''వయం పంచాధికం శతం'' బౌద్ధం - హైందవం''గౌతమబుద్ధుని సందేశం హిందూ మతంపై చేసిన ఎలాంటి తిరుగుబాటు కాదు. అది ఒక విశుద్ధమైన హిందూమతాన్ని సిద్ధంపచేయడానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రమే. ఉపనిషత్తులలోని కొన్ని సిద్ధాంతాలను తీసుకుని వాటికి బుద్ధుడు ఒక నూత్న వ్యాఖ్యానాన్ని చేశాడు'' 
- సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశం, 6వ సంపుటం, 480వ పుట.

బౌద్ధమతానికి, వైదిక మతానికి కొన్ని ముఖ్య విషయాలలో భేదాలన్నమాట నిజమే. కానీ అనేక విషయాల్లో పోలిక కూడా ఉన్నది. నేడు కొందరు పనిగట్టుకుని రెండు మతాల మధ్య ఉన్న తేడాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. హిందూమతాన్ని బలహీనపరచడానికి వాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు.

నిజానికి బౌద్ధ, హిందూ మతాలు దాయాదుల వంటివి. ఎంత కలహించుకున్నప్పటికీ ఒకే మూలం, ఒకే ప్రాపంచిక దృక్పథం కలిగినవి. మహాభారతం లోని ఘోషయాత్ర సమయంలో గంధర్వునికి బందీలైన దుర్యోధనుడిని విడిపించమని తమ్ములను ఆజ్జాపించి, 'ఇతరులు మనపై దాడి చేస్తే మనం నూటైదుగురం'అని బోధించిన ధర్మరాజు మాటలు బౌద్ధులకు, హిందువులకు చక్కగా సరిపోతాయి.

బౌద్ధం హిందూ ధర్మంలో విడదీయలేని భాగమనే విషయం రెండు విధాలుగా నిరూపిత మవుతుంది. ఒకటి, బౌద్ధపు సంస్కృత వారసత్వం. రెండు, బౌద్ధ వాస్తువు.సంస్కృత వారసత్వం

ఆచార్య నాగార్జునుడు, ధర్మకీర్తి, దిజ్ఞాగుడు మొదలైన మహామహులందరూ తమ బౌద్ధ తర్క, సిద్ధాంత గ్రంథాలను సంస్కృతంలోనే రచించారు. బౌద్ధ గ్రంథాలు పాలీ, ప్రాకృతాలలో కూడా లభిస్తున్నప్పటికీ బౌద్ధ సాహిత్యంలో ముఖ్యమైనవని చెప్పే గ్రంథాలు, మాధ్యమిక సూత్రాలు, ప్రజ్ఞా పారమిత మొదలైనవి సంస్కృతంలోనే ఉన్నాయి. దీనినిబట్టి బౌద్ధమత సూత్రాలు అవైదిక మైనవి (ఇస్లాం, క్రైస్తవం వంటివి) కావని తెలుస్తుంది. అందుకు కారణం బౌద్ధ సిద్ధాంతానికి వైదిక సంప్రదాయానికి దగ్గరి సంబంధం ఉండడమే.

బౌద్ధ వాస్తువు వైదికమే

బౌద్ధుల చైత్యాల నిర్మాణ పద్ధతి వైదిక హోమకుండపు అనుకరణ అని చరిత్రకారులు అంటున్నారు. 'ప్రాచీన వంశములు'అనే యజ్ఞశాలలు, వేదికలు రకరకాల ఆకారాల్లో వెదురు, ఇటుకలతో కట్టేవారు. చితి, చయన, స్తూపములు అని వీటిలో కొన్ని రకాలు. బోధాయన, ఆపస్తంబులు చితుల వివిధ స్వరూప, నిర్మాణ భేదాలను వివరించారు. ఈ స్థూప చితులను అనుసరించే జైన, బౌద్ధుల స్తూప, చైత్యాలు మొదలైన రీతులు పుట్టాయి.' (సంగ్రహ ఆంధ్రవిజ్ఞానకోశం, 8సం. 135పుట).

బౌద్ధమత వ్యాప్తి - వైదిక శాస్త్రాలు

శ్రవణులు, వర్తకుల ద్వారా బౌద్ధమతం దేశవిదేశాలకు వ్యాపించిందని చరిత్ర చెపుతోంది. బౌద్ధమత వ్యాప్తికి ప్రధానంగా వైద్యం, విద్య ఉపయోగపడ్డాయి. బౌద్ధభిక్షువులు తాము వెళ్ళిన దేశాలలో ప్రజల వైద్య, విద్యా అవసరాలను పూర్తి చేయడం ద్వారా వారి అభిమానాన్ని సంపాదించి బౌద్ధమత వ్యాప్తి చేశారు. ఈ బౌద్ధమత వ్యాప్తికి దోహదపడిన వైద్యశాస్త్రం ఎక్కడిది? అది ఆయుర్వేదం తప్ప మరొకటి కాదు. ఆయుర్వేదం ఉపవేదంగా ప్రసిద్ధిచెందింది. వైద్యశాస్త్ర రచయిత నాగార్జునుడు, రసచికిత్స, లోకశాస్త్ర గ్రంథాల రచయిత మరొక నాగార్డునుడు, ఆయుర్వేద నిపుణుడు వాగ్భటుడు ఈ శాస్త్రాలను టిబెట్‌, మధ్యాసియా, చైనా, శ్రీలంకలలో వ్యాప్తిచేసిన బౌద్ధప్రముఖులు.

బౌద్ధం ఒక ప్రత్యేక మతమని, అది వేదమతానికి వ్యతిరేకమని ప్రచారం చేసేవారికి ఈ విషయాలు మింగుడుపడకపోవచ్చును. కానీ ఇది నిజం. కొన్ని విషయాలతో ఏకీభవించనంతమాత్రాన బౌద్ధం హైందవ నాగరకతలో భాగం కాకపోదు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా బౌద్ధాన్ని మొహరించి బలహీనపరచాలనుకునే విఘటన శక్తులకు ఇలాంటి సత్యాలు చేదుగా ఉంటాయి.     

 - సత్యదేవ