ప్రఖర దేశభక్తి (స్ఫూర్తి)


'వందేమాతరం' అని నినాదం చేసినందుకు కేశవ్‌తోపాటు అనేకమంది పిల్లల్ని బ్రిటిష్‌ హెడ్‌మాస్టర్‌ పాఠశాల నుంచి బహిష్కరించాడు. నెలరోజులు గడిచేసరికి మిగిలిన పిల్లలు క్షమాపణలు చెప్పి తిరిగి పాఠశాలలో చేరారు. కానీ కేశవ్‌ మాత్రం క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోలేదు. 'ఎందుకు క్షమాపణలు కోరాలి? నేనేమి తప్పు చేశాను?' అని ప్రశ్నించాడు. 'వందేమాతరం అనడం, ఇతరులతో అనిపించడం తప్పుకాదా' అంటూ ఒక పెద్దమనిషి కేశవ్‌కు నచ్చచెప్పాలని చూశాడు. 
'తల్లికి నమస్కరించడం అపరాధం ఎలా అవుతుంది. అది అపరాధమనే ప్రభుత్వాన్ని నేను గుర్తించను. దానిని పెళ్ళగించివేయాలి'అని కేశర్‌ అనేసరికి ఆ పెద్దమనిషి సమాధానం చెప్పలేకపోయాడు.'ఈ వయస్సులో చక్కగా చదువుకోక ఈ దేశభక్తి ఎందుకు?'అని మందలించాడు. 'మీరు దేశభక్తి అలవరచు కోలేదు. అందువల్ల నేను చేపట్ట వలసివచ్చింది. చదువు పూర్తయిన తరువాత ఎంతమంది దేశాన్ని గురించి ఆలోచిస్తున్నారు? మీ చదువు పూర్తయింది కదా. వయస్సు కూడా ముదిరింది. మరి మీరేందుకు దేశ సేవకు పూనుకో లేదు? దేశసేవ చేస్తానని మీరు మాట ఇస్తే అలాగే మీరు చెప్పినట్లు చదువుకుంటాను' అని కేశవ్‌ సమాధానమిచ్చాడు. 14 ఏళ్ళ కేశవ్‌కు ఉన్న స్పష్టత, పట్టుదల చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ కేశవుడే ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపకులు కేశవ బలీరాం హెడ్గెవార్‌.