'మోక్షదాయిని'ని రక్షించడం కోసం...


ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన అతిప్రాచీన నగరం ఏదీ అని ఎవరినైనా అడిగితే ముందుగా చెప్పే పేరుకాశి. నేడు ఆధ్యాత్మికంగానే కాక పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతోంది. అందుకే దేశీయులే కాక విదేశీయులు, పరధర్మీయులు కూడా కాశీని సందర్శిస్తున్నారు. 
ఎందరినో భక్తి, ముక్తి మార్గాలవైపు నడిపించే కాశీలో దైవీయ పూజలు మాత్రమే కాదు, అపరకర్మకి సంబంధించిన పూజలు కూడా జరుగుతాయి. అందుకే చాలా మంది ధర్మపరులు కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే మరణించిన వారి దహన సంస్కారాలను కాశీలో నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల అక్కడ పర్యావరణం కాస్త దెబ్బతింటోందన్నది మాత్రం వాస్తవం. అందుకే అక్కడి పర్యావరణాన్ని రక్షించేందుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది.

 ఇలా గత కొద్ది సంవత్సరాలుగా వారణాసిలో దహన సంస్కారాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కాలుష్యం కూడా పెరగడం ప్రారంభమైంది. గంగా నది కూడా కలుషితం అవ్వడం ఆరంభమైంది. కాలుష్యాన్ని నివారించడానికి.. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దేహ దహనానికి కలప స్థానంలో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని తీర్మానించింది.

ఇందుకు వారణాసి పాలక వర్గాలు తగిన ప్రణాళికలు రూపొందించుకున్నాయి. పిడకల తయారీ ద్వారా ఉపాధి కల్పించడం.. గోవులను రక్షించడం ఒక వైపు అయితే.. ఆ పిడకలను ఉపయోగించి.. చెట్లను రక్షించడం మరో కోణం. అంతేకాకుండా దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు. అయితే సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ధర్మ శాస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శాస్త్రాలకు అనుగుణంగా దహన సంస్కారాలను నిర్వహించా లని అనుకుంటారు. కట్టెలకు బదులు పిడకల వినియోగం శాస్త్రబద్ధమైనదేనా అనే సందేహాలు వారణాసి పాలక వర్గాలకు వచ్చింది. ఇందుకు వారు పండితులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పిడకలతో మృత శరీరాన్ని దహనం చేయడం వల్ల ఎటువంటి దోషం ఉండదని పండితులు అధికారులకు తెలిపారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. దేశీయ గో మయంతో తయారుచేసిన పిడకలను చిన్నగా దహన సంస్కారాల నిర్వహణకు అందుబాటులోకి తెచ్చారు. వారి ప్రయోగం చిన్నగా ఫలించడం ప్రారంభించింది.


అయితే తొలుత వారు చేసిన ఈపనిలో అనేక ఆటుపోట్‌రను వారణాసి అధికార యంత్రాంగం ఎదుర్కొంది. ముఖ్యంగా స్థానిక కట్టెల వ్యాపారులు అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ నిరసనలను తెలిపారు. వారి నిరసనలకు పలువురు మద్ధుతను కూడా తెలిపారు. అయితే అధికారులు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. నిశ్‌లయంగా ముందడుగు వేశారు. స్థానిక ఆధ్యాత్మిక సంస్థల సహకారాన్ని పొందారు. అలా దేశీయ ఆవు పేడతో చేసే పిడకలను దహన సంస్కారాలకు ఉపయోగించేలా అవగాహన కార్యక్రమాలను ప్రారంభించి మార్పు వైపు విజయవంతంగా అడుగులు వేస్తున్నారు.  టన్నుల కొద్ది బూడిద నీటిలో కలిసి గంగానది కలుషితమవుతోంది. అటువంటి సమస్యలను నివారించేందుకే దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను దహన కార్యానికి ఉపయోగించాలని వారణాసి పాలక వర్గాలు కోరుతున్నాయి. కట్టెల వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది.

దేశీయ ఆవు పిడకల వినియోగానికి పర్యావరణవేత్తలు కూడా ఆమోదం తెలుపుతున్నారు. వాటిని వినియోగించడం వల్ల కాలుష్యానికి ఆస్కారం ఉండదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా అడవులను కాపాడుకున్న వారమవుతామని చెబుతున్నారు. దేశీయ ఆవు పిడకల వినియోగాన్ని ప్రోత్సహించేలా మరిన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరుతున్నారు.

దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలతో నాగపూర్‌, జైపూర్‌, రోహతక్‌, జలగావ్‌, ఇండోర్‌, రాయ్‌పూర్‌, రూర్కెలాల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు కాశీ మోక్షదాయని సమితి స్పష్టం చేసింది. గోమూత్రం, గోమయం ఎంతో పవిత్రమైనవని చెబుతోంది. అందుకే గో ఆధారితమైన పిడకలను వాడడం వల్ల పర్యావరణానికి హాని ఉండదని.. దహన సంస్కారాలలో దోషం ఉండదని సమితి ప్రచారం చేస్తోంది. ఈ ఆచరణీయమైన కార్యానికి ప్రతి ఒక్క హిందువు మనస్ఫూర్తిగా సహకరించాలని పిలుపునిస్తోంది. భారతీయ సంస్కృతి పర్యావరణ హితకారి అని నిరూపించడానికి హైందవులు ముందుకు రావాలని వారణాశి పాలక వర్గం కోరుతోంది.               
- లతాకమలం