వందేమాతరం గౌరవించనివారు మన ప్రతినిధులా?


17వ లోకసభ ఎన్నికల్లో గెలుపొందిన లోకసభ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా సమాజ్‌వాదీపార్టీ సభ్యుడు షఫీకుర్‌ రెహమాన్‌ ప్రమాణస్వీకారం చేసిన తరువాత 'వందేమాతరం' రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఇస్లాంకు వ్యతిరేకమని దాన్ని మేం ఆలపించమని వ్యాఖ్యానించడం వివాదాస్పదమయింది. అదీ సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా సభలో ఉండగా సదరు సభ్యుడు అలా వ్యాఖ్యానించాడు. మతం కంటె, పార్టీ కంటె పార్లమెంటు సభ్యుడిగా రాజ్యాంగం అమలయ్యే పార్లమెంటులో ఆచారసంహితను పాటించాలన్న ఇంగితం ఆ ఎంపీకి లేకుండా పోయింది. 
జాతీయగీతం జనగణమనను గౌరవిస్తానని, వందేమాతరగీతాన్ని గౌరవించనని ఆయన అంటున్నాడు. మతం వ్యక్తిగతమైనదే కాని, పలువురితో కలిసి బహిరంగంగా ఓ దేశభక్తిని ప్రేరేపించే గీతం పాడుతున్నపుడు అభ్యంతరాలు కూడవని గతంలో అనేకమంది తేల్చారు కూడా. కాని మతంమత్తు, ఉన్మాదం నెత్తినెక్కిన కొందరు రహమాన్‌ లాంటి సభ్యులు ఇంకా పాతపాటే పాడుతున్నారు. దేశం పట్ల, మాతృభూమి పట్ల ఇంత అసహనం ప్రదర్శించడం మతమా? పార్లమెంటులో ఇతర ముస్లిం సభ్యులు షానవాజ్‌ హుస్సేన్‌, సల్మాన్‌ఖుర్షీద్‌, అబ్బాస్‌నక్వీ, తారిక్‌ అన్వర్‌లకు లేని అసహనం, అభ్యంతరం రెహమాన్‌కు ఎందుకు? వందేమాతరం పాడితేనే దేశభక్తుడవుతాడా అని ప్రశ్నించడమే మూర్ఖత్వం. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత దేశంలో నెలకొన్న నిరాశా నిస్ప్పహలను వందేమాతర ఉద్యమం దూరం చేసింది. బెంగాల్‌ విభజనకు కారకుడైన కర్జన్‌ భారత్‌ మీద కాలుమోపేసరికే జాతీయోద్యమం వేళ్ళూనుకొని వుంది. మత భేదం లేకుండా అందరూ దేశంకోసం ప్రేరణ పొందడం సహించలేని కర్జన్‌, బెంగాల్‌లో హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చుపెట్టేందుకు బెంగాలు విభజన ప్రతిపాదన తెచ్చాడు. 1904 ఫిబ్రవరిలో స్వయంగా తూర్పు బెంగాల్‌జిల్లాల్లో పర్యటించి ముస్లింలను రెచ్చగొట్టాడు. ఢాకా నవాబును బుట్టలో వేసుకున్నాడు. తూర్పు బెంగాల్‌లో ముస్లింలు మెజారిటీ ఉండే విధంగా, పశ్చిమ బెంగాల్‌లో ఒరియాలు, బీహారీలు మెజారిటీగా ఉండే విధంగా 20 జూలై 1905న బెంగాల్‌ను విభజించాడు. బెంగాల్‌ యావత్తు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. 'తూర్పు బెంగాల్‌ రాష్ట్రానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితుడైన పుల్లర్‌ 8 నవంబరు 1905 నాడు వందేమాతరం పాడడం నిషేధించాడు.' నిషేధాలతో ఉద్యమం మరింత ఉదృతమైంది. ప్రతినోట వందేమాతర నినాదం మారు మ్రోగింది. పంజాబ్‌లో లాలాలజపతిరాయ్‌, స్వామి శ్రద్ధానంద, దక్షిణాదిన సుబ్రహ్మణ్య అయ్యర్‌, మహారాష్ట్రలో తిలక్‌ ఈ ఉద్యమానికి సారధ్యం వహించారు. లియాకత్‌హుస్సేన్‌, అబ్దుల్‌ రసూల్‌, దీదార్‌బన్స్‌, ఇస్మాయిల్‌ హుస్సేన్‌ సిరాజి వంటి ముస్లిం నాయకులు కూడా వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. యువకుల్లో ప్రతీకారేచ్ఛ రగిలింది. ఖుదీరాంబోస్‌ వంటి విప్లవకారులు ఉరికంబమెక్కారు.1911లో బ్రిటీషు వాళ్లు బెంగాలు విభజనను రద్దు చేశారు. అయినా దేశ ప్రజలు వారు నాటిన విష బీజాలు, వేర్పాటు భావాలు ముస్లింలలో గాఢంగా నాటుకుపోయాయి.  1919లో ఖిలాపత్‌ ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్న కాంగ్రెస్‌ భారత జాతీయతను బలహీనపర్చింది. అది 1947 దేశ విభజనకు కారణమయింది.

  'వందేమాతరం' స్వాతంత్య్రోద్యమానికి ప్రేరణ నిచ్చిన నినాదం. ఇవాళ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న దేశ ప్రజలంతా, ఆ ప్రజల బలంతో పార్లమెంటులో ప్రవేశిస్తున్న సభ్యులంతా 'వందేమాతరం' నినాదమే లేకపోతే మనం లేమని తెలుసుకోవాలి. ఏదీ లేకుండా నేను లేనో అట్టిదైన నాదేశం నాకంటె ముఖ్యమైనది అన్న భావనే దేశభక్తి అనుకుంటే అటువంటి దేశభక్తులను తయారు చేసింది వందేమాతరం ఉద్యమం. వందేమాతరం వద్దంటున్న వారు భారత భావన వీడిన భ్రష్టమేధావులని అర్థం చేసుకోవాలి.
- హనుమత్‌ప్రసాద్‌