ఉగ్రదాడులకు ప్రతీకారం


జనవరి 26న గణతంత్ర దినోత్సవమయితే ఫిబ్రవరి 26న రణతంత్ర దినం అయింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జైషేమహమ్మద్‌ ఉగ్రవాదసంస్థ చేసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్‌భూభాగంలోకి చొచ్చుకొనివెళ్ళి బాలాకోట్‌, ముజఫరాబాద్‌, చకోటి ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. తెల్లవారుఝామున 3.30 ని||లకు మొదలై 21 ని||ల పాటు రెండవ సర్జికల్‌ స్రైక్‌ చేసింది. 350 మంది జైషేమహమ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. 
ప్రధాని మోదీ చెప్పినట్లుగానే ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ దాడులను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారని కథనాలు వచ్చాయి. 12 మిరాజ్‌ యుద్ధ విమానాలు, కొన్ని సుఖోయ్‌-30లు, గాలిలోనే ఇందనం నింపుకునే ఒక విమానం, రెండు అవాక్సు వ్యవస్థ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నియంత్రణ రేఖకు బాలాకోట్‌ పట్టణం 80 కి.మీ. దూరంలో ఉంది. దట్టమైన అరణ్య ప్రాంతంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఉగ్రవాదుల శిబిరంపై దాడులు జరిగాయి. జైషేమహమ్మద్‌ ఛీఫ్‌ మాసూద్‌ అజహర్‌ బావమరిది మౌలానా యూసుఫ్‌ అజర్‌ అలియాన్‌ ఉస్తాద్‌ ఘోరి ఈ శిబిరానికి నాయకుడు. ఉస్తాద్‌ ఘోరీ అనేక మంది జైషేమహమ్మద్‌ కమాండర్‌లు ఈ దాడుల్లో హతమయ్యారు. ఇందుకోసం 11 రోజులపాటు భారత వైమానిక దళం కసరత్తు చేసింది. రాడార్‌ విమానాల ద్వారా సర్వే చేసింది. ఈ దాడుల్లో 1000 కి.గ్రా. బాంబుల వర్షం  శత్రు శిబిరంపై మన సైన్యం కురిపించింది. 2016 యూరి ఉగ్రదాడుల తరువాత 11 రోజుల్లో భారత సైన్యం సర్జికల్‌ దాడులు నిర్వహించింది. 2019లో పుల్వామా దాడుల తరువాత 12 రోజుల్లో భారత సైన్యం వైమానిక దాడులు జరిపింది. నేటి భారత దేశ నాయకత్వం దేశరక్షణ విషయంలో కనబరచిన శ్రద్ధ 2004 నుంచి 2014 వరకు దేశాన్నేలిన యుపిఏ ప్రభుత్వం కనబరచలేదు. 2008లో నవంబరు 26న ముంబైలో తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడి జరిగి వందలమంది చనిపోతే 2014 వరకు నాటి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం చేష్టలుడిగి చూసింది తప్ప చేసిందేమీ లేదు.
భారత్‌ నేడు కనబరచిన పరాక్రమ పురుషార్థం చూసి 198 దేశాలలో ఒక్క దేశం కూడా పాకిస్తాన్‌కు కనీసం సానుభూతి తెలుపలేదు. గత నాలుగేళ్ళుగా 130 కోట్ల ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని ప్రధాని మోదీ ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ను నేరస్థుణ్ణి చేయడమే యిందుకు కారణం. పాకిస్తాన్‌ నేడు ఒంటరి అయిపోయింది. ఇజ్రాయిల్‌, రష్యా, అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇంగ్లాండు లాంటి దేశాలు సైతం భారత్‌ను నేడు సమర్థిస్తున్నాయి. భారత్‌ మెరుపుదాడులకు తీవ్ర అసనానికి గురైన పాకిస్తాన్‌ భారత గగనతలంలోకి యుద్ధ విమానాలను పంపింది. భారతసైనిక స్థావరాలపై దాడులకు దుస్సాహసం చేసింది. నిజానికి భారత వాయుసేన జరిపిన దాడులు కేవలం తీవ్రవాద శిబిరాలపై గురిపెట్టినది. భారత విదేశాంగ శాఖ ఫిబ్రవరి 27న ప్రకటన చేస్తూ ఇందులో పౌర సమాజంపైన, మిలటరీ స్థావరాలపైన ఏమాత్రం దాడి చేయాలని భారత్‌ భావించలేదు అని స్పష్టంచేసింది. కాని పాకిస్తాన్‌ జెట్‌ ఎఫ్‌-16 విమానాలతో తరువాత దాడికి తెగబడింది. ఎఫ్‌-16 విమానాలు కేవలం తీవ్రవాదులను మటుపెట్టేందుకే వాడాలని అమెరికా అంటోంది. ఆ రకంగా పాకిస్తాన్‌ అమెరికాతో జరిగిన ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించింది. అయితే భారత బలగాలు ఎఫ్‌-16 విమానాన్ని కూల్చివేయడం, ఆ కూల్చి వేయడంలో సంబంధిత వింగ్‌-21 విమానం నుంచి పైలట్‌ పారచూట్‌ సాహాయంతో దిగడం అది పాకిస్తాన్‌ భూభాగం కావడం, ఆ పైలట్‌ అభినందన్‌ను పాక్‌ జవానులు అరెస్టు చేయడం, తరువాత జెనివా ఒప్పందం ప్రకారం, భారత్‌ హెచ్చరికలు మీరకుండా భారత్‌కు 60 గంటల్లో క్షేమంగా అప్పగించడం జరిగిపోయింది. 
పాక్‌ వైమానిక దాడిని కూడా భారత్‌ ప్రపంచదేశాల దృష్టికి తీసుకెళ్ళింది. అంతర్జాతీయంగా పైలట్‌ అభినందన్‌ విడుదలకు, పాక్‌పై వత్తిడి వచ్చింది. మరోవైపు ఇస్లామిక్‌ దేశాల సదస్సులో పాల్గొనమని భారత్‌కు ఆహ్వానం అందింది. 1969లో ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఇస్లామిక్‌ కంట్రీస్‌ ఏర్పడింది. భారత ప్రతినిధిగా ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ను పంపాలని నాటి ప్రధాని ఇందిర భావించింది. కాని పాకిస్తాన్‌ అడ్డుకుంది. అపుడు ఇస్లామిక్‌ దేశాలు పాక్‌ మాటను విన్నాయి. 50 ఏళ్ళ తరువాత నేడు చరిత్ర మారింది. భారత విదేశాంగమంత్రి శ్రీమతి సుష్మాస్వరాజ్‌ గౌరవ అతిథిగా ఈ సదస్సుకు హాజరై భారతదేశం ప్రపంచంలో మూడవ అధిక ముస్లిం జనాభాగల దేశమని, తాము ఇస్లాంకు వ్యతిరేకం కాదని, కేవలం తీవ్రవాదాన్ని మాత్రమే వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ భారత్‌ నుండి శ్రీ సుష్మాస్వరాజ్‌ పాల్గొన్ని వ్యతిరేకిస్తూ ఈ సదస్సును బహిష్కరించింది. ఇది పాక్‌ పాలిట ఆత్మహత్యా సదృశమయింది. ఇన్నాళ్ళు భారత్‌ చెపుతూవస్తున్న విషయాల్ని ఇపుడు ఇస్లామిక్‌ దేశాలు సైతం అంగీకరించే పరిస్థితి నిర్మాణమయింది. ఇరాన్‌ కూడా పాకిస్తాన్‌ తీవ్రవాదాన్ని ఖండించింది.

- హనుమత్‌ ప్రసాద్‌