మదర్సాలు మూయకపోతే ఐఎస్‌ సమర్ధకులు పెరుగుతారు - షియా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షుడు వసీం రిజ్వీ


దేశంలోని ముస్లిం మతపాఠశాలలు (మదర్సాలు) వెంటనే మూసివేయకపోతే రాగల 15 ఏళ్లలో దేశంలో సగానికి పైగా ముస్లింలు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్‌కు సానుభూతి పరులు, సమర్ధకులుగా మారిపోతారని షియా వక్ఫ్‌ బోర్డ్‌ అధ్యక్షుడు వసీం రిజ్వీ అన్నారు. కనుక దేశం మొత్తంలో మదర్సా లను వెంటనే మూయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ''ఈ మతపాఠశాలలు ముస్లిములను సామాజిక, ఆధునిక విద్య నుంచి దూరం చేస్తున్నాయి. దేవబంద్‌, వహాబీ మదర్సాలు ఇస్లాం గురించిన తప్పుడు సిద్ధాంతాలు, సూత్రాలను పిల్లల మనస్సుల్లో నింపుతున్నాయి. వారిని జిహాద్‌ కోసం తయారుచేస్తున్నాయి. పిడి వాదాన్ని, వేర్పాటువాదాన్ని పిల్లల్లో కలిగిస్తున్నాయి'' అని రిజ్వీ ఆరోపించారు.

''పరిస్థితి ఇలాగే కొనసాగితే రాగల 15 ఏళ్లలో సగానికి పైగా ముస్లిములు తీవ్రవాద సంస్థ ఐఎస్‌కు సానుభూతిపరులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ దేవబంద్‌, వహాబీ మదర్సాల నుండే జిహాది పోరు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కనుక మన పిల్లలను వీటి నుంచి దూరంగా ఉంచాలి'' అని ఆయన ముస్లింలకు విజ్ఞప్తి చేశారు.

''దేశంలోని ప్రాధమిక మదర్సాలను వెంటనే మూయించాలని ప్రధానికి వ్రాసిన లేఖలో నేను కోరాను. ఎవరైనా దీనీ నేర్చుకోవాలంటే హై స్కూల్‌ విద్య తరువాత అనుమతించవచ్చును, దీనివల్ల ఇతర మతాలపట్ల ముస్లింలలో కలుగుతున్న ద్వేషాన్ని అంతం చేయవచ్చును. అలాగే మదర్సాలో చదవాలా వద్దా అన్నది నిర్ణయించుకోవడానికి పిల్లలకు కూడా అవకాశం లభిస్తుంది. చిన్నప్పటి నుంచి మదర్సాల్లో చదివించడం వల్ల వారి సామాజిక జీవితం పాడవుతోంది'' అని రిజ్వీ తెలిపారు.