వర్ధిల్లిన భారత ప్రజాస్వామ్యం !


17వ లోసభ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికలు సుధీర్ఘకాలం జరిగినా బెంగాల్‌లో తప్ప ఎక్కడా హింస చెలరేగలేదు.  'జైశ్రీరామ్‌' అన్నందుకు  జనాన్ని అరెస్టు చేసినా అది ఇప్పుడు బెంగాల్‌లో మహానాదమయి పోయింది. బెంగాల్‌ ప్రజలు  హింసా రాజకీయాలు తిరస్కరించారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రజలు కుల రాజకీయాలను వ్యతిరేకించారు. అందరం హిందువులం బంధువులం, భారత మాత బిడ్డలం అంటూ దేశ భక్తి, జాతీయవాద స్ఫూర్తితో ఓటు వేశారు. 

గుజరాత్‌లోనూ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పతిదార్లు, ఠాకూర్‌లు, దళితులు అంటూ విభజన రాజకీయాలు చేసి లబ్ధిపొందా లనుకుని కొందరు చేసిన ప్రయత్నం ఫలించలేదు. 2019 లోకసభ ఎన్నికల్లో గుజరాత్‌ ప్రజలంతా కులభేదాలు మరచి కేంద్రంలో బలమైన ప్రభుత్వం కోసం ఓటువేశారు.

భారతదేశం అంతా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపట్టిన కారణంగా జిఎస్‌టి ద్వారా నెలకు లక్షకోట్ల పన్ను వసూళ్ళు జరిగి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకుంది. నిజానికి ఈ పన్ను విధివిధానాలు అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన కమిటీ వుంది. అయినప్పటికీ విపక్షాలు ఈ పన్ను విధానం తెచ్చినందుకు ప్రభుత్వాన్ని విమర్శించాయి. కాని ఆ విమర్శలను ప్రజలు పట్టించుకోలేదు.

దేశ రక్షణ కోసం రఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి అత్యంత చౌకగా పారదర్శకంగా ఫ్రాన్సు ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం గురించి సుప్రీకోర్టు ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది కూడా. అయినా విపక్షాలు దేశ రక్షణ విషయాన్ని రాజకీయం చేయడాన్ని ప్రజలు సహించలేక పోయారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత పదిరోజుల్లోనే బాలకోట్‌పై సైనిక దాడి జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టించిన ప్రభుత్వ నిర్ణయాత్మక వైఖరిని,  ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే దృక్పథాన్ని దేశ ప్రజలు సమర్థించారు.

హిందూతీవ్రవాదం అంటూ కువ్యాఖ్యలు చేసిన నిరపరాధులైన హిందువులను, సాధువులను, సామాజిక కార్యకర్తలను దశాబ్దంపాటు జైళ్ళలో ఉంచినవారు మట్టి గరిచారు.  హిందువు ఏనాడూ తీవ్రవాది కాజాలడని నిరూపితమయింది.  కాశ్మీరును కుటుంబ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న వారికి కూడా ప్రజలు బుద్ది చెప్పారు. కాశ్మీరులో 370 ఆర్టికల్‌, 35ఎల ద్వారా కలిగే ప్రత్యేకప్రతిపత్తిని తొలగించి దేశ ప్రజలందరికీ ఒకే చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కావల్సిన అనుకూల వాతావరణం ఏర్పడింది. గత సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా చాలా ఉత్సాహంగా పాల్గొని ప్రతి నిధులుగా ఎంపికైనవారంతా వారివారి గ్రామాలలో ప్రభుత్వం నుంచి నేరుగా అందుతున్న సహాయంతో చక్కటి అభివృద్ధి పనులపై దృష్టి సాధించారు. గెలవలేమని తెలిసిన నాయకులు ఇవిఎమ్‌ల పనితీరు అనుమానించడం మొదలు పెట్టారు. కాని సుప్రీంకోర్టు తీర్పుమేరకు 4000 అసెంబ్లీ స్థానాల్లో (542 పార్లమెంటు సీట్ల పరిధిలోని) వాడిన 20625 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌లలో ఓటింగ్‌ అనంతరం వచ్చే స్లిప్‌లను లెక్కిస్తే దేశమంతా ఎక్కడా తేడా రాలేదు, అన్నీ సమంగానే ఉన్నట్లు తెలిసింది. ఇదే భారత ప్రజస్వామ్యం గొప్పతనం. సైకిలు మీద, ఆటోలో తిరుగుతూ, నిరాడంబరంగా ఒరిస్సా బాలాసోర్‌్‌  పోటీ చేసి, కోట్లకు పడగలెత్తిన వ్యక్తి మీద గెలిచిన శ్రీ ప్రతాప్‌ సారంగి వంటి ఆదర్శ మూర్తులున్న దేశం మనది. ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలకోసం జీవిస్తున్న నాయకులు భారతదేశ ఔనత్యాన్ని ఇనుమడింప జేసే అవకాశం మరోసారి 17వ లోకసభ ఎన్నిలు కల్గించాయి.

-హనుమత్‌ ప్రసాద్‌