ధర్మరక్షణ ద్వారా సమరసతను సాధించిన సంత్‌ రవిదాస్‌

(ఫిబ్రవరి 19 సంత్‌ రవిదాస్‌ జయంతి)
సంత్‌ రవిదాసు చర్మకార వృత్తి అవలంబి స్తూనే గొప్ప సాధకుడయ్యాడు. ''భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. ఆయన సృష్టించిన ఈ మనుషులకు కులతత్వపు అడ్డుగోడలెందుకు?''అని ఆయన ప్రశ్నించారు. గుణకర్మలవల్లనే ఉత్తము డవుడని చాటిచెప్పిన మహాత్ముడు సంత్‌ రవిదాస్‌. సామాన్యజీవితంలో అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రవిదాస్‌ గొప్ప జ్ఞాని, గొప్ప కవి. స్వామి రామా నంద్‌, కబీర్‌, ఇతర సాధుసంతులతో ధర్మరక్షణకు యాత్రలు చేశాడు.

సంత్‌ రవిదాస్‌ జన్మించినకాలంలో హిందువు లపై మొఘలుల దౌర్జన్యాలకు అంతులేదు. వాటిని ఎదుర్కొని ధర్మాన్ని కాపాడేందుకు భక్తి ఉద్యమం ద్వారా ప్రయత్నం జరిగింది. భేదభావాలు లేని సమాజ నిర్మాణానికి స్వామీ రామానంద్‌ కృషి చేశారు. ఆయన ముఖ్యశిష్యులలో ఒకరే సంత్‌ రవిదాస్‌. ఈ శిష్యులలో సుమారుగా అందరూ నిమ్నవర్గానికి చెందినవారే. వీరందరూ సామాన్య ప్రజల మధ్య సరళమైన భాషలో ధర్మసందేశం అందించటం విశేషం. సంత్‌ రవిదాస్‌ నిరంతర భగవన్నామ స్మరణలోనే గడిపారు. నామస్మరణే భగవంతునికి పూజగా, హారతిగా, పూలమాలగా, తులసీ చందనంగా భావించారు. చదువుకున్నది తక్కువైనా గురువుల ద్వారా, సాధుసంతుల సాంగత్యంవల్ల అపరిమిత జ్ఞానం పొందాడు. ప్రపంచం లోని అన్ని ప్రాణుల్లో పరమాత్మ ఉన్నాడని విశ్వసించే నిర్గుణ బ్రహ్మోపాసనను సంత్‌ రవిదాస్‌ అనుసరించాడు.

కులభేదాలు తొలగనంతవరకూ మనుషులు ఒకటిగా జీవించలేరని సంత్‌ రవిదాస్‌ భావించారు. మనమంతా ఒకే జాతికి చెందినవారమని, పుట్టుకవల్లకాక చేసిన కర్మ ఆధారంగానే గౌరవం లభిస్తుందని రవిదాస్‌ బోధించారు. భక్తి ఉద్యమం ద్వారా అటు ధర్మరక్షణ, ఇటు సమానత్వ సాధనకు ఏకకాలంలో కృషి చేసిన మహాత్ముడు సంత్‌ రవిదాస్‌.