ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ ప్రకటనలుఆజాద్‌ హింద్‌ ప్రభుత్వపు 75వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలి

ఇప్పటికి సరిగ్గా 75 ఏళ్ళక్రితం నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ నేతృత్వంలో ఆజాద్‌ హింద్‌ సర్కార్‌ ఏర్పడింది (21 అక్టోబర్‌, 1943). భారత్‌ స్వాతంత్య్రం పొందడంలో ఈ సంఘటన చాలా ముఖ్యమైనది.

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ నేతృత్వం వహించిన తరువాత నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించడానికి ముందు సింగపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటు చేశారు. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ముఖ్యమైన సంఘటన. అలాగే అతి తక్కువ కాలంలో బలం పుంజుకున్న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో బ్రిటిష్‌ సేనలకు వ్యతిరేకంగా సాగించిన విజయవంతమైన సైనిక దాడులు కూడా చాలా చెప్పుకోదగినవి. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సర్కార్‌ ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉన్న అన్నీ బ్రిటిష్‌ కాలనీల పౌర, మిలటరీ స్థావరాలను పూర్తిగా ఆక్రమించుకుంది. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థావరాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది.

ఆజాద్‌ హింద్‌ సర్కార్‌ ప్రత్యేక కరెన్సీ, కోర్ట్‌లు, పౌర నిబంధనలను ఏర్పాటు చేసింది. అలాగే కొత్త పన్ను వ్యవస్థను కూడా అమలు చేసింది. జపాన్‌, జర్మనితో సహా 9 దేశాలు ఆజాద్‌ హింద్‌ సర్కార్‌ ను పూర్తిస్థాయి ప్రభుత్వంగా గుర్తించాయి. ఈ ప్రభుత్వంలో కేబినెట్‌, రాజ్యాంగం, సైన్యం, కరెన్సీ, న్యాయవ్యవస్థ మొదలైనవన్నీ ఉన్నాయి. 1943లో స్వాధీనం చేసుకున్న అండమాన్‌ నికోబార్‌ దీవులను జపాన్‌ నౌకాదళం ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సర్కార్‌ కు అప్పగించింది. ఈ దీవులకు 'షహీద్‌', 'స్వరాజ్‌' అని పేర్లు పెట్టిన నేతాజీ 30 డిసెంబర్‌, 1943న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంఘటనలన్నీ భారతీయుల్లో, భారతీయ సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని, దేశభక్తి భావాన్ని నింపాయి. అవే స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ చరిత్రాత్మక సంఘటనలు జరిగి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఆజాద్‌ హింద్‌ సర్కార్‌, నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌, ఆజాద్‌ హింద్‌ సేనలో పోరాడిన వేలాదిమంది సైనికులను గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం.

గురునానక్‌ దేవ్‌జీ 550 జయంతి ఘనంగా జరుపుకోవాలి

550 ఏళ్ల క్రితం 1526వ సంవత్స రంలో శ్రీ గురునానక్‌ దేవ్‌జీ రాజ్‌ భోయ్‌కి తల్వండీలో జన్మించారు. వారి తల్లిదండ్రులు మాతా త్రిప్త, శ్రీ మెహ్తా కల్యాణ్‌ దాస్‌ జీ.

సమాజంలోని విఘటన, బలహీన తలను ఆసరా చేసుకుని విదేశీ దురాక్రమదారులు ఈ దేశపు  మత, సాంస్కృతిక అస్తిత్వాన్ని సమూలంగా రూపు మాపడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. జ్ఞానం, భక్తి, సత్కర్మ వంటివి ఎంత అవసరమో తెలియజేస్తూ గురునానక్‌ జీ మహారాజ్‌ సామాజిక జాగృతికి దారి చూపారు. దిక్కుతోచని, గందరగోళ పరిస్థితిలో ఉన్న భారతీయ సమాజానికి కొత్త ఉత్సాహం, దారి కనిపించాయి.

చర్చ, సంవాదం ద్వారా సమాజానికి దారి చూపే ప్రయత్నం శ్రీ గురునానక్‌ దేవ్‌జీ చేశారు. 'ఉదాసీ'గా పిలిచే యాత్రలను ఆయన చేశారు. మొదట మూడుసార్లు ఆయన ముల్తాన్‌ (పాకిస్తాన్‌) నుంచి శ్రీలంక, లఖ్‌పత్‌ (గుజరాత్‌) నుండి కామరూప్‌, ఢాకా(బంగ్లాదేశ్‌) వరకు వివిధ పుణ్య క్షేత్రాలను సందర్శించారు. నాలుగవ ఉదాసీ (యాత్ర) బాగ్దాద్‌, ఇరాన్‌, కంధహార్‌, డమాస్కస్‌, మిశ్ర్‌, మక్కా, మదీనా మొదలైన ప్రాంతాల్లో చేశారు. ఈ యాత్రాల్లో ఆయన సాధుసంతులు, యోగులు, సూఫీ, ఫకీర్‌, జైన, బౌద్ధ సన్యాసులను కలిసి వారితో తాత్విక చర్చలు జరుపుతూనే మతం పేరుతో మూఢనమ్మకాలను వ్యాప్తి చేయకూడదని తెలియజెప్పారు.

మతమౌఢ్య దురాక్రమణదారుడైన బాబర్‌ దాడుల్ని ఎదుర్కోవాలంటూ భారత జాతికి ఆయన పిలుపునిచ్చారు. 'కీరత్‌ కర్‌ నామ్‌ జప్‌ వంద్‌ చ్చక్‌' అంటే కష్టపడి పనిచేయండి, భగవంతుడిని నమ్మండి, ఇతరులతో పంచుకుని ఆహారాన్ని తీసుకోండి, అని ఆయన బోధించారు.

నేటికీ ఎంతో ముఖ్యమైన శ్రీ గురునానక్‌ దేవ్‌ జీ సందేశాన్ని అనుసరించి, ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. శ్రీ గురునానక్‌ దేవ్‌ జీ 550వ ప్రకాశ పర్వ్‌ను ఘనంగా జరుపుకోవాలని యావత్‌ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాము.