విస్తరిస్తున్న సంఘ కార్యం


రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 8,9,10 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగాయి. ఈ సందర్భంగా సమర్పించిన నివేదికలో ముఖ్యఅంశాలు -

యువతలో సంఘ కార్యం పట్ల పెరిగిన ఆసక్తి
-     సంఘ శాఖల్లో బాల, కళాశాల విద్యార్థుల సంఖ్య 62 శాతం ఉంది.

-     ప్రతి సంవత్సరం 14 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 1లక్ష మందికి ప్రశిక్షణ పొందుతున్నారు.

-     20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 1లక్ష మందికి పైగా యువకులు ప్రతి ఏడాది సంఘ కార్యంలోకి వస్తున్నారు.

-     దేశ వ్యాప్తంగా ఖండ స్థాయిలో 63,367 శాఖల ద్వారా 88 శాతం ఖండలలో సంఘ కార్యం నడుస్తోంది.

-     54,472 మండలాలకు సంఘ కార్యం విస్తరించింది.

ముఖ్య విశేషాలు

జమ్ము-కశ్మీర్‌ : జమ్ము నుండి 40 కి.మీ. దూరంలో పురమండల్‌ అనే స్థలం దేవికానది తీరంలో ఉంది. ఇక్కడ ప్రాచీన దేవాలయంతో పాటు అందమైన ధర్మశాలలు, సంస్కృత అధ్యయన కేంద్రం చాలాకాలంగా ఉపేక్షకు గురైనవి. వాటి పునరుద్ధరణకు సంఘ స్వయంసేవకుల ద్వారా ఒక ట్రస్టు ఏర్పాటుచేసి చెట్లు నాటడం, ఉచిత వైద్య శిబిరాలు మొదలైన కార్యక్రమాలు ప్రారంభించి, చుట్టుప్రక్కల 30 గ్రామాలలో గ్రామ సమితులు ఏర్పరచారు.

సర్‌కార్యవాహ పర్యటనను పురస్కరించుకొని అక్కడ గొప్ప యజ్ఞం నిర్వహించారు. అనంతరం పరిసర గ్రామాలలో గ్రామ వికాసం పనులు స్వయంసేవకుల ద్వారా ప్రారంభమైనాయి. పురమండల్‌ అనే స్థలం పాకిస్థాన్‌కు సరిహద్దు కావడం వలన పాకిస్తాన్‌ తీవ్రవాదుల నుండి అక్కడి ప్రజలు నిరంతరం తుపాకి గుండ్లవర్షానికి గురవుతూ ఉంటారు. దానివలన ప్రజలకు రక్షణ కరువై ఊరు వదలి వెళ్ళిపోవడం, చదువులో ఆటంకాలు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు తాండవిస్తుండేవి. వీటి పరిష్కారం కొరకు స్వయంసేవకుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించి 457 గ్రామాలలో సమస్యల గురించి అధ్యయనం చేశారు. సర్‌కార్యవాహ పర్యటనలో ఈ పనిని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ క్షేత్రాలతో కలిపి 90 మంది కార్యకర్తలతో సమావేశము నిర్వహించారు. తత్ఫలితంగా 360 గ్రామాలలో పాఠశాలలు, హాస్టళ్లు, సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు, హెల్త్‌ సెంటర్స్‌, స్వావలంబన దిశగా సేవా కార్యక్రమాలు ప్రారంభమైనాయి.

కుంభమేళా

ఇటీవల ప్రయాగరాజ్‌లో ముగిసిన కుంభమేళాలో పాల్గొన్న సాధుసంతుల దగ్గర నుండి సాధారణ భక్తుల వరకు అక్కడ ఏర్పాటు చేసిన శుచి, శుభ్రత నిరంతరం స్వచ్ఛమైన నీటిప్రవాహం పట్ల అందరూ సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత, పర్యావరణం, యువత, నారీశక్తి వంటి అన్ని వర్గాలకు సంబంధించి కుంభ జరిగింది. ఈ సందర్భంలో సాధుసంతుల కుంభలో సమాజంలో అందరిని కలుపుకొని పోయే విషయంపై చర్చించారు. సక్షమ (వికలాంగుల సంక్షేమం కొరకు పనిచేసే సంస్థ) మరియు నేషనల్‌ మెడికో ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎమ్‌ఓ) ద్వారా నిర్వహించబడిన గొప్ప నేత్ర కుంభలో 1,85,809 మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 1,41,239 మందికి కంటి అద్దాలను అందించారు. అవసరమైనవారికి కంటి ఆపరేషన్లు కూడా చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చిన నైపుణ్యమైన కళాకారులను ప్రోత్సహించుటకు కుంభమేళాలో ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటుచేయడం విశేషం.

గ్రామవికాసం

గోఆధారిత వ్యవసాయ పద్ధతుల శిక్షణ శిబిరాలు పలు ప్రాంతాల్లో జరిగాయి. తెలంగా ణాలో జరిగిన ఇలాంటి కార్యక్రమంలో 1000 మందికి పైగా రైతులు శిక్షణపొందారు. అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మొత్తం మరో వెయ్యిమంది పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని దేవగిరి ప్రాంతంలో జలసంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. దక్షిణకర్ణాటక ప్రాంతంలో 24మంది మహిళలు గ్రామవికాస కార్యక్రమం కోసం పూర్తిసమయం ఇచ్చి పనిచేస్తున్నారు.గోసేవ

దేశం మొత్తంలో గోసేవ ప్రశిక్షణ కార్యక్రమాలు 61చోట్ల జరిగాయి. ఇందులో 2వేలమందికి పైగా పాల్గొని శిక్షణపొందారు. ఇవి కాకుండా ప్రాంతాల వారీగా మరో 305 కార్యక్రమాలు జరిగాయి. ఇందులో పదివేలమందికి పైగా గ్రామీణులు పాల్గొన్నారు.దేశంమొత్తంలో 7వేలకు పైగా స్థలాల్లో గోకులాష్టమి కార్యక్రమాలు నిర్వహించారు. అందులో 1లక్ష 70వేల మంది పాల్గొన్నారు. 3వేలకు పైగా గోశాలలు, మఠాలు, దేవాలయాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాలుపంచు కున్నారు. 468 చోట్ల పంచగవ్య ఉత్పత్తుల విక్రయకేంద్రాలు ఏర్పాటుచేశారు. 17వేల మంది రైతులు పూర్తిగా గోఆధారిత వ్యవసాయ పద్ధతులనే అవలంబిస్తున్నారు. ఈ విషయమై అవగాహన కలిగించడానికి 68 ప్రదేశాల్లో కార్యక్రమాలు జరిగాయి. ఇందులో 40వేల మందికి పైగా రైతులు పాల్గొన్నారు. గోఆధారిత వ్యవసాయంవల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు తెలుసుకున్నారు.

కుటుంబప్రబోధన్‌

ప్రపంచానికి భారతదేశం అందించిన అపురూపమైన కానుక కుటుంబవ్యవస్థ. అయితే మన దేశంలో కూడా కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే అన్ని ప్రాంతాల్లో కుటుంబ ప్రబోధన్‌ పని ప్రారంభించారు. 38ప్రాంత ప్రముఖ్‌లు పాల్గొన్న కుటుంబప్రబోధన్‌ అఖిల భారతీయ సమావేశాల్లో ఈ కార్యానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు -

-     భారతదేశంలో వ్యక్తి, కుటుంబం, సమాజం ఒకే చేతనాశక్తి బహురూపాలు.

-     సమాజానికి కావలసిన, అనుకూలమైన విలువలను వ్యక్తులు కుటుంబాల ద్వారానే తెలుసుకుంటారు, అలవరుచుకుంటారు.

-     అందుకనే కుటుంబాన్ని మొదటి పాఠశాల అంటారు.

కుటుంబ విలువలను పెంపొందించుకోవడం కోసం అందరూ ప్రయత్నించాలి. ప్రస్తుతం ఈ కుటుంబప్రబోధన్‌ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైనా, కర్ణాటక, విదర్భ, హరియాణాల్లో వేగం పుంజుకుంటోంది.


రామమందిర నిర్మాణం

అయోధ్య రామమందిర నిర్మాణ విషయంలో న్యాయపరమైన చిక్కులను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు విచిత్రంగా విచారణను వాయిదా వేసింది. హిందువుల మనో భావాలతో ముడిపడి ఉన్న ఈ విషయానికి కోర్టు మరింత ప్రాధాన్యతనిచ్చిఉంటే బాగుండేది. దీనివల్ల తమకు సంబంధించిన విషయాలపై కోర్టులు నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నాయనే అభిప్రాయం హిందువులలో కలిగే అవకాశం ఉంది. అందువల్ల రామమందిర నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగించడానికి కోర్టు త్వరితమైన చర్యలు చేపట్టాలని ప్రతినిధి సభ విజ్ఞప్తి చేసింది.