భారత రక్షణరంగంలో మహిళలు.. (నారీ లోకం...)


మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే దేశాలలో ఎప్పటినుంచో భారత దేశం ముందంజ లోనే ఉంది... పురాణాల్లో నరకాసురున్ని వధించిన సత్యభామ నుంచి స్వతంత్ర సంగ్రామంలో బ్రిటీషు ముష్కరులనెదిరించిన ఝాన్సీ రాణి వరకూ మన దేశంలో యుద్ద క్షేత్రంలో కదం తొక్కిన వీర నారీ మణులకు లెక్కే లేదు. ఆడది అంటే వంటగదికే పరిమితం అనే నానుడినుంచి మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించేలా మహిళలు అభివృద్ధి చెందుతున్నారు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు.

ఏరంగం అయినా అందులో తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎన్నో సాధించినా కీలకమైన రక్షణ రంగంలోకి మాత్రం కొన్ని సంవత్సరాల క్రితం వరకూ కూడా సైన్యంలో స్త్రీల జోక్యాన్ని అసలు పడనివ్వలేదు. నాజూకుగా ఉండే ఆడవారు నానా కష్టాలు పడలేరు అనేది సాకుగా చెప్పేవారు. ఆ తర్వాత ఆర్మీలో వ్కెద్య విభాగంలో మహిళలను తీసుకోవడం ప్రారంభిం చారు. డాక్టర్లు, నర్సులుగా మాత్రమే మహిళలను సైన్యంలోకి తీసుకునేవారు. 1992లో వైద్యేతర విభాగాలైన ఏవియేషన్‌, లాజిస్టిక్స్‌, న్యాయవిభాగం, ఇంజనీరింగ్‌ ఇతర ఎగ్జిక్యూటీవ్‌ క్యాడర్లలోకి మహిళలను తీసుకోవడం ప్రారంభించారు. వారిని కేవలం షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ అధికారులుగా మాత్రమే తీసుకుని పరిమితం చేశారు. అంటే వీరికి పెన్షన్‌ రాదు. రిట్కెర్‌ అయిన తర్వాత వ్కెద్య సౌకర్యాలు అందవు. ఈ సందర్భంలో రక్షణ రంగంలో స్త్రీలతో కూడిన బలగాలనూ ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. అన్ని కీలక దళాలలోనూ మహిళలను తీసుకుంటోంది...ఆ క్రమంలో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మహిళలు చురుకైన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందు కుంటున్నారు.

ఇటీవల జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మహిళా దళం కవాతు రికార్డు క్రియేట్‌ చేసింది. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొన్న అసోం రైఫిల్స్‌ దళంలో మొత్తం మహిళలే ఉండటం విశేషం. అతి చిన్న వయసులో 30 ఏళ్లున్న మేజర్‌ కుష్బూ కన్వార్‌ నేతృత్వం వహించి శభాష్‌ అనిపించుకున్నారు. మహిళా దళం కవాతుకు నేతృత్వం వహించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు కుష్బూ. రాజస్థాన్‌కు చెందిన తాను బస్‌ కండక్టర్‌ కూతురునంటూ చెప్పుకొచ్చారు. అది మాత్రమే కాదు ఈ రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మరో విశేషం చోటుచేసుకుంది. 144 మంది ఇండియన్‌ ఆర్మీ పురుషుల దళాన్ని లీడ్‌ చేసిన తొలి మహిళగా హైదరాబాద్‌కు చెందిన భావన కస్తూరి గుర్తింపు పొందారు. స్వాతంత్య్రం వచ్చిన 71 ఏళ్ల తర్వాత పురుషుల సైనిక దళానికి మహిళ నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి. సాధన, పట్టుదలతో మహిళలు ఏదైనా సాధించొచ్చని ఈ సందర్భంగా మహిళలు నిరూపించారు. అందులో చాలామంది సైనిక కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం. గతంలో డిఫెన్స్‌ సర్వీస్‌ అంటే పురుషులు సైతం భయపడుతుండేవారు. అలాంటిది కాలం మారు తున్న క్రమంలో, తాము దేనికి తీసిపోమంటూ మహిళలు కూడా డిఫెన్స్‌లో చేరేందుకు ముందు కొస్తున్నారు. కఠినతరమైన శిక్షణను తట్టుకుని, తమకు అప్పగించిన బాధ్యతలను సవ్యంగా, సాఫీగా నెరవెరుస్తున్నారు. అవకాశముంటే చాలు ఏ రంగం లోనైనా దూసుకెళతామని నిరూపిస్తున్నారు నేటితరం మహిళలు. ఇది చాలా మంచి మార్పు అని ఈ మార్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- లతా కమలం