భారతీయతను సంరక్షిస్తూ భావితరాలకు అందివ్వాలి


మన భారతీయ సంస్కృతి, చరిత్ర అతి పురాతనమైనవి, అత్యంత విలువైనవి. కాలగమనంలో వచ్చే మార్పులను ఎదుర్కుంటూ సాగుతున్న ఈ సమయంలో మహోజ్వలమైన వారసత్వ సంపదను, జ్ఞానాన్ని సంరక్షించుకుంటూ భావితరాల వారికి అందివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని శ్రీ కృష్ణదేవరాయ అన్నారు.

సంవిత్‌ కేంద్ర రిసర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో శ్రీ రత్నాకర్‌ సదస్యుల రచించిన ''విక్టరీ అఫ్‌ విజయనగర'' పుస్తకావిష్కరణ సభలో గౌరవ అతిధిగా పాల్గొన్న శ్రీ కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య చరిత్ర, విశిష్టతలపై పరిశోధన చేసిన రచయితను అభినందించారు. భారతీయత అంటే ఒకే సంస్కృతి, ఒక కుటుంబం అనే భావన కలిగి గౌరవం, సంపూర్ణ అవగాహనతో సమాజాన్ని జాగృతి చేయాలని కోరారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీ నాగరాజ్‌, మితిక్‌ సొసైటీ గౌరవ అద్యక్షులు, మాట్లాడుతూ, దక్షిణ భారత దేశంలో ముస్లిముల దురాక్రమణను ఎదురుంచి హైందవ సంస్కృతిని కాపాడుతూనే, ఒక విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారని కొనియాడారు. విజయనగర రాజులు ప్రధానంగా ముస్లిం దురాక్రమణకు లోనైన రాజ్యాలను విముక్తి చేయడం, సంస్కృతిని కాపాడుతూ, దాని అభివృద్ధికి తోడ్పాటునివ్వాలనే మూడు లక్ష్యాలతో రాజ్య పాలన చేశారన్నారు. నేటికీ దక్షిణ భారత దేశంలో హైందవం ప్రబలంగా ఉండడానికి విజయనగర సామ్రాజ్యపు కీలక పాత్ర ఉందన్నారు. ఇలాంటి రచనల ద్వారా విషయాలను సామాన్య ప్రజలకు అందించడానికి సంవిత్‌ కేంద్ర చేస్తున్న ప్రయత్నాన్ని శ్రీ నాగరాజు అభినందించారు.

పుస్తక రచయిత శ్రీ రత్నాకర్‌ సదస్యుల మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయుల విజయగాథలు, తెలుగు సాహిత్యంపట్ల వారు చేసిన సేవ, నిర్మించ బడిన అత్యద్బుతమైన గుళ్ళు, గోపురాలు తనకు ఎంతో స్ఫూర్తి అని, దాని వలననే ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందన్నారు. సంవిత్‌ కేంద్ర కార్యదర్శి శ్రీ ఆయుష్‌ మాట్లాడుతూ జాతీయత, చరిత్రపైన పరిశోధించి చేసే రచనలకు తమ సహాయ సహకా రాలు ఉంటాయని మన చరిత్రను లిఖితపూర్వకంగా భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు.