ఘనంగా నారద జయంతి ఉత్సవాలు


సమాజ శ్రేయస్సు కొరకు పాత్రికేయ రంగాన్ని సేవా మార్గంగా ఎంచుకొని తమ రచనలు, వ్యాఖ్యా నాల ద్వారా ప్రజల్లో దేశభక్తిని, సమాజంలో చైతన్యం కోసం నిత్యం కృషి చేస్తున్న పాత్రికేయులను సన్మానించడం సముచితమని తెలంగాణ, హర్యాణా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు సలహాదారు శ్రీ వెంకట చంగవల్లి పేర్కొన్నారు. నేటి సమాజంలోని సానుకులతను, యువతలోని ఉత్సాహాన్నిసన్మార్గంలో నడపడంలో పాత్రికేయులది విశిష్టమైన పాత్ర అని ఆయన గుర్తుచేశారు. 

సమాచార భారతి కల్చరల్‌ అసోసియేషన్‌ అద్వర్యంలో హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో 19వ తేదీన దేవర్షి నారద జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రపంచ పాత్రికేయ దినోత్సవం సందర్బంగా జరిగిన సన్మాన సభలో శ్రీ వెంకట చంగవల్లి గారు ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముఖ్య అతిది గా పాల్గొన్న ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ సభ్యులు శ్రీ ముకేశ్‌ శా మాట్లాడుతూ, జ్ఞాన భక్తి కలవాడు నారదుడు అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని పాత్రికేయులు ఎలాంటి అసత్యాలకు తావులేకాండా తాము పని చేస్తున్న కార్యక్షేత్రాలలో నిజాయితిగా పని చేయాలనీ పిలుపునిచ్చారు.

పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించిన నలుగురు సీనియర్‌ పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు.

కరీంనగర్‌

గత అనుభవాలను, దేశ సామాజిక పరంపరను దృష్టిలో ఉంచుకొని సమకాలిన వాస్తవాలతో పత్రికలు పాత్రికేయులు ప్రజలను ఏకం చేసే దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త, జాగృతి వారపత్రిక అసోసియేట్‌ ఎడిటర్‌ శ్రీ దుర్గా రెడ్డి అన్నారు.


సమాచార భారతి ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఫిలిం భవన్‌ ఆడిటోరియంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ప్రజ్ఞాభారతి సంయుక్త కార్యదర్శి పింగిళి  వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కరీంనగర్‌ విభాగ్‌ సంపర్క ప్రముఖ్‌ ముక్కల సీతారాములు, సీనియర్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ నిరంజనాచారి, ఎలగందుల సత్యనారాయణ, గాజుల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ

ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రికేయులు సమాజం పక్షాన ప్రశ్నించే గొంతుకలు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి డా. శ్రీ సంగని మల్లేశ్వర కోరారు. సమాచార భారతి వరంగల్‌ శాఖ ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకుని  హన్మకొండ బాల సముద్రంలోని సామ జగన్మోహన్‌ రెడ్డి స్మారక భవనంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు.  


కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న భారతీయ ప్రజ్ఞ మాస పత్రిక సంపాదకులు మామిడి గిరిధర్‌ మాట్లాడుతూ, నారద మహర్షి అన్ని విషయాల్లో అపారమైన జ్ఞానాన్ని సముపార్జించిన దేవర్షి అని అన్నారు. పాత్రికేయులకు ఇలాంటి లక్షణాలు ఉండాలని అన్నారు.

కార్యక్రమంలో పాత్రికేయ రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్‌ జర్నలిస్టులు దాసరి కృష్ణారెడ్డి, పిన్నా శివకుమార్‌లను ఘనంగా సత్కరించారు.