అటవీ భూమిలో నిర్మించ తలపెట్టిన అక్రమ చర్చి తొలగింపు


కర్నూలు జిల్లాలోని అటవీ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించ తలపెట్టిన చర్చిని ప్రభుత్వ అధికారులు తొలగించివేసారు. కల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మి జగన్నాథ గట్టు ప్రాంతంలోని అటవీశాఖకు చెందిన స్థలంలో గతంలో కొందరు ఒక సిలువను ఏర్పాటు చేశారు. దానిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇదే అదనుగా ఇటీవల దాని పక్కనే ఒక చర్చిని నిర్మించేందుకు పునాదులు వేశారు.

హైదరాబాద్‌ కు చెందిన స్వచ్ఛంద సంస్థ 'లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌' ఈ వ్యవహారంపై కర్నూలు జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీకి ఫిర్యాదు చేసింది. అటవీ శాఖకు చెందిన భూమిని ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిందిగా తమ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో స్థానిక ఎమ్మార్వో పర్యవేక్షణలో , పోలీసు బందోబస్తు మధ్య శనివారం రాత్రి నిర్మాణంలో ఉన్న చర్చిని తొలగించివేశారు.

అన్యాయంగా తమ చర్చిని తొలగించారంటూ కొందరు పాస్టర్లు కర్నూలు పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఇదిలా ఉండగా కేవలం చర్చిని మాత్రమే తొలగించి, అక్కడ ఏర్పాటు చేసిన శిలువను తొలగించకపోవడంపై ప్రజల నుండి నిరసన వ్యక్తమవుతోంది.