దేవాలయాల నిర్వహణ అధికారం ప్రభుత్వానిది కాదు, భక్తులది - సుప్రీం కోర్ట్‌దేవాలయాలను ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవడం, వాటి నిర్వహణ చేపట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం కోర్ట్‌ ఆ బాధ్యత పూర్తిగా భక్తులకే అప్పచెప్పాలని అభిప్రాయపడింది. అలాగే దేవాలయాల నిర్వహణలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి, వైఫల్యాల పట్ల కూడా కోర్ట్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఒదిశలోని జగన్నాధ దేవాలయ నిర్వహణ గురించి దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని పరిశీలిస్తూ సుప్రీం కోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. 
దేవాలయ పరిపాలన యంత్రాంగం దేవాలయంలో శుభ్రత, స్వచ్చమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో విఫలమైందని పిటిషన్‌లో ఆరోపించారు. చిదంబరం నటరాజ దేవాలయ నిర్వహణను తమిళ నాడు ప్రభుత్వం నుంచి తప్పిస్తూ 2014లో ఆపెక్స్‌ కోర్ట్‌ జారీచేసిన ఆదేశాలను ప్రస్తుతం పూరీ ఆలయం గురించి దాఖలైన పిటిషన్‌ విచారణలో పరిగణలోకి తీసుకుంటామని జస్టిస్‌ ఎస్‌ ఆ బోడ్బే, జస్టిస్‌ ఎస్‌ ఏ నజీర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ''చిదంబరం గురించి కింది కోర్ట్‌ ఇచ్చిన తీర్పు మా దృష్టికి వచ్చింది. అసలు దేవాలయాలను ప్రభుత్వాలు ఎందుకు నిర్వహించాలో అర్ధం కావడం లేదు. తమిళనాడులోని అనేక దేవాలయాల్లో విగ్రహాలు చోరికి గురవుతున్నాయి. మరి ప్రభుత్వాధికారులు ఏమి చేస్తున్నట్లు? భక్తుల మతపరమైన విశ్వాలతోపాటు ఈ విగ్రహాలు చాలా విలువైనవి'' అని బోడ్బే అన్నారు.

పూరీ వ్యవహారాన్ని విచారించడానికి తమవంతు సహాయసహకారాలను అందించగలమని గోవర్ధన పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ నిశ్చలానంద సరస్వతి కోర్ట్‌కు తెలియజేశారు. శంకరాచార్య తరఫున ఈ విషయాన్ని సూచిత్‌ మహంతి అనే న్యాయవాది కోర్ట్‌కు విన్నవించారు. పాలక మండలి అనవసర జోక్యం వల్ల దేవాలయ పూజా పద్దతులు సరిగా జరగకపోవడం, దర్శన సమయంలో భక్తుల తొక్కిసలాట మొదలైనవి చోటుచేసుకుంటున్నాయని మహంతి కోర్ట్‌ కు తెలిపారు.