క్రైస్తవ మతాధికారులకు వాటికన్‌ రహస్య మార్గదర్శకాలు!


వాటికన్‌ అసలు స్వరూపం బయటపడింది. తమ క్యాథలిక్‌ చర్చిల్లో లైంగిక అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు, చర్చిల్లోని నన్లతో అక్రమ సంబంధాల ద్వారా పిల్లలకు జన్మనిచ్చే క్రైస్తవ మతాధికారులు ఎలా వ్యవహరించాలి అనే విషయంపై వాటికన్‌ 'రహస్య మార్గదర్శకాలు' సూచిస్తున్న విషయం బహిర్గత మైంది. దీనికి సంబంధించిన కధనాన్ని మొదట ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. ఈ అంశంపై వాటికన్‌ అధికార ప్రతినిధి అలెస్సాన్డ్రో జసోట్టి మీడియాకు ఇచ్చిన ప్రకటనలో 'చిన్నారులపై అత్యాచార నిందితులైన క్యాథలిక్‌ క్రైస్తవ మతాధికారులకు ప్రత్యేకమైన రహస్య మార్గదర్శకాలు రూపొందించిన నిజాన్ని వెల్లడించారు.
అయితే ఆ మార్గదర్శకాలు పొందుపరిచిన అధికారిక పత్రాన్ని బయట పెట్టలేమని, అది కేవలం వాటికన్‌ అంతరంగికంగా మాత్రమే అందు బాటులో ఉంటుందని ఆయన తెలియజేసారు.

క్యాథలిక్‌ క్రైస్తవ మతాధికారికి రహస్యంగా జన్మించిన విన్సెంట్‌ డోయల్‌ అనే వ్యక్తి ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికతో మాట్లాడుతూ.. తనకు న్యాయం చేయాల్సిందిగా గతంలో వాటికన్‌ ను ఆశ్రయించి నప్పుడు ఆ పత్రాన్ని తనకు చూపించారని అతని తెలియజేసాడు. ఐర్లాండ్‌ దేశానికి చెందిన 28ఏళ్ల విన్సన్ట్‌ ఫీజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. తనకు మతబోధనలు చేస్తున్న క్యాథలిక్‌ క్రైస్తవ మతాధికారే తన తండ్రి అన్న విషయం తనకు యుక్తవయసు వచ్చే వరకు తెలియదని, ఆఖరుకి ఆ నిజాన్ని తన తల్లి ద్వారా తెలుసుకుని ఈ విషయంపై వాటికన్‌ ను అశ్రయించినట్టు అతడు తెలియజేశాడు.

వాటికన్‌ తమ క్రైస్తవ మతాధికారులను కఠినమైన బ్రహ్మచర్యం పాటించమని కోరుతున్నట్టు చెబుతుంది. కానీ విచిత్రంగా క్యాథలిక్‌ చర్చిల్లో మహిళలు, చిన్నారులపై అక్కడి క్రైస్తవ మతాధికారుల లలైంగిక అత్యాచారాలు, అక్రమ సంబంధాల వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విస్మయం కలిగిస్తోంది.

ఇదే అంశంలో 2 వారాల క్రితం వాటికన్‌ క్రైస్తవ అధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌ అధికారిక ప్రకటన చేస్తూ క్యాథలిక్‌ చర్చిల్లోని మహిళలు, నన్లపై అక్కడి మతాధికారుల అత్యాచారాలు, అక్రమ సంబంధాల విషయాన్ని అంగీకరించారు. దీన్ని నివారించేందుకు మావంతు ప్రయత్నం చేస్తున్నామని పోప్‌ తన గల్ఫ్‌ దేశాల పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణంలో విలేకరుల ఎదుట తెలియజేసారు.

తాజాగా చర్చిల్లో మహిళలు, నన్లపై అక్కడి క్రైస్తవ మతాధికారుల లైంగిక అత్యాచారాలు, అక్రమ సంభంధాల విషయంపై చర్చించేందుకు గురువారం నుండి నాలుగు రోజుల సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామని వాటికన్‌ కు చెందిన అధికారి ఒకరు తెలియజేశారు. ఈ అంశంపై ప్రపంచ నలుమూలల నుండి రోమన్‌ క్యాథలిక్‌ క్రైస్తవ మతాధికారులంతా సమావేశం కావడం ఇదే ప్రథమం.