అరుదైన గిరిజన తెగలపై క్రైస్తవ మిషనరీల దాడి


అండమాన్‌ సెంటినలిస్‌ దీవుల్లో అమెరికన్‌ క్రైస్తవ ప్రచారకుడు అక్రమంగా ప్రవేశించి అక్కడి ఆదిమ తెగలకు చెందిన ప్రజలను మతం మార్చడానికి చేసిన ప్రయత్నం ఇంకా మరువక ముందే ఇటువంటి మరో ఉదంతం చోటు చేసుకుంది. 
ఈ సారి మేఘాలయ రాష్ట్రంలోని క్రైస్తవ మిషనరీలు తమ మతమార్పిడి కార్యకలాపాలకు స్థానిక అరుదైన ఖాసి తెగకు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు. వారి సంస్కృతిపై దాడికి పూనుకున్నారు. ఈ తెగ వారు పరమ పవిత్రంగా భావించే ఆలయ గర్భగుడిని స్థానిక క్రైస్తవ మిషనరీలు కూల్చివేశారు. నియాంగ్‌ ఫైరాగా పిలిచే ఈ దేవాలయాన్ని మిషనరీలు ధ్వంసం చేసిన వార్త మేఘాలయ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

మే 27 సాయంత్రం 4.40 ప్రాంతంలో జరిగిన ఈ ఘటన విషయం స్థానిక యువతి ఫిర్మి బోడో తన ట్విటర్‌ అకౌంట్లో మే 29న పోస్ట్‌ చేసేదాకా బయటకు రాలేదు. దీనిపై తూర్పు కాసి హిల్స్‌ జిల్లా కాంగ్తాంగ్‌ వాసి తుయి ఖోన్గ్సిట్‌ అనే వ్యక్తి స్థానిక సోహ్రా పోలీస్‌ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు కాపీని కూడా ట్విట్టర్లో షేర్‌ చేసింది.

ఖాసి తెగలకు చెందిన ప్రజల ఆచారవ్యవహారాలను క్షుద్ర చర్యలుగా ప్రచారం చేస్తూ సిల్లోక్లాంగ్‌ మజావ్‌ స్థానిక క్రైస్తవ పాస్టర్‌ తన అనుచరుల సహాయంతో దేవాలయాన్ని ధ్వంసం చేసినట్టు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఖాసి తెగలకు చెందిన వారి ఉత్సవం జరుగుతుండగా ఈ దాడి జరగడంతో వారు తమ ఉత్సవాన్ని అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది.

దాడి అనంతరం ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు, స్థానిక మేజిస్ట్రేట్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో ఫిర్యాదుదారుడు తన ఈ ఉదంతాన్ని ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర గృహ మంత్రిత్వశాఖకు కూడా పంపారు.

ఖాసి తెగను భారత రాజ్యాంగం అంతరించిపోతున్న విశిష్ట తెగలలో ఒకటిగా గుర్తించింది. వారు తమ ప్రాంతంలో తమ ఆచార వ్యవహారాలను స్వేచ్చగా పాటించేందుకు అనుమతి ఉంది. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రంగా పెరుగుతున్న క్రైస్తవ మతమార్పిడులు, ఇతర మతస్థులపై దాడులు వంటివి ఈ తెగల మనుగడకు సమస్యగా మారాయి.