కుట్రలు, కుతంత్రాలకు అంతమెక్కడ?


ప్రాచీన కాలం నుంచి ఈ దేశంలో వేదసంస్కృతి, హిందూజీవన విధానం విలసిల్లింది, విలసిల్లుతోంది. ఇక్కడ ఛప్పన్న(56) రాజ్యాలు ఉన్నప్పటికీ, వాటికి వేరువేరు రాజులు, పాలనా వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇది ఒకే దేశంగా నిలిచింది. దానికి కారణం ఇక్కడి సాంస్కృతిక ఏకత్వం. రాజ్యాలు, పాలకులు వేరైనా ప్రజలు, వారిని పాలించే రాజులు ఒకే జీవనవిధానాన్ని, సాంస్కృతిక విలువల్ని అనుసరించారు, పాటించారు. ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టువంటి వాటిలో ఎన్నో తేడాలున్నా వాటన్నింటికి ఆధారమైన సంస్కృతి, విలువలు మాత్రమం ఒక్కటిగానే ఉన్నాయి. 


ఈ 'భిన్నత్వంలో ఏకత్వం'మే ఈ దేశాన్ని, ఇక్కడి జాతిని ఒకటిగా, ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిపి ఉంచింది. ఇదే వేల సంవత్సరాల విదేశీ దురాక్రమణల నుంచి ఈ దేశాన్ని కాపాడింది. అందుకనే ఈ దేశాన్ని శాశ్వతంగా ఆక్రమించు కోవాలనుకున్న విదేశీ శక్తులు ఇక్కడి ఏకత్వానికి మూలమైన సంస్కృతిని దెబ్బతీయాలని చూశారు. మొగలాయిలైనా, ఆంగ్లేయులైనా హిందూ జీవనవిధానంపై దాడి చేసి దానిని ధ్వంసం చేయడానికి విశ్వప్రయత్నం చేశారు.

మొగలాయిలు దేవాలయ వ్యవస్థను నాశనం చేయడం ద్వారా ఆ లక్ష్యం సాధించాలని చూస్తే, ఆంగ్లేయులు మరింత లోతుగా వెళ్ళి విద్యావ్యవస్థ ద్వారా, సామాజిక వ్యవస్థల(కులం, కుటుంబం మొ.) ద్వారా ఆ పని చేయాలనుకున్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ దాడి మాత్రం ఆగలేదు. 'విదేశీ విలువలు' కలిగిన స్వదేశీ పాలకులు సాంస్కృతిక ఏకత్వాన్ని నాశనం చేయడానికే ప్రయత్నించారు. మతపరమైన తేడాలకు ప్రాధాన్యతనిచ్చి సాంస్కృతిక ఏకత్వాన్ని దెబ్బ తీయాలని చూశారు. సామాజికంగా చీలికలు తేవడానికి ప్రయత్నించారు. ప్రజల్ని మెజారిటీ, మైనారిటీలుగా విభజించి, మెజారిటీ వర్గం ఎప్పుడూ మైనారిటీలను మింగేయడానికే చూస్తుందని, కాబట్టి మైనారిటీలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామంటూ ప్రకటించారు. మైనారిటీలుగా చెప్పే ఒక వర్గపు ప్రయోజనాలను మాత్రం కాపాడి, తద్వారా ఓట్లు సంపాదించి శాశ్వతంగా అధికారాన్ని చేజిక్కించు కోవాలని తాపత్రయపడ్డారు.

వీరి మెజారిటీ ద్వేషం, మైనారిటీ ప్రేమ ఎంతదాకా వెళ్ళిందంటే మెజారిటీ వర్గాన్ని బెదిరించడానికి, బోనులో నిలబెట్టడానికి కొత్తకొత్త నినాదాలు, విధానాలు సృష్టించారు. 'హిందూ ఉగ్రవాదం' అంటూ గగ్గోలు పెట్టారు. ఆ 'ఉగ్రవాదం' నుంచి 'అమాయక మైనారిటీల'ను కాపాడేందుకు మతహింస(నివారణ) బిల్లు వంటి ప్రత్యేక చట్టాలు చేసే ప్రయత్నం చేశారు. ఈ బిల్లు ప్రకారం మైనారిటీ వర్గానికి చెందిన ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మెజారిటీ వర్గానికి చెందిన ఎవరిపైన అయినా క్రిమినల్‌ ఆరోపణలు చేయవచ్చును. ఆ ఆరోపణల్లో నిజానిజాలను తేల్చుకోడానికంటే ముందు పోలీసులు మెజారిటీ వర్గానికి చెందినవారిని అరెస్ట్‌ చేసి, జైలులో పెట్టాలి. వారికి బెయిలు కూడా ఇవ్వడానికి వీలు లేదు. అలాగే ఆరోపణలు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాటిని చేసినవారిపైన కాకుండా, అరెస్ట్‌ అయినవారిపై ఉంటుంది. ఈ విధంగా 'మైనారిటీ'వర్గానికి 'రక్షణ'కల్పించాలని ప్రయత్నించారు.

అలాగే 'ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి'బదులుగా 'హిందూ ఉగ్రవాదాన్ని' తెరపైకి తేవాలనుకున్నారు. మాలేగావ్‌, సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్‌ వంటి సంఘటనల్లో అసలు నిందితుల్ని పక్కకు తప్పించి కొందరు సాధుసంతులపై కేసులు బనాయించి 'హిందు ఉగ్రవాదాన్ని' నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ నెరవేరలేదు. కేసులేవీ నిలబడలేదు. అయినా ఈ 'హిందూ' వ్యతిరేక శక్తుల కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎప్పుడు, ఏ రూపంలో బయటకు వస్తాయో గమనించుకుని, జాగ్రత్త పడాల్సిన అవసరం, అగత్యం ప్రజలందరికీ ఉంది.