అఖండ సాంస్కృతిక సమ్మేళనం కుంభమేళా (విశ్లేషణ)


గంగా, గురువు, గోవు, గాయత్రీ, గీత అనే ఐదు భారతీయ సాంస్కృతిక చిహ్నాలు, శ్రద్ధ కేంద్రాలు. ప్రస్తుతం జనవరి 15 - మార్చ్‌ 4 వరకు 55 రోజుల పాటు ఉత్తర ప్రదేశ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థానం ప్రయగ్‌ రాజ్‌లో గంగా పుష్కరాలు జరుగుతున్నాయి. 12 సంవత్సలకు ఒకసారి జరిగే వీటినే కుంభమేళాగా పిలుస్తాము. మూడు నదుల సంగమం ''ప్రయాగ''ను భూమికి కేంద్ర బిందువు అని, బ్రహ్మ ఇక్కడే తపస్సు చేసి విశ్వసృష్టి చేసాడని పురాణాల్లో ఉన్నది. ఈ సంగమ ప్రాంతాన్ని నిత్యం దేవిదేవతల సంరిక్షి స్తుంటారని మత్స్య పురాణంలో మార్కేండయ మహర్షి తెలిపాడు. ఈ పవిత్ర ప్రాంతంలో నెలపాటు ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వలన మోక్షం లభిస్తుంది అని ప్రజల ప్రగాడ నమ్మకం.

భారతీయ చరిత్రలో ఒక కళంకం లాగ విదేశీ అక్రమదారులు పెట్టిన అలహాబాద్‌ అనే పేరును తిరిగి ప్రయగ్‌ రాజ్‌గా మార్చడం భావదాస్యపు సంకెళ్ళ నుండి బయటకు రావడమే. స్వతంత్ర భారత చరిత్రలో హైందవ చిహ్నాలకు తగినంత గౌరవం ఇవ్వాలనే తలంపుతో నాలుగువేల కోట్లకు పైగా ఖర్చుతో కుంభమేళకు వచ్చే 15 కోట్ల భక్తుల సౌకర్యార్థం వివిధ పనులు చేసింది ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన ''నమామిగంగే'' పథకంలో భాగంగా గంగా నదీ జలాలో కలుస్తున్న 100కు పైగా మురికినాలాల చెత్తను ఆపడం, లేదా వాటిని శుద్ధీకరణ చేయడం ద్వారా గంగా నీటి కాలుష్యం చాల వరకు తగ్గిందని భక్తులు అంటున్నారు.

కుంభమేళలో పవిత్ర గంగా నదిలో స్నానమా చరించడం ఒక భాగం మాత్రమే. ప్రముఖంగా ఇలాంటి పవిత్ర సంగమ కుంభమేళలో సాధువులు సన్యాసులు, పీఠాదిపతులు భారతీయ పురాణాల పట్ల చర్చ, హైందవంలో వస్తున్న మార్పులు, ఆధ్యాత్మిక వంటి మౌలిక అంశాలపై చర్చ చేసి నిర్ణయాలు తీసుకుంటారు. వివిధ పద్దతులలో సాధన చేసే వారు, కొత్తగా సన్యాస దీక్షను తీసుకునే వారు సైతం అక్కడ తారసపడతారు.

ఈ 2019 సంవత్సరంలో షెడ్యులు వర్గానికి చెందిన 32 సంవత్సరాల శ్రీ కన్హయ్య శివానంద గిరిని అతి పురాతన సంస్థ గా పేర్కొనబడే జునా అఖాడకు మహా మండలేశ్వరుడి గా నియమించి, మొదటి రోజు జరిగే షాహి స్నాన్‌లో పల్లకిలో ఊరేగించారు. దాంతో పాటు సమాజంలో హిజడాలకు సైతం సన్యాస దీక్ష ఇవ్వాలి అనే తలంపుతో కిన్నెర అఖడాను స్థాపించారు. విశ్వహిందూ పరిషత్‌ ఆద్వర్యంలో జరిగిన ధర్మ సంసద్‌ ఫిబ్రవరి 21 నాడు అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం చేపడతామని తీర్మానించింది.

ఈ విధంగా కొన్ని వేళ సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ ఆద్యాత్మిక, సాంస్కృతిక కుంభమేళలో భక్తుల సంఖ్యా, చైతన్యం పెరుగుతూనే ఉంది. ప్రజల్లో వస్తున్న చైతన్యం, పెరుగుతున్న అవగాహన సహించని హిందూ వ్యతిరేక శక్తులు భావస్వేచ్చ, మత స్వేచ్చ పేరుతో దాడి చేస్తూనే ఉన్నాయి.

ఒక పార్టీ నేత ఈ సంగమంలో అందరు నగ్నంగా ఉంటారు అని వ్యాఖ్యానించడం హిందువుల విశ్వాసాలను, కఠిన సాధన చేసే సాధువులను కించపరచడమే. ఒక ఆంగ్ల పత్రికలో కుంభమేళకు వచ్చేవారు అందరు నిరోధ్యుగులేనని రాయడం, ఉత్తర ప్రదేశ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న 4 వేల కోట్లు దుర్వినియోగం అవుతున్నాయి ఆరోపించడం, వీటికి తోడుగా క్రైస్తవ మత బోధకులు గంగ నదిలో స్నానం చేయడం పాపం అని బోధించడం ఒక ప్రణాళిక బద్దంగా భారతీయ మూలాలపై దాడి చేయడమే అని గ్రహించాలి.

 ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో కూడా భారతీయ సాంస్కృతిక, సంప్రదాయాలు గంగా ప్రవాహంలా నిరంతరం సాగుతూనే ఉంటాయన డానికి నిదర్శనం ఈ పవిత్ర కుంభమేళ.

 - కుంటి సురేందర్‌