క్రైస్తవ మతప్రచారం చేస్తున్న ఇద్దరు అమెరికన్లపై కేసు నమోదు


హైదరాబాద్‌: మాదాపూర్‌ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ క్రైస్తవ మతప్రచారం, మతమార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు అమెరికన్‌ జాతీయులపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన దంపతులు జోర్దాన్‌ (28), హాజియా (30) షేక్‌ పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. టూరిస్ట్‌ వీసాపై ఫిబ్రవరిలో భారత్‌ వచ్చిన వీరు భారతీయ వీసా నిబంధనలకు విరుద్ధంగా చట్టవ్యతిరేకంగా మతప్రచారం, మత మార్పిడి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. 
అమెరికాకు చెందిన క్రైస్తవ సంస్థ 'జహొవాస్‌ విట్నెస్‌' సభ్యులైన వీరు మాదాపూర్‌ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బైబిల్‌ బోధనలు చేయసాగారు. ఇదే క్రమంలో గత ఫిబ్రవరిలో హైటెక్‌ సిటీ ప్రాంతంలో వీరిద్దరూ రోడ్డుమీద వెళ్లే వారికి క్రైస్తవ మతానికి చెందిన కరపత్రాలు, ఇతర మతపరమైన సాహిత్యం పంచుతుండగా ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని వీరిని గమనించి, స్థానిక మాదాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వీరిని స్టేషన్‌ని తీసుకెళ్లిన పోలీసులు హెచ్చరించి వదిలివేశారు. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఆ ఇద్దరు విదేశీయులు తిరిగి అదే విధమైన మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడంతో పాటు, మాదాపూర్‌ ప్రాంతంలోని ఇంటింటికీ తిరుగుతూ బలవంతంగా బైబిల్‌ గురించి బోధించడం వంటివి చేయసాగారు. ఇదే క్రమంలో ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి, వద్దని వారిస్తున్నా వినకుండా క్రైస్తవ మతం గురించి బోధిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందిండంతో ఆ ఇద్దరు విదేశీయులతో పాటు, వారికి సహకరిస్తున్న సెలైన్‌ ఫెర్నాండిచ్‌ (67) మరియు జెన్నిఫర్‌ సరోజిని (33) అనే భారతీయులను కూడా పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. గతంలో పోలీసులు చూపిన ఉదాసీనత కారణంగానే తిరిగి వాళ్ళు ఇదే విధమైన నేరానికి పాల్పడ్డారని, ఈసారి వారిపై కేసు నమోదు చేసి శిక్షించాల్సిందేనంటూ స్థానికులు పోలీసులను డిమాండ్‌ చేశారు. దీంతో ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 153 బి కింద వారిపై కేసు నమోదు చేసారు.