ప్రకృతి సేవలో తరించారు


మన భారతీయ జీవన విధానంలో ప్రకృతిని ఆరాధించడమనేది అనాదిగా వస్తున్నది. అందుకే మనం వృక్షాలను, నదీనదాలను, సముద్రాలను దేవతలుగా తలచి కొలుస్తాం. అయితే నేడు పెరిగిన నాగరికత ప్రభావం వల్ల అనేక రకాలుగా కాలుష్యం వృద్ధి చెంది ప్రకృతి సమతుల్యం దెబ్బతింటోంది. అందుకోసమే చెట్లను పెంచాలని ప్రకృతిని కాపాడాలని చాలామంది నడుంబిగించారు. ఆ బాటలోనే ఇప్పటికీ నడుస్తున్నారు కూడా. అలాంటి వారిలో తమ ధైర్య సాహసాలను ప్రదర్శించి ఎన్నో కష్టనష్టాలకు ఎదురీది ప్రకృతిని కాపాడారు ఈ మహిళలు. అందుకే భారత ప్రభుత్వంచే విశేష పురస్కారాలను అందుకున్నారు.

మొక్కలే పిల్లలు తిమ్మక్కకు

కర్ణాటక తుమకూరు జిల్లా గుబ్బి గ్రామానికి చెందిన తిమ్మక్కది బాల్య వివాహం. భర్త పేరు చిక్కయ్య. పెళ్లయినప్పటికీ ఆమెకు పిల్లలు కలగ పోవడంతో చాలామంది నానారకాల మాటలు అనేవారట. దాంతో వాటన్నింటినీ భరిస్తూ ఆ మాటలనుంచి మామూలు మనిషిగా మారడానికి తిమ్మక్క తన భర్తతో కలిసి మొక్కలు నాటడం మొదలుపెట్టింది. వాటితోనే ఆమెకి కాలక్షేపం. వేసవికాలం వస్తే తను ఉండే హులికల్‌ గ్రామానికి దగ్గర్లోని కురూర్‌ రోడ్డు ఇరువైపులా ఒక్క చెట్టు కూడా లేక ప్రయాణీకులు ఇబ్బంది పడడాన్ని ఆమె గమనించింది. దాంతో ఆమె భర్త, ఆమె కలిసి రోడ్డుకు ఇరువైపులా ఓ పది మర్రి మొక్కలను నాటారు. ఏటా ఆ సంఖ్యను పెంచారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పటికీ కూడా వాటిని సంరక్షించారు. అయితే భర్త చనిపోయినప్పటికీ కూడా తిమ్మక్క మాత్రం చెట్ల సంరక్షణ ఆపలేదు. ఎనిమిది దశాబ్దాల కాలంలో మొత్తం ఎనిమిది వేల మొక్కలు నాటారు. హులికల్‌ నుంచి కడూరు వరకు నాలుగు కిలోమీటర్ల చెట్లను వరుసగా నాటడంతో 'సాలుమరద' తిమ్మక్కగా ఆమె పేరు మారిపోయింది. సాలుమరద అంటే కన్నడలో చెట్ల వరుసలు అని అర్థం. ఈమె సేవలను గుర్తించి 1996లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌర పురస్కారం అందజేసింది. వనమిత్ర, వృక్షప్రేమి, వృక్షశ్రీగా పేరుపొందారు. ఒకప్పుడు ఆమె పనిని పట్టించుకోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆ తరువాత తిమ్మక్క కులపు ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ఆమెకు అవార్డు ప్రకటించింది. కానీ తన పనికి కాకుండా, కులానికి ఇచ్చే అవార్డు తనకు వద్దని సున్నితంగా తిరస్కరించింది తిమ్మక్క. ఇప్పుడు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. పిల్లలు లేరన్న బాధ లేదా అని ఎవరైనా అడిగారే అనుకోండి తనకు పిల్లలు లేరన్న బాధ అసలు ఎప్పుడో మరిచిపోయానని మొక్కలే తన పిల్లలు అని అని చెబుతుంటుంది.రాజకుమారి దేవి..కిసాన్‌ చాచి

వ్యవసాయం చేయాలనే తపనతో వ్యవసాయం చేస్తూ దానిలో పురోగతి సాధించడమే కాకుండా ఎంతోమంది మహిళలకు మార్గదర్శకంగా నిలిచింది రాజకుమారీ దేవి. ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఆమెది బీహారు. ఆమె వయసు అరవై ఏళ్లు. అందరూ ఆమెను కిసాన్‌ చాచి అంటారు. వ్యవసాయం చేయాలనే తపన ఆమెకు ఎనభై దశకంలోనే మొదలైంది. కుటుంబ సభ్యులకు, ఊరివాళ్లకు నచ్చకపోయినా భర్త సహకారం ప్రోత్సాహంతో వ్యవసాయాన్ని ప్రారంభించింది. అరటి, మామిడి, బొప్పాయి, లిచి పండ్ల మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. తోటి రైతులు హేళన చేసినా.. క్రమంగా ఫలసాయం వస్తుండడంతో వాళ్లు విమర్శించడం మానేశారు. ఆ తరువాత కూరగాయ మొక్కల సాగు మొదలు పెట్టారు. క్రమంగా గ్రామ మహిళలకు ఈ పంటల సాగు నేర్పించి, వారందరిని కలిపి స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసింది. సైకిలుపై దాదాపు నలభై, యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తూ తోటి మహిళలకు వ్యవసాయ మెలుకువలు తెలుపుతూ, ప్రభుత్వం రైతులు, మహిళల కోసం రూపొందించిన పథకాలు అందరికీ అందేలా కృషిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని వివిధ గ్రామాల మహిళలు వ్యవసాయంతోపాటు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమె సహాయంతో వ్యవసాయంతోపాటు పచ్చళ్లు, బొమ్మలు చేయడం, చేపల పెంపకంతో ఆర్థిక స్వావలంబన సాధిస్తు న్నారు. ఆమె స్థానికంగా జరిగే బాల్య వివాహాలను ఆపడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం లోనూ ముందుంటారు. దాన్ని గుర్తించిన కేంద్రం ఆమెపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది.మాఫియాని ఎదురించిన జమున

పచ్చదనం కోసం ప్రాణాలకు తెగించి పాటు పడుతున్నందుకు భారత ప్రభుత్వం జమునను పద్మశ్రీతో గౌరవించింది. ఒడిశాలోని రాయంగా పూర్‌ గ్రామానికి చెందిన జమున మతుర్కంలోని 50 హెక్టార్ల విస్తీర్ణంలోని ఆ అడవి ప్రాంతాన్ని అటవీ మాఫియా, దుండగుల నుంచి రక్షించాలని నిర్ణయించుకుంది. అయితే తన ఒక్కదానివల్ల అది అయ్యే పని కాదని తెలుసుకుని అప్పుడే గ్రామంలోని మహిళలందరినీ ఏకం చేసి వన సురక్ష సమితిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మూడు వందల గ్రామాల్లో వనసురక్ష సమితులు పని చేస్తున్నాయి. ఈ మహిళా సైన్యంలో దాదాపుగా పదివేల మంది వరకు సభ్యులు ఉన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా వనాల పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఓసారి ఆమె ఇంటిని దుండగులు కొల్లగొట్టారు. ఆమె, ఆమె భర్తపై రాళ్లతో దాడి చేశారు. ఈమె ధైర్యసాహ సాలను చూసి చాలా మంది లేడీ టార్జాన్‌ అని అంటారు.

- లతాకమలం