ఆధునిక కాలంలో అశ్వమేధం చేస్తున్న అనీల్ దాగర్


ఉజ్జయిని వీధుల్లో గోడలమీద ఒక విచిత్రమైన విజ్ఞప్తి కనిపిస్తుంది. 'అనాధ శవం కనిపిస్తే తెలియజేయండి' అని. ఇది నగర పాలిక సంస్థ చేసిన సూచన కాదు. ఏ సేవా, ఆధ్యాత్మిక సంస్థ వ్రాయించిన విజ్ఞప్తి కూడా కాదు. దానితోపాటు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ ఆ నగరంలోనే ఉండే అనీల్‌ దాగర్‌ అనే వ్యక్తిది. 

గత 24 ఏళ్లుగా అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్న అనీల్‌ దాగర్‌ ఇప్పటికి 24వేల మందికి సద్గతులు కలిగించాడు. అంతేకాదు అనేకమంది అనాధాలకు ఆశ్రయం కల్పించాడు కూడా. ఇదంతా చేస్తున్న అనీల్‌ దాగర్‌ బాగా డబ్బున్నవాడు, విదేశాల నుండి పెద్ద మొత్తంలో నిధులు పొందుతున్నవాడూ కాదు. నగర పాలిక సంస్థలో సాధారణ ఉద్యోగి.

ఆధునిక అశ్వమేధం

సమాజ హితం కోసం యజ్ఞయాగాలు చేయాలని హిందూ శాస్త్రాలు చెపుతున్నాయి. అలాంటి యజ్ఞాలలో ముఖ్యమైనది అశ్వమేధ యాగం. ఇది సాధారణంగా రాజులు నిర్వహించే వారు. ఇది చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని, సమాజానికి మంచి జరుగుతుందని పేర్కొన్నాయి మన శాస్త్రాలు. అయితే కాలాను గుణంగా పద్దతులను, ఆచారాలను మార్చుకునే మంచి గుణం హిందూ ధర్మంలో ఉంది. ఆధునిక కాలంలో అశ్వమేధ యాగం చేయడానికి అనువైన పరిస్థితులు ఉండవు కాబట్టి అది చేయరాదని పెద్దలు నిర్దేశించారు. కానీ ఆ యాగం చేస్తే వచ్చే ఫలితాన్ని అనేక సమాజ ఉపయోగ కార్యాల ద్వారా చేయవచ్చని, చేయాలని చెప్పారు. అలాంటివాటిలో అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయడం ఒకటి. మహాకాలుని పుణ్యభూమి అయిన ఉజ్జయినిలో అలాంటి 'అశ్వమేధయాగాన్ని' 24 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు అనీల్‌ దాగర్‌. అతను చేస్తున్న ఈ పుణ్య కార్యానికి అనేక సత్కారాలు, సన్మానాలు పొందాడు కూడా. లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌, స్వామి సత్యమిత్రానందజీ మహరాజ్‌ వంటి వారి నుంచి సన్మానం అందుకున్నాడు. 60కి పైగా అవార్డులు కూడా పొందాడు.

1994లో 15ఏళ్ల వయస్సులో ఒక సాధువు సూచన మేరకు ఈ సత్కార్యాన్ని ప్రారంభించిన అనీల్‌ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. దహనసంస్కారాలు నిర్వహించడమేకాదు ఆస్తికలను సింధు, గంగ వంటి పుణ్యనదుల్లో కలపడం కూడా అతనే చేస్తాడు. ఈ పుణ్యకార్యంలో అతని భార్య కూడా సహకరిస్తోంది.


సమాచారం అందుకున్న వెంటనే ఆ విషయాన్ని పోలీస్‌ స్టేషన్‌కు అందజేస్తాడు. పోస్ట్‌ మార్టం మొదలైన వ్యవహారాలు పూర్తయిన తరువాత మతదేహాన్ని దహనం చేస్తాడు. సాధారణంగా అనాధ శవాల గురించిన సమాచారం అతనికి పోలీసుల నుంచి, స్థానిక పాలన యంత్రాంగం నుంచి అందుతుంది. ఉజ్జయినిలోని కాక చుట్టు పక్కల ఉన్న నగడ, మాక్షి, రాఘ్వి, మక్దోమ్‌ మొదలైన ప్రదేశాలకు కూడా వెళతాడు. అనాధ శవాలకు గౌరవప్రదంగా సంస్కారాలు నిర్వహించిన తరువాత అందుకు సంబంధించిన పూర్తి వివరాలు భద్రపరుస్తాడు. అలాగే వాటిని ఎప్పటికప్పుడు స్థానిక ఎస్పీ కార్యాలయంలో తెలియపరస్తూ ఉంటాడు. అతని సేవలు కేవలం హిందువులకే పరిమితం కాలేదు. అన్య మతస్తులకి కూడా అంతా శ్రద్ధగానే అందిస్తున్నాడు. గత 25 ఏళ్లలో 2500 అనాధ ముస్లిం శవాలకు అంత్యక్రియలు జరిపించాడు. అంతిమసంస్కారాల గురించి ఇప్పుడు కూడా అనేక అపోహలు, భయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనాధ శవాల సంస్కారాన్ని జరిపించడం కష్టమైన పనే.

అనాధాలకు ఆశ్రయం

అనాధాలను ఆదుకోవడం అనీల్‌ జీవన కార్యం అయింది. ముగ్గురు ఆడపిల్లలను చేరదీయడమేకాక వారికి విద్యాబుద్ధులు చెప్పించి పెళ్లిళ్లు కూడా చేశాడు. అలాగే 14 ఏళ్ల మానసిక రోగి అయిన ఆడపిల్లను ఇంటికి తీసుకువచ్చి వైద్యం చేయించాడు. ఆ అమ్మాయికి పూర్తిగా రోగం నయంకావడమేకాదు ఆమె అనీల్‌ కుమార్తెలా ఇంట్లో ఒక మనిషి అయిపోయింది. ఆ సమయంలో అసలు తల్లిదండ్రులు ఆమె ఆచూకీ తెలుసుకుని వస్తే సంతోషంగా వారికి ఆమెను అప్పచెప్పాడు. జూన్‌ 2018లో ఇద్దరు పిల్లల తల్లి అయిన ఒక మహిళను భర్త ఇంటినుండి గెంటేశాడు. ఆ సమయంలోనే ఆమె ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. ఏ దిక్కుతోచక అల్లాడుతున్న ఆ మహిళకు అండగా నిలిచాడు అనీల్‌.

ఆమె తరఫున పోలీసు ఫిర్యాదు ఇచ్చి పిల్లల శవాలకు అంతిమ సంస్కారాలు జరిపించాడు. అతను ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు కూడా. ఆ తరువాత ఆమెను డబ్బు ఇచ్చి ఇంటికి పంపాడు. తాను చేసే కార్యం కోసం అనీల్‌ దాగర్‌ ముక్తి సేవాసదన్‌ అనే సంస్థను కూడా ప్రారంభించాడు.