ప్రముఖ సామాజిక కార్యకర్త నానాజీ దేశముఖ్‌కు భారతరత్నసరస్వతి శిశుమందిరాల వ్యవస్థాపకులు, గ్రామీణాభివృద్ధి సాధకులు శ్రీ నానాజీ దేశముఖ్‌కి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రచారక్‌గా జీవితం ప్రారంభించిన నానాజీ సంఘ స్పూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.


11 అక్టోబర్‌ 1916 తేదీన మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా కడోలి పట్టణంలో నానాజీ దేశముఖ్‌ జన్మించారు. వారి పూర్తిపేరు చండికాదాస్‌ అమతరావ్‌ దేశముఖ్‌. చిన్నతనం నుండి చదువు మీద అమితమైన ఆసక్తి కనబరిచేవారు. చదువు కోసం పేదరికాన్ని సైతం ఎదిరించారు. ట్యూషన్‌లో చేరడం కోసం కావాల్సిన డబ్బు సంపాదించేందుకు కూరగాయలు అమ్మేవారు.

నానాజీ చిన్నతనంలోనే లోకమాన్య బాల గంగాధర్‌ తిలక్‌ జాతీయవాద భావాలకు ఆకర్షితులైనారు. ఆ భావాలు నానాజీని సామాజిక, సేవా కార్యకలాపాల వైపుకు నడిపించాయి. అప్పటికే వారి కుటుంబానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం సర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ హెడ్గేవార్‌తో పరిచయం కలిగివుంది. డాక్టర్జీ తరచూ ఇంటికి వస్తుండటం కారణంగా నానాజిలో దాగివున్న దేశభక్తి, సేవా తత్పరత వంటి లక్షణాలను గమనించి, ఆరెస్సెస్‌ శాఖకు తీసుకువెళ్తుండేవారు. 

1940లో డాక్టర్‌ హెడ్గేవార్‌ మరణానంతరం వారి నుండి స్ఫూర్తి పొందిన అనేక మంది యువకులు ఆరెస్సెస్‌ పూర్తిస్థాయి కార్యకర్తలుగా మారారు. కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే  నానాజీ గోరఖ్‌ పూర్‌ చుట్టుప్రక్కల 250 సంఘ శాఖలను ఏర్పాటు చేశారు. చిన్నతనం నుండి నానాజీ విద్య అవసరాన్ని గుర్తించిన వ్యక్తి. ఇదే ఆలోచన కారణంగా వారు దేశంలోని మొట్టమొదటి సరస్వతి శిశుమందిరాన్ని 1950లో గోరఖ్‌ పూర్‌లో ఏర్పాటు చేశారు.

ఆ తరువాత భారతీయ జన సంఘ్‌ కార్య కలాపాలను జనంలోకి తీసుకెళ్ళారు నానాజీ. 1957 నాటికి జన సంఘ్‌ ఉత్తరప్రదేశ్‌ లోని అన్ని జిల్లాల్లో కూడా జన సంఘ్‌ శాఖలు ఏర్పడ్డాయి. దీనదయాళ్‌ ఉపాధ్యాయ మార్గదర్శనం, అటల్‌ బిహారీ వాజపేయి వాక్చాతుర్యంతో పాటు నానాజీ కార్యదక్షతల ఫలితంగా భారతీయ జన సంఘ్‌ ఉత్తరప్రదేశ్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది.

 వినోభా భావే ప్రారంభించిన భూదాన ఉద్యమంలో నానాజీ చురుగ్గా పాల్గొన్నారు. అదే విధంగా జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపునిచ్చిన సంపూర్ణ ఉద్యమానికి కూడా తన పూర్తి మద్దతు నిచ్చారు. జనతా పార్టీ ఆవిర్భావంలో నానాజీ ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ఇచ్చిన మంత్రిత్వ అవకాశాన్ని నానాజీ సున్నితంగా తిరస్కరించారు. తనకు రాజకీయాలు ఒక లక్ష్యం మాత్రమే తప్ప పదవులపై ఆశ లేదు అని అన్నారు.

రాజకీయాల నుండి తప్పుకున్నాక నానాజీ తన పూర్తి సమయాన్ని థానెలో 1969లో స్థాపించిన పండిట్‌ దీనదయాల్‌ పరిశోధనా సంస్థకు కేటాయించారు. చిత్రకూట్‌ ప్రాంతంలో చిత్రకూట్‌ గ్రామోదయ విశ్వవిద్యాలయం పేరిట దేశంలోనే మొట్టమొదటి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, దానికి ఉపకులపతిగా సేవలందించారు. చిత్రకూట్‌ గ్రామంలో జరిగిన గ్రామీణాభివద్ధి ఎంతో స్ఫూర్తివంతమైనవిగా భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్‌ అబ్దుల్‌ ఎంతగానో కొనియాడారు.

27 ఫిబ్రవరి 2010 న తన 94వ ఏట నానాజీ దేశముఖ్‌ తుదిశ్వాస విడిచారు