పాక్‌ ఏకాకి


పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశం హోదాను భారత్‌ వెనక్కితీసుకుంది. పాక్‌నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను 200 శాతం పెంచింది. సుమారు 50 కోట్ల డాలర్ల పాక్‌ ఉత్పత్తులపై ఈ ప్రభావం పడుతుంది. పాక్‌ నుంచి దిగుమతి అయ్యే వాటిలో ముడి పత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్‌, రంగులు తదితరాలున్నాయి.

ప్రపంచదేశాల్లో ఇప్పటికే అనేక వేదికలమీద పాకిస్తాన్‌ని ఏకాకి చేయడం జరిగింది. అమెరికా నుంచి సహాయం కూడా ఆగిపోయింది. చివరికి నేటి పాక్‌ ప్రధాని తన వివాసంలోని అలమందల్ని కూడా వేలం వేసే పరిస్థితి దాపు రించింది. స్వయంగా ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ పౌరులు కూడా చాలా సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా, రష్యా, బ్రిటన్‌, ప్రాన్స్‌, చైనా, జర్మనీ, జపాన్‌ సహ 25 దేశాల దౌత్యాధికారులకు పుల్వామా ఉగ్రవాదదాడి జరిగిన తీరును భారత్‌ వివరించింది. అమెరికా ఉగ్రదాడిని ఖండిం చింది. ముందుగా ట్రంప్‌ ప్రెస్‌ సెక్రటరీ శాంజర్స్‌, తరువాత ట్రంప్‌ వేర్వేరు ప్రకటనల్లో పాక్‌ను హెచ్చరించారు. సైన్యం వెళ్ళే సమయంలో పౌర వాహనాలు నిలిపివేయాలని, దీనిని జమ్ము కశ్మీర్‌లో రహదారులపై తక్షణం అమలుచేయాలని భారతప్రభుత్వం నిర్ణయించింది.

సింధూనదీ జలాల ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్‌ జలాలపై పూర్తి హక్కులు పాకిస్తాన్‌కు దక్కాలి. కాని మిగిలిన తూర్పు నదులైన రావి, చియన్‌, సడ్లేజ్‌ నదుల నీటిని 95 శాతం భారత్‌ వాడుకుంటోంది. మిగిలిన 5 శాతం పాక్‌లోకి ప్రవహిస్తోంది. తాజాగా భారత ప్రభుత్వం ఈ జలాలను కశ్మీర్‌, పంజాబ్‌లకు మళ్ళించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం షాపూర్‌-కాందిలో రావి నదిపై డామ్‌ నిర్మాణానికి కేంద్ర  కాబినెట్‌ గత డిసెంబర్‌లోనే ఆమోదం తెలిపింది. 485 కోట్లతో 100 మీటర్ల ఎత్తయిన డామ్‌ను నిర్మించేందుకు పనులు ప్రారంభించింది.