వికటించిన ప్రార్ధనలు


తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి చెందిన క్రైస్తవ సంస్థ కల్వరి మినిస్ట్రీస్‌ అధినేతతో పాటు అతడి భార్య షారోన్‌ మరియు ఇద్దరు సహాయకులపై కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేష్‌ అనే యువకుడికి ప్రార్ధనల ద్వారా నయం చేస్తానంటూ నమ్మించిన పాస్టర్‌, అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా అడ్డుకున్నట్టు రాజేష్‌ తల్లి మంగమ్మ తన ఫిర్యాదులో తెలియజేసింది.
రోగాలను నయం చేస్తామంటూ కల్వరి మినిస్ట్రీస్‌ చేస్తున్న ప్రకటనలకు ఆకర్షితురాలైన సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామస్తురాలు మంగమ్మ తన కొడుకుని సోమగూడెంలోని కల్వరి చర్చిలో ప్రార్ధనలకు  తీసుకువచ్చింది.

రోజురోజుకూ అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో అనుమానం వచ్చిన మంగమ్మ, తన కొడుకుని ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్తానని కోరడంతో చర్చి పాస్టర్‌, ఇతర సిబ్బంది అందుకు నిరాకరించారు. అతడిని ఒక వాహనంలో ఎక్కించి, ఆస్పత్రికి అని చెప్పి అనేక చోట్లకు తిప్పుతుండగా అనుమానం వచ్చిన అతడి తల్లి గట్టిగ కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై వాహనాన్ని ఆపారు. అనంతరం అక్కడి నుండి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే రాజేష్‌ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.