బాలలను కూడా సేవభారతి దత్తత తీసుకుం టోంది. అలా లుధ్బర గ్రామానికి చెందిన రింపి, ఆమె చెల్లెలుకు ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. అలాగే పావన అనే పేద మహిళ, ఆమె నలుగురు పిల్లలకు కూడా సేవభారతి దారి చూపింది. ఆ పిల్లలకు ఉన్న కండరాలకు సంబంధిం చిన వ్యాధికి ఉచితంగా వైద్యం అందజేసింది.

విద్యేకాక వైద్య సదుపాయం కూడా అంతంత మాత్రమైన కొండ ప్రాంతాల్లో ఆ సౌకర్యం కూడా కలిగించడానికి సేవాభారతి ముందుకు వచ్చింది. 2005లో రెండు అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. అధునాతన సదుపాయాలు కలిగిన ఈ అంబులెన్స్‌లు ఎప్పుడు గ్రామస్తులకు అందుబాటులో ఉంటాయి. అనేక ప్రదేశాల్లో రోగులకు వైద్యంతోపాటు ఆహార సదుపాయం కూడా కలిగిస్తున్నారు.  ఇప్పుడు ఈ పర్వత ప్రాంతాల్లో సేవభారతి అధ్వర్యంలో అనేక సాధారణ విద్య, వృత్తి విద్య సంస్థలు, స్వయముపాధి బృందాలు నడుస్తున్నాయి. సేవభారతి కార్యకర్తల సేవాభావంతో హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజల మంచు కష్టాలు తొలగిపోతున్నాయి.