సమాజ జాగృతికి సాంస్కృతిక మూలాలే ఆధారం - ఆర్‌.ఎస్‌.ఎస్‌ సహ సర్‌ కార్యవాహ శ్రీ భాగయ్య


స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ పునర్నిర్మాణ కార్యం నిరంతరంగా సాగాలని మహనీయులు అందరూ ఆకాంక్షించారని అని రాష్ట్రీయ్‌ స్వయంసేవక్‌ సంఘ్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ వి.భాగయ్య అన్నారు. ఈ సుదీర్ఘ యాత్ర నిరాటంకంగా ఎలాంటి లోటుపాట్లూ లేకుండా సాగాలని కోరుకున్నారు. ఇదే విషయాన్ని పరమపూజనీయ సర సంఘచాలక్‌ 'భవిష్య భారతం' ఉపన్యాసాల ద్వారా మరోసారి గుర్తుచేసారని అన్నారు. సమాజ కార్యం అందరి బాధ్యత అని గుర్తుచేయడమే కాక నిస్వార్థంగా ఆ కార్యాన్ని నెరవేర్చే వ్యక్తులను తీర్చిదిద్దడమే ఆరెస్సెస్‌ చేస్తున్న పని అని భాగయ్య తెలిపారు. దేశ ప్రగతికి ఆధారం సమాజము, ప్రజలే కానీ రాజకీయ శక్తి మాత్రమే కాదని ఆయన గుర్తుచేశారు.

సమాచారభారతి మరియు విజ్డం సంస్థల ఆధ్య్వర్యంలో ఫిబ్రవరి 23న హైదరాబాద్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన 'భవిష్య భారత్‌' మరియు 'ది సంఘ్‌ & స్వరాజ్‌' పుస్తకాల ఆవిష్కరణ సభలో శ్రీ భాగయ్య ప్రసంగించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ పురష్కార గ్రహీత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి మాట్లాడుతూ, జాతీయత, సంస్కృతి గురించి కనీస అవగాహన కోల్పోయిన మనం మనదంటూ ఏదీ లేదనే భ్రమలో మునిగిపోయామని, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వాతంత్య్రమని భావిస్తున్నామని అన్నారు. ఈ భ్రమల నుండి బయటపడినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యపడుతుందని సీతారామ శాస్త్రి తెలిపారు.

కార్యక్రమంలో తొలుత మాట్లాడిన సమాచార భారతి అధ్యక్షులు, యూనివెర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సభ్యులు డాక్టర్‌ శ్రీ గోపాలరెడ్డి, నేడు విద్యావిధానం ఏ విధంగా తప్పుదోవ పడుతోందన్న విషయాలను సోదాహరణంగా వివరించారు. భారతదేశ స్వతంత్రంలో ప్రముఖపాత్ర పోషించిన వందేమాతరం ఉద్యమం యొక్క ప్రస్తావన కూడా పశ్చిమ బెంగాల్‌ పాఠ్యాంశాలలో కనిపించదని, అసలు బెంగాల్‌ రాష్ట్రంలో పుట్టిన వందేమాతర గేయ రచయిత బంకించంద్ర చట్టర్జీ గురించి కూడా అక్కడి విద్యార్థులకు తెలియదని అన్నారు.

ఇటీవల ఢిల్లీలో 'భవిష్య భారత్‌' పేరిట 3 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో ఆరెస్సెస్‌ సర్‌ సంఘచాలక్‌ డా. శ్రీ మోహన్‌జీ భాగవత్‌ వెల్లడించిన పలు అంశాలను పుస్తకం మరియు సీడీల రూపంలో సంకలనం చేసి విడుదల చేశారు. అదే విధంగా ప్రముఖ రచయిత శ్రీ రతన్‌ శారదా రచించిన 'సంఘ్‌ & స్వరాజ్‌' పుస్తకాన్ని కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ రెండు పుస్తకాలను భాగయ్య మరియు సీతారామ శాస్త్రి ఆవిష్కరించారు.

'ది సంఘ్‌ & స్వరాజ్‌' పుస్తక రచయిత శ్రీ రతన్‌ శార్దా మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆరెస్సెస్‌ పాత్ర పట్ల అనేక సందేహాలు వ్యాప్తి చేసిన కమ్యూనిస్టులు నిజానికి స్వతంత్రోద్యమానికి చేసిందేమీ లేదని అన్నారు. సంఘ స్థాపకులు డాక్టర్జీతో సహా వేలాది స్వయంసేవకులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, ఆ వివరాలన్నీ తన పుస్తకంలో పొందుపరిచినట్టు తెలిపారు.

కార్యక్రమంలో విద్యావేత్తలు, సామజిక కార్యకర్తలతో పాటు అనేక మంది పురప్రముఖులు పాల్గొన్నారు.