ఉగాది


చైత్రమాస జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని,

శుక్ర పక్షే సమగ్రంతు తదా సుర్యోదయే సతి.


చైత్రశుద్ద పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు. 'ఉగ' అనగా నక్షత్ర గమనము, నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినము. భవిష్యపురాణంలో యుగాదుల గురించి వివరణ ఉంది. కృతయుగం వైశాఖ తృతీయనాట, త్రేతాయుగం కార్తీక నవమి నాడు, ద్వాపర ఆశ్వీయుజ త్రయోదశినాడు, కలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు ప్రారంభం అయినట్లు శాస్త్రోక్తం.

కాలాన్ని మనకు అనుగుణంగా మహర్షులు 60 సంవత్సరాలుగా విభజించారు. ప్రతి సంవత్సరంలో మొదటి రోజును సంవత్సరాది లేదా ఉగాదిగా జరుపుకొంటాం. మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రవేత్తలు కాలగణనకి ''పంచాంగం'' పొందుపరచారు. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. భూమి నుండి ఆకాశం లోని సూర్య, చంద్రాదులు దూరాలను గణించి వానికి సంబం ధించిన వివరాలను పంచాంగంలో పొందు పరచారు. దీని ఆధారంగానే మన నిత్య నైమిత్తిక కార్యక్రమాలను సనాతన ధర్మం ప్రకారం వేలాది సంవత్సరాలుగా జరుపుకొంటున్నారు. కాల పురుషునికి సంబంధించిన ఉత్సవం ఉగాది. కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. దీనికి ఆద్యులు మన ప్రాచీన మహర్షులు. శాలివాహన చక్రవర్తి ఉగాది నాడే పట్టాభిషిక్తుడై శౌర్యపరాక్రమాలతో శకకర్తగా భాసిల్లాడు. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావ తారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్ప గించిన శుభతిథి ఉగాది. హిందూ రాష్ట్ర నవోదయానికి నాందీవాచకుడు రాష్ట్రీయ స్వవయంసేవక సంఘ సంస్థాపకుడు డాక్టర్‌ కేశవరావు బలిరాం హెడ్గేవార్‌ ఉగాది పర్వదినాన జన్మించడం విశేషం. జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొలిపి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది.