గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి


భారతీయ ఆర్థిక వ్యవస్థ గ్రామం ఆధారంగా నిర్మితమైంది.  రాజులు పరిపాలించినప్పుడు కూడా పంచాయితీ పౌరసభలు, వర్తకసంగాలు, వృత్తికుటుంబాలు పూర్తి స్వతంత్రంగా పనిచేసేవి. విదేశీదాడుల్లో కూడా పంచాయితీ వ్యవస్థ పదిలంగా ఉండేది. ఈ రహస్యాన్ని గ్రహించిన ఆంగ్లేయులు ప్రణాళిక ప్రకారం గ్రామాలపై పడ్డారు. గ్రామాలు న్యాయం చెప్పకుండా, పన్నులు వసూలు చేయకుండా,వనరులు వాడుకోకుండా కట్టడిచేశారు. కులవృత్తులతోకూడిన చేనేత, వడ్రంగి వంటివారిని నిరుద్యోగులను చేశారు. గ్రామీణ పరిశ్రమలను, వ్యవసాయ ఆధారిత అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలని గాంధీజీ అనేవారు.  
స్వాతంత్య్రం తరువాత 1950-60 మధ్యకాలంలో దేశంలోని అన్నిరాష్ట్రాల్లో పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఏర్పడింది. 1992లో రాజ్యాంగంలో 72వ సవరణగా ఈ వ్యవస్థకు మరింత బలం చేకూరింది. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన 29 విషయాలలో గ్రామాలకు అధికారాలు, బాధ్యతలు ఇచ్చారు. స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్‌ లోకసేవక్‌ సంఘ్‌గా మారి గ్రామాల పునర్మిర్మాణం కోసం పనిచేయాలని గాంధీజీ ఆకాంక్షించారు. కానీ దేశప్రధమ ప్రధాని నెహ్రూ మాత్రం భారీ పారిశ్రామికీకరణను కోరుకున్నారు. గ్రామాలను నిర్లక్ష్యం చేశారు. ఎన్టీయే ప్రభుత్వం వచ్చిన తరువాత సంసద్‌ ఆదర్శగ్రామయోజన ప్రారం భించారు. ప్రతి పార్లమెంటు సభ్యుడూ స్వంత గ్రామంతోపాటు మరో గ్రామాన్ని దత్తత తీసుకుని రెండేళ్ళలో ఆ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. ఆ విధంగా ఐదేళ్ళ కాలంలో ప్రతి పార్లమెంటు సభ్యుడూ 5గ్రామాలను అభివృద్ధిచేయాలన్నదే ఈ యోజన లక్ష్యం.
ప్రధాని మోదీ స్వయంగా తన పార్లమెంటు నియోజక వర్గంలోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేస్తున్నారు. కానీ చాలామంది పార్ల మెంటు సభ్యులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచా లని, సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్నదే ఈ పథకం లక్ష్యం. సామాజిక న్యాయం, మహిళాసాధికారత, మహిళలకు గౌరవం, పారిశుద్ధ్యం వంటివి ఈ యోజన ద్వారా సాధించాలని లక్ష్యాలు ఉన్నాయి. అలాగే ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, దేవాలయం, రక్షిత మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని సంకల్పించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మరింత ముందుకు వెళ్ళి ఇంధనవనరులు, కంప్యూటర్‌ సౌకర్యం, శీతలగిడ్డంగి, శిక్షణకేంద్రం, ఉపాధి కేంద్రం వంటికి కూడా ఏర్పాటుచేయాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సీనియర్‌ ప్రచారక్‌ స్వర్గీయ నానాజీ దేశ్‌ముఖ్‌ రాజకీయపదవులు వద్దని గ్రామపునర్నిర్మాణ పనిని చేపట్టారు.గ్రామీణప్రజల భాగస్వామ్యంతో ఆర్థికాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ప్రేరణ వంటి నాలుగు సూత్రాల ఆధారంగా అనేక గ్రామాల్లో ఆయన మార్పు తీసుకువచ్చారు. తెలంగాణా 20 గ్రామాల్లో గ్రామభారతి ఆధ్వర్యంలో ఆదర్శగ్రామ నిర్మాణం సాగుతోంది. 

 - హనుమత్‌ ప్రసాద్‌