రఫెల్‌పై సుప్రీంకోర్టును కూడా తప్పుపడతారా?


రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయమై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. అయిదోతరం, అత్యాధునిక యుద్ధవిమానాల కొనుగోలు అవసరాన్ని ఈ తీర్పు సమర్థించింది. అనేక రోజులుగా ఈ విషయంలో అవినీతి జరిగిందంటూ రాహుల్‌ గాంధితో సహా ప్రశాంత్‌ భూషణ్‌ లాంటి కుహన మేధావులు అబద్ధపు ప్రచారం చేశారు. ధరల విషయమై ప్రభుత్వం కూడా పార్లమెంటులో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. 

కాని వివిధ ఛానళ్ళలో ప్రభుత్వంవైపు నుంచి, రక్షణ రంగ నిపుణులవైపు నుంచి, వైమానిక దళ అధికారుల నుంచి జరిగిన చర్చల్లో 9 శాతం చౌకగానే విమానాల కొనుగోలు ఒప్పందం జరిగిందన్న విషయం బయటకొచ్చింది. అయితే సుప్రీంకోర్టు కూడా ధరవరల గురించి సమాచారం బయటకు రావడం జాతి భద్రతకు ప్రమాదమన్న విషయంతో ఏకీభవించింది. శతఘ్నుల కొనుగోలులోనూ కుంభకోణం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకుంది. కార్గిల్‌ యుద్ధం తరువాత భారత వైమానిక దళ సామర్ద్యాన్ని పెంచే విషయం వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు ప్రణాళిక రూపొందింది. 2004 నుంచి 10 ఏళ్ళ పాటు ఈ విషయాన్ని యుపిఏ ప్రభుత్వం నాన్చింది. యుపిఏ సమయంలో కూడా హెచ్‌ఎఎల్‌తో విమానాల తయారీకి ఎపుడూ ఒప్పందం గురించిన చర్చలు జరగలేదు. హెచ్‌ఎఎల్‌కు ఇవ్వకుండా అనిల్‌ అంబానికి చెందిన రిలయన్స్‌ ఏరోస్ప్రక్టర్‌ లిమిటెడ్‌తో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ఒప్పందం చేసుకోవడాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు. నిజానికి అంబానీతో బాటు మరో వందమంది రఫేల్‌ విమానాల తయారీలో వివిధ విడి భాగాలనిచ్చేందుకు రఫేల్‌తో ఒప్పందం చేసుకున్నారు.  అధిక ధరలకు విమానాలు కొనడం, అవినీతి జరగడం, అనిల్‌ అంబానీతో ఆఫ్‌సెట్‌ భాగస్వామ్యం జరగడం వంటి మూడు విషయాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు విమానాల కొనుగొలు ప్రక్రియ స్థూలంగా నిర్ధిష్ఠ విధివిధానాలకు కట్టుబడే జరిగిందని తీర్పు చెప్పింది. కాని ప్రభుత్వం సీల్డు కవర్‌లో ఇచ్చిన వివారాలను, ప్రభుత్వం చేసిన వాదనలను కుడా మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరి, రాహుల్‌ గాంధీలు ప్రశ్నిస్తున్నారు. హెచ్‌ఏఎల్‌ అధికారులు కూడా తాము రఫేల్‌తో ఆఫ్‌సెట్‌ ఒప్పందాన్ని కోరుకోలేదని వివరణ ఇచ్చారు. అయినా ఈ తథాకథిత మేధావులు హెచ్‌ఏఎల్‌ పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారు.  భాగస్వామి ఎంపిక ప్రభుత్వ బాధ్యత కాదని, అది దసాల్ట్‌ కంపెనీకి సంబంధించినదని కూడా సుప్రీం కోర్టు తీర్పులో వెల్లడించింది.

రిలయన్స్‌ ఏరోస్పేస్‌, దసాల్ట్‌ ఏవియేషన్‌తో కలిసి దసాల్ట్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ జాయింట్‌ వెన్చర్‌గా ఏర్పడ్డాయి. ఇది రెండు ప్రైవేటు సంస్థల మధ్య ఏర్పడిన ఒప్పందం. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. భాగస్వాములుగా  మారడం వ్యాపారాలు నడవడం, వాణిజ్య రంగంలో చాలా సహజంగా జరిగే విషయం. దీన్ని అవినీతి పేర మోదీ ప్రభుత్వానికి అంటగట్టడం రాహుల్‌ గాంధీకే చెల్లింది. 12 లక్షల కోట్ల అవినీతి ఊబిలో కూరుకుపోయి 2014 ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీకి గురువిందగింజ నీతిని గుర్తుచేయాల్సిన అవసరముందా? సుప్రీంకోర్టులో రఫేల్‌ ఒప్పందాన్ని ప్రశ్నిస్తూ పలు పిటిషన్లను దాఖలు చేసిన ప్రశాంత్‌ భూషన్‌ వంటివారు తమ పిటిషన్లతో బాటు అనేక అసంపూర్తిగా ఉండే అబద్ధపు సాక్ష్యాలను కూడా జత చేశారు. అందులో ఒకటి, యుపిఎ హయంలో 126 యుద్ధ విమానాలపై చర్చల ప్రక్రియ 95 శాతం పూర్తయిందని త్వరలో ఒప్పందంపై సంతకం చేస్తామని 2015లో దసాల్ట్‌ కంపెని సిఇఒ వ్యాఖ్యానించారని చెప్పడం. లక్షల కోట్ల కుంభ కోణాలతో ఎన్నికట్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన యుపిఏ-2 ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చింది ఖాళీ ఖజానా. రఫేల్‌ యుద్ధ విమానాలు ఖరీదైనవి. రక్షణావసరాలను, అందుబాటులోవున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం 36 యుద్ధవిమానాలకు సంబంధించి 58,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. పదేళ్ళ క్రితం ధరలకు కొంత ద్రవ్యోల్బణం, డాలరు విలువ తోడయితే 126 యుద్ధవిమానాల కొనుగోలు భారీ ఆర్థిక భారం కావచ్చని మోదీ ప్రభుత్వం భావించి ఉండవచ్చు. అయినా దేశ రక్షణా వసరాలు రక్షణరంగ అధికారులకు, ప్రభుత్వాధినేతకు తెలిసినంతగా ఈ కుహనా మేధావులకు ఏం తెలుస్తుంది? ప్రభుత్వం తాము చెప్పినట్లు నడవాలని భావించడం, రక్షణావసరాలను రాజకీయం చేయడం, దేశద్రోహులకు ఊతమివ్వడమే అవుతుంది.

- హనుమత్‌ ప్రసాద్‌