ఆధ్యాత్మికత, ఆరోగ్యం కలగలిసిన సంక్రాంతి


సంక్రాంతి పండుగ రాగానే తెలుగు రాష్ట్రాలలో సంబరాలు అంబరాన్ని అంటు తాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు. పేరు ఏదైనా.. సంక్రాంతి అనగానే పాడి, పంటలతో ముడిపడిన పల్లె పండుగగానే గుర్తొస్తుంది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో వ్యవసాయా నికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతేకాకుండా శ్రమ జీవుల కష్టానికి ఈ పండుగ అద్దం పట్టేలా ఉంటుంది. పంటలు చేతికొచ్చే సమయానికి సంక్రాంతి పండుగను జరుపు కోవడం మరో విశేషం. ముఖ్యంగా వ్యవసాయా నికి.. బ్రతుకు దెరువుకు అండగా నిలిచే ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యదేవుణ్ణి కొలిచే ప్రత్యేక పండుగే ఈ సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అన్నపూర్ణను ఇంటింటికి అందించేందుకు తమకు సహకరించే పాడి పశువులకు రైతులు కృతజ్ఞతను చూపించడం సంక్రాంతి పండుగలో ఉన్న ఆత్మీయ భావాన్ని మన కళ్ళకు కడుతుంది.

ప్రాచుర్యంలో ఉన్న కథల ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును భారతీయులు పర్వదినంగా జరుపుకుంటున్నారు.  మకర రాశిలోని భానుడి సంక్రమణనే సంక్రాంతిగా అభివర్ణిస్తారు. పుష్యమాసం చివరి రోజుల్లో వచ్చే పండుగ సంక్రాంతి. ఈ పండుగను సూర్యమాణం ప్రకారం జరుపుకుంటారు. పుష్య మాసమంతా శుభకార్యాలు, పండుగలు, పుణ్యకార్యాలకు దూరంగా ఉండడం ఆచారం. అందులోనూ సకార్యాలకు పుష్యమాసాన్ని అంత అనువైనదిగా భావించరు. అందుకు శాస్త్రీయ మైన కారణం లేకపోలేదు. డిసెంబరు, జనవరి మాసం తొలి నాళ్ళలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు వివిధ రకాలైన రోగాల బారిన పడుతుంటారు. కాబట్టి వేడుకలు జరిపితే వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదు. ఇలా ఎంతో లోతైన ఆలోచనలతో మన పూర్వీకులు ఆచార, వ్యవహారాలను, సంప్రదాయాలను రూపొందించారు. అయితే సంక్రాంతి పండుగ నాటికి చలి ప్రభావం తగ్గుతుంది. అందుకే సంక్రాంతిని కేవలం పాడి, పంటల పండుగగానే కాకుండా.. శుభకార్యాలను ప్రారంభించేందుకు అనువైన కాలంగా పరిగణిస్తారు.

అయితే భారత దేశ దక్షిణ రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ఎంతో ఆడంబరంగా జరుపు కుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఇదే పెద్ద పండుగ. గుజరాత్‌, మహారాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో మకర సంక్రాంతి, ఉత్తరా యణంగా, ఉత్తరప్రదేశ్‌లోకి చేరి, పంజాబ్‌, హర్యాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లో లోహ్రి, మాఘి పండుగగా జరుపుకుంటారు. ప్రయాగ, గంగా, జమునా నదులలో అక్కడి రాష్ట్రాల ప్రజలు లొహ్రీ సందర్భంగా నది స్నానాలు ఆచరిస్తారు. ఉత్తరాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే జరుపు కుంటారు. తెలుగు రాష్ట్రాలలో మాత్రం మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగ సాగుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమలుగా వేడుకలను నిర్వహిస్తారు. భోగి రోజు పొంగలిని చేసి వరుణ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మరుసటి రోజు చేసిన పొంగలిని సూర్యునికి నివేదిస్తారు. మూడవ రోజు పాడి పశువులకు స్నానం పోసి.. అలంకరించి కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా గడుపుతారు.

సంక్రాంతి పండుగ సమయంలో చెప్పుకో వలసింది పిండి వంటల గురించే. నోరూరించడమే కాకుండా శరీరానికి పుష్టిని కూడా అందిస్తాయి. బియ్యంపిండి, గోధుమ పిండి, శనగపిండి, జొన్న పిండి ఇతర పిండ్లతో చేసే వంటకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా నువ్వులు బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు.పిండి వంటకాలు శరీరానికి పుష్టిని అందిస్తాయి. అదే సమయంలో వేడి కూడా చేస్తాయి. చలికాలంలో కలిగిన రుగ్మతలు తొలగేందుకు కావలసిన రోగ నిరోధక శక్తి పిండివంటలు, నువ్వులు బెల్లం ద్వారా శరీరానికి పెంపొందు తుంది.

పరమాన్నాలు, పాల పొంగలులలోని ప్రొటీన్లు, విటమిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకో వలసిన అవసరమే లేదు. ఎందుకంటే పిండి వంటల్లో వాడే జొన్నలు, గోధుమలు, బియ్యం పిండ్లతో హార్లిక్స్‌, బూస్ట్‌, బోర్రవిటాలంటూ పొడులను చేసి ఫ్లెవర్ల పేర్లతో వ్యాపారం  చేస్తున్న విషయాన్ని మనం చూస్తునే ఉన్నాం. విదేశీ సంస్థలు చెప్తే గాని నమ్మని స్థాయికి మన మనసు చేరిపోయింది. మన ఆచారాలలోనే మన పూర్వీకులు మన కోసం ఆరోగ్యకర ఆహార అలవాట్లను పొందుపరచారనే దానికి సంక్రాంతి పండుగ చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

- లతాకమలం